తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పోస్ట్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పదవి కోసం ఎంత తీవ్ర ఒత్తిడి ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవి కాలం పదో తేదీతో రెండు సార్లు అంటే నాలుగేళ్ల పదవి కాలం పూర్తవుతుంది. కొత్త టీటీడీ బోర్డును నియమించాల్సి ఉంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని సీఎజగన్ భావిస్తున్నారు.
రేసులో ముందున్న జంగా కృష్ణమూర్తి
పల్నాడు జిల్లాకు చెందిన బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి అవకాశం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది. జంగా వైసీపీ ఏర్పాటు నుంచి పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతానికి చెందిన బీసీ (యాదవ వర్గం)కు చెందిన నేత. పార్టీలోని బీసీ నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు సభ్యుడిగా పని చేసారు. ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన పేరును దాదాపుగాఖరారు చేశారని అంటున్నారు.
తమకు చాన్సివ్వాలని ఒత్తిడి తెస్తున్న ఇద్దరు ఉమ్మడి చిత్తూరు నేతలు
అయితే తాము ఎన్నికల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నామని తమకు చాన్సివ్వాలని సీఎం జగన్పై ఇద్దరు వైసపీ సీనియర్ నేతలు ఒత్తిడి తెస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇందుల ఒకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చెవిరెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఆయన కుమారుడ్ని రంగంలోకి దించుతున్నారు. పార్టీ పని కోసం ఆయనను జగన్ ఆయనను పోటీ నుంచి విరమించుకోవాలని సూచించారు. చాలాసార్లు టీటీడీ బోర్డు సభ్యునిగా..ఉన్నప్పటికీ చైర్మన్ గా చేయాలనేది చెవిరెడ్డి లక్ష్యం. అందకే సీఎం జగన్ మోహన్ రెడ్డికి తనకు అవకాశం ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారని చెబుతున్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా అదే కోరుతున్నారు. సీఎం జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన భూమన కరుణాకర్ రెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడం లేదు. ఆయన కుమారుడికి టిక్కెట్ ఇవ్వాలని కోరుతున్నారు. టీటీడీ చైర్మన్ గా చేసి రిటైర్ అవుతానని అవకాశం కల్పించాలని కోరుతున్నారు. గతంలో భూమన ఓ సారి టీటీడీ చైర్మన్ గా చేశారు.
కమిటీ వేస్తారా ?
పదో తేదీతో ముగియబోతున్న బోర్డు పదవి కాలన్ని పొడిగించే అవకాశం లేదు. కొత్తగా వేయాలి. అయితే కొత్త బోర్డు వేస్తారా? లేక… అధికారులతో కూడిన స్పెసిఫైడ్ అథారిటీని నియమిస్తారా? అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ బోర్డు లేకుండా స్పెసిఫైడ్ అథారిటీ ని ఏర్పాటు చేసి తనకు చైర్మన్ పదవి అప్పగించాలని ఐఏఎస్ కరికాల వలవన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా మంగళవారం ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన రిటైర్ అయినప్పటికీ పదవి కాలాన్ని ఏడాదికి పొడిగించారు. ఆయనకు రాజకీయ ఆశలు కూడా ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది.