తెలంగాణ కాంగ్రెస్ మాజీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎలాగైనా బయటకు పంపాలని ఓ వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ లో చేరికలపై తనను సీనియర్ గా సంప్రదించడం లేదని చివరికి సొంత జిల్లాల్లో నేతలను చేర్చుకుంటూ తనకు సమాచారం ఇవ్వడం లేదని హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. ఇలా జరిగిన తర్వాతి రోజే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి ఇంటికి వెళ్లారు కానీ.. ఉత్తమ్ వద్దకు వెళ్లలేదు. కానీ ఉత్తమ్ పార్టీ మారుతున్నారన్న ప్రచారం మాత్రం ఊపందుకుంది.
ఉత్తమ్ పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం
తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్టీ మారతారని ఒక్క ప్రచారం ప్రారంభమయింది. బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళుతున్నారని కాంగ్రెస్ లో ముఖ్య నేతలకు సన్నిహితమైన వారి సోషల్ మీడియాల్లో ప్రచారం చేయడం ప్రారంభించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ఆయన భార్య ఉత్తమ్ పద్మావతి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళుతున్నారని రూమర్లు వెల్లువెత్తాయి. అన్ని చర్చలు జరిగాయని, జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లోకి చేరిన రోజే, బీఆర్ఎస్ పార్టీలోకి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వస్తారని విశ్లేషణలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ఆయన తాను పార్టీ మారబోవడం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరిగే ప్రచారాలు అబద్ధాలని చెప్పుకొచ్చారు. పార్టీ వీడుతున్నట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలు చేస్తే న్యాయపరంగా ఎదుర్కొంటానని ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
గతంలో సొంత పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల ట్రోలింగ్
గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సోషల్ మీడియాలో కోవర్ట్ ముద్ర వేసి ప్రచారం చేశారు. దానిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పుడే
సోషల్ మీడియాలో తమపై దుష్ప్రచారం చేస్తూ పెట్టిన పోస్టింగుల వెనుక కాంగ్రెస్ పార్టీ ముఖ్యులే ఉన్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తమను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో చేసిన పోస్టింగుల వెనుక ఎవరున్నారో కొన్ని రోజుల తర్వాత వివరంగా చెబుతానన్నారు. ఏ ఎల్లిగాడో మల్లిగాడో ప్రశాంత్ పెట్టిన పోస్టులు కావని తేల్చి చెప్పారు. అప్పుడే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై సొంత పార్టీలో కుట్ర జరుగుతోందని తేలిపోయింది.
ఉత్తమ్ ను బయటకు పంపేయాలనుకుంటున్నారా ?
ఉత్తమ్ కుమార్ రెడ్డిని బయటకు పంపాలని కాంగ్రెస్ లోని ఓవర్గం గట్టిగా ప్రయత్నిస్తోందని చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన ను అన్ని రకాలుగా ట్రోలింగ్ చేశారు. కోవర్ట్ అనే ముద్ర వేశారు. పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని చాలా కాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు నేరుగా పార్టీలో చేరిపోతున్నారని అంటున్నారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తూంటే. తెలంంగాణ కాంగ్రెస్ లో ఎలాంటి మార్పు రాలేదని స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి.