శింగనమల అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిని మార్చింది. ఎస్సీ రిజర్వు నియోజకవర్గమైన ఈ ప్రాంతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వైసిపి నుంచి జొన్నలగడ్డ పద్మావతి ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమెకు ఈసారి అవకాశం లేదని అధిష్టానం తేల్చేసింది. కొత్త అభ్యర్థిగా వీరాంజనేయులుకు చాన్సిచ్చారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే భర్త అనుచరుడికే చాన్స్
సిట్టింగ్ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త అలూరు సాంబశివారెడ్డి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్‌రెడ్డికి అత్యంత సన్నిహితుల్లో ఒకరుగా చెప్పుకుంటూ ఉంటారు. సర్వేల్లో తగినంత సానుకూలత లేనందున మార్పు చేయాలని అధిష్టానం నిర్ణయించింది. గత వారంలో ఎమ్మెల్యే దంపతులు అక్కడే ఉండి టికెట్టు కోసం వారి ప్రయత్నాలు చేసుకున్నప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. ఈ క్రమంలోనే జొన్నలగడ్డ పద్మావతి సోషియల్ మీడియాలో సాగునీటి సమస్యపై మాట్లాడటం, అందులో వైసిపి ప్రజాప్రతినిధుల గురించి ప్రస్తావించడం పెద్ద దుమారమే రేపింది. తర్వాత సర్దుకున్నారు పార్టీ కోసం పనిచేస్తామన్న ప్రకటన కూడా చేశారు.
పద్మావతి భర్త ఆలూరు సాంబశివారెడ్డి చాయిస్ మేరకే కొత్త అభ్యర్థి
కొత్త అభ్యర్థిని సూచించే బాధ్యత కూడా వీరికే ఇచ్చారు సీఎం జగన్. వీరి సూచనల మేరకు శింగనమల మండలం సి. బండమీదపల్లి గ్రామానికి చెందిన యం. వీరాంజినేయులు శింగనమల నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించింది. వీరాంజనేయులు కంటే ముందే మాజీ ఎమ్మెల్యే శమంతకమణి కుటుంబసభ్యుల పేర్లు పరిశీలించారు. కానీ సర్వేల్లో సానుకూలత రాలేదు.
టీడీపీ తరపున బండారు శ్రావణికే చాన్సిస్తారా ?
ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో అయోమయమే కొనసాగుతోంది. 2019లో ఇక్కడ టిడిపి ఓటమి చెందింది. ఆ ఎన్నికల్లో పోటీ చేసిన బండారు శ్రావణినే కొంతకాలం నియోజకవర్గ ఇన్‌ఛార్జీగా నియమించారు. ఇక్కడి నేతలకు, ఈమెకు మధ్య పొగసకపోవడంతో విభేదాలు తారా స్థాయిలో చెలరేగాయి. దీంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జీని కాదని టుమెన్ కమిటీ పేరుతో ఇద్దరు నాయకులను తెరపైకి తెచ్చారు. వారి ఆధ్వర్యంలో అప్పుడప్పుడు కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. ఆ ఇద్దరు నాయకులు కూడా ఓసి సామాజిక తరగతికి చెందిన వారు కావడం గమనార్హం. ఎస్సీ రిజర్వు నియోజకవర్గం కావడంతో ఎస్సీ సామాజిక తరగతి నుంచి ఇన్‌ఛార్జీని నియమించాల్సి ఉంది. ఇప్పటికీ దీనిపై టిడిపిలో స్పష్టత రాలేదు. గతంలో పోటీ చేసి ఓటమి చెందిన బండారు శ్రావణినే మళ్లీ నియమిస్తారా లేక కొత్త వారిని నియమిస్తారా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. మరోవైపు మాజీ ఎపిసిసి అధ్యక్షులు సాకే శైలజనాథ్ టిడిపిలో చేరుతారన్న ప్రచరామూ ఉంది.