చారిత్రాత్మకంగానూ, ఆధ్యాత్మికంగానూ పేరొందిన పెద్దాపురం నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేడెక్కుతున్నాయి. 3వసారి మాజీ హోంమంత్రి, టిడిపి సిట్టింగ్ ఎంఎల్‌ఎ నిమ్మకాయల చినరాజప్ప ఇక్కడ నుంచి బరిలో నిలుస్తున్నారు. ఇప్పటికే ఆయన అభ్యర్థిత్వం ఖరారు అయింది. అదే సందర్భంలో వైసిపి నుంచి హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దవులూరి దొరబాబు పోటీలో నిలుచునే అవకాశం కనిపిస్తుంది. అధిష్టానం నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు.
వరుసగా రెండు సార్లు గెలిచిన చినరాజప్ప
పెద్దాపురం నియోజకవర్గంలో 6 సార్లు కాంగ్రెస్, 6 సార్లు టిడిపి, 2సార్లు సిపిఐ, ఒకసారి ప్రజారాజ్యం నుంచి ప్రజాప్రతినిధులుగా ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం నిమ్మకాయల చినరాజప్ప రెండోసారి ఎంఎల్‌ఎగా ఉన్నారు. 3వసారి గెలిచి హ్యటిక్ సాధించేందుకు సిద్ధపడుతున్నారు. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వైసిపి భారీ సీట్లను దక్కించుకోగా ఇక్కడ మాత్రం చినరాజప్ప రెండోసారి టిడిపి జెండాను ఎగురు వేశారు. టిడిపి పాలనలో నియోజకవర్గాన్ని మంత్రి హోదాలో బాగా అభివృద్ధి చేయడంతో ఇక్కడి ఓటర్లు రెండోసారి అవకాశం ఇచ్చారు. అయితే వైసిపి అధికారంలో ఉండడంతో రెండోసారి గెలిచినప్పటికీ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా నిధులను ఖర్చు చేసే అవకాశం రాలేదు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా పలుమార్లు చెప్పుకున్నారు.
మూడో సారి గెలిపించాలని కోరుతున్న చినరాజప్ప
3వసారి ప్రజలు ఆశీర్వదించాలని ముందుకు సాగుతున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన రాజప్ప సొంత నియోజకవర్గం అమలాపురం. అది ఎస్‌సి రిజర్వుడు కావడంతో ఆయన గతంలో ఎంఎల్‌సిగా ప్రజలకు సేవలు అందించారు. కొన్ని రాజకీయ సమీకరణాలు నేపథ్యంలో కోనసీమకు చెందిన ఈ నేత అనూహ్యంగా పెద్దాపురం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. ఈ సారైనా ఇక్కడ నుంచి సీటు దక్కుతుందని మాజీ ఎంఎల్‌ఎ బొడ్డు భాస్కర రామారావు కుమారుడు బొడ్డు వెంకటరమణ చౌదరి, ప్రముఖ కాంట్రాక్టర్ చంద్రమౌళి సీటు ఆశిస్తూ వచ్చారు. రాజప్పకు టిక్కెట్టు దక్కకుండా పలు సందర్భాల్లో పావులు కదిపారు. ఒక వర్గంగా ఏర్పడి తమకే టికెట్ దక్కాలని ఉద్దేశంతో నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాలను కూడా చేపట్టారు. ఎలాగైనా చిన్న రాజప్పను తప్పించి పోటీ చేయాలని భావించారు.
పొత్తుపై జనసేన నేతల అసంతృప్తి
చంద్రబాబు ఇటీవల తన పర్యటనలో భాగంగా ఇక్కడ మూడోసారి రాజప్పే పోటీ చేయనున్నట్లు బహిరంగ సభలో ప్రకటించారు. దాంతో బొడ్డు వెంకటరమణ చౌదరి, చంద్రమౌళి ఆశలు అడియాసలయ్యాయి. ఈ నేపథ్యంలో వారు రాజప్పకు సహకరించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు పొత్తు పార్టీగా ఉన్న జనసేన కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. తుమ్మల బాబుకి పొత్తులో సీటు దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. దీంతో అటు జనసేన నుంచి, ఇటు సొంత పార్టీలోని కేడర్ నుంచి ఏ మేరకు సహకారం ఉంటుందనే దానిపై అయోమయంలో రాజప్ప కొనసాగుతున్నారు.