అమరావతిలో వైసీపీ అభ్యర్థి ఎవరు ? – టిక్కెట్ సుచరితకే ఇస్తారా ?

ఏపీ రాజధాని అమరావతి ఉన్న తాడికొండ నియోజకవర్గ వైసిపిలో గందరగోళం ఏర్పడింది. ఆ పార్టీ అధిష్టానం పదేపదే సమన్వయకర్తలను మార్చడమే తప్ప దానివల్ల జరుగుతున్న పరిణామాల గురించి పట్టించుకోవడం లేదని కొందరు నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పదే పదే సమన్వయకర్తల మార్పు

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రాధాన్యతను తగ్గిస్తూ నియోజకవర్గ సమన్వయకర్తగా మాణిక్య వరప్రసాద్‌ను అధిష్టానవర్గం నియమించింది. దీంతో నాయకులు, కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడి పోటా పోటీగా కార్యక్రమాలు నిర్వహించారు. తాడికొండలో ఈ రెండు గ్రూపులూ బాహాబాహీ తలపడే పరిస్ఠితి ఏర్పడింది. అయినప్పటికీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. మాణిక్యవర ప్రసాద్‌ తాడికొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరపున పోటీచేసి రెండుసార్లు గెలుపొందారు. తనకు నియోజకవర్గంలో ఉన్న పట్టు, జగన్‌ సాన్నిహిత్యం తదితర కారణాల రీత్యా తాడికొండ అసెంబ్లీ సీటు తనకే దక్కుతుందనే ఆశతో మాణిక్య వరప్రసాద్‌ ఉన్నారు. కానీ ఆయనను పట్టించుకోలేదు.

మూడో సారి మార్చి సుచరితకు చాన్స్

శ్రీదేవి, వరప్రసాద్‌ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుండగానే అధిష్టానం సమన్వయ కర్తగా సురేష్‌ కుమార్‌ను నియమించడంతో గందరగోళం నెలకొంది. పార్టీ అధిష్టానం తనకే ఎమ్మెల్యే సీటు ఇస్తుందని, ఆ మేరకు తనకు హామీ లభించిందని సురేష్‌ కుమార్‌ ప్రచారం చేసుకున్నారు. కొంతమంది కార్యకర్తలు సురేష్‌ కుమార్‌ వెంట, కొంతమంది వరప్రసాద్‌ వెంట నడుస్తూ వచ్చారు. కార్యకర్తలు రెండు గ్రూపులుగా ఏర్పడిన సంగతి పార్టీ పెద్దలకు తెలిసినా సరిదిద్దే ప్రయత్నం చేయలేదని కొంతమంది నిరసన గళం వినిపిస్తూ వచ్చారు. పదేపదే సమన్వయకర్తలను మార్చడం వల్ల నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొందనే విమర్శలు చోటుచేసుకున్నాయి. అయినా అధిష్టానం పట్టించుకోక పోగా సురేష్‌కుమార్‌ను కాదని సుచరితను సమన్వయకర్తగా నియమించింది.

సుచరితకూ గ్యారంటీ లేదన్న ప్రచారం

సురేష్‌కుమార్‌ నియోజకవర్గానికి పూర్తిగా దూరమయ్యారు. వరప్రసాద్‌ మాత్రం జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతూ అడపా దడపా నియోజకవర్గంలో జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సురేష్‌కుమార్‌ మద్దతు వైసిపి గెలుపునకు చాలా అవసరం ఉంటుందని, సమన్వయకర్తలుగా నియమించి తొలగించడంతో వారితో పాటు కార్యకర్తల్లో అసంతృప్తి ఉంటుందని గ్రహించి అధిష్టానం సరిదిద్దే ప్రయత్నం చేయాలని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి. నాయకుల మధ్య సమన్వయం కుదిరేలా చర్యలు చేపట్టకుండా కార్యకర్తల మధ్య ఐక్యత ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. సుచరిత కూడా తనకు చివరి క్షణంలో హ్యాండిస్తారని అనుకుంటున్నారు. పెద్దగా దృష్టి పెట్టడంలేదు.