తిరుమలలో ఆనంద నిలయం దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గత వారం పరకామణిలో దొంగతనం జరిగింది. అంతకు ముందు తిరుమలలో గంజాయి పట్టుబడింది. ఇంకా చిన్నా చితకా .. అపచారాలు రోజూ జరుగుతూనే ఉన్నాయి. పరిస్థితి ఎంతలా మారిందంటే..అవన్నీ కామనేగా అనే పరిస్థితి వచ్చేసింది. హిందువుల ఆరాధ్య ప్రాంతం అయిన తిరుమలకు ఈ దుస్థితి ఎవరి వల్ల వచ్చింది ? దీనికి బాధ్యత ఎవరు తీసుకుంటారు ?
టీటీడీలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలం అయిందా ?
ఎన్నో కోట్లు పెట్టి.. ఆలయంలోకి చిన్న అనుమానాస్పద వస్తువు కూడా తీసుకెళ్లకుండా ఉండేలా టెక్నాలజీని రెడీ చేసుకున్నారు. కానీ కెమెరా ఎలా వెళ్లగలిగింది. పెన్ను కెమెరా అని మరొకటి అని కబుర్లు చెబుతున్నారు. అదయినా ఎలా వెళ్లగిలింది ? అనేది మాత్రం చెప్పడం లేదు. ఆనంద నిలయంలో విజువల్స్ తీసుకుంటే..ఇక దర్శనంకు వెళ్లినప్పుడు మూలవిరాట్టు దృశ్యాలు తీయలేదని గ్యారంటీ ఏంటి ?. కొండ మీద గంజాయి అమ్ముతున్నారు. సిగరెట్లు అమ్ముతున్నారు. మద్యం దొరుకుతుంది అనే మాట తరచూ వినిపిస్తోంది. ఇక తిరుమలలో భద్రతా వ్యవస్థ ఉన్నట్లా లేనట్లా ?
వ్యాపారస్తులే టీటీడీ బోర్డు సబ్యులు !
టీటీడీ బోర్డు నిండా వ్యాపారస్తులే ఉన్నారు. రియల్ ఎస్టేట్ పేరుతో వందల కోట్లకు ముంచిన ఓ సభ్యుడ్ని ఇటీవల తొలగించి.. జగన్ బయోపిక్ తీస్తున్న నిర్మాతను సభ్యుడిగా పెట్టారు. ఇలాంటి క్రైటీరియాతో జంబో టీటీడీ బోర్డును ఏర్పాటు చేశారు. చివరికి వారంతా టిక్కెట్లు అమ్ముకోవడానికి లాబీయింగ్‌లు చేసుకోవడానికి తమ పరపతిని వినియోగిసతున్నారు. టీటీడీ బోర్డు సభ్యుడు కాకపోయినప్పటిక విజయ్ కుమార్ స్వామి అనే వ్యక్తి తిరుమలలో సాగిస్తున్న హవా చూసిన వారికి ఇదేం అరాచకం అనిపించక మానదు. టీటీడీ బోర్డు పరిపాలనా దారుణంగా ఉండటం..అన్నీ నిబంధనల ఉల్లంఘనలే ఉండటంతో అన్ని వ్యవస్థల్లోనూ నిర్లక్ష్యం పేరుకుపోయింది.
సామాన్య భక్తులకు చుక్కలే !
సామాన్య భక్తులు.. ఏడాదికో..రెండేళ్లకో తిరుమలకు వెళ్లి ఒక్క క్షణం శ్రీవారిదర్శనం చేసుకుని వస్తూంటారు. వారికి. టీటీడీ బోర్డు చుక్కలు చూపిస్తుంది. ఓ కుటుంబం శ్రీవారి దర్శనానికి వెళ్లి రావాలంటే రూ. పదివేలు ఖర్చు పెట్టేలా చేస్తుంది. ఖర్చు పెట్టుకోలేకపోతే నరకం అనుభవించాల్సిందే. కొండపై మంచి నీళ్లు కూడా దొరకవు. ఇలా వెళ్లిన భక్తుల్లో పదిశాతం కూడా టీటీడీ కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేయరు. కొండ మీదే బహిరంగంగా విమర్శలు చేస్తూంటారు. అయినా టీటీడీ మేలుకోదు.
తిరుమలకు స్వతంత్ర ప్రతిపత్తి ఒక్కటే మార్గమా ?
తిరుమలలో పరిస్థితులు చూస్తూంటే.. హిందూ సమాజం రగిలిపోవడం ఖాయం. టీటీడీకి స్వతంత్ర ప్రతిపత్తి కల్పించడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నారు. అందుకే తిరుమలకు స్వతంత్ర ప్రతిపత్తి కావాలనే డిమాండ్ పెరుగుతోంది. టీటీడీ అధ్యాత్మిక వేత్తల చేతుల్లో ఉంటే ఇలాంటి ఘోరాలు జరుగవని చెబుతున్నారు. తక్షణం టీటీడీ బోర్డును రద్దు చేయాలి. టీటీడీకి స్వయం ప్రతిపత్తి కల్పించాలన్న డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది.