ఏటా వైశాఖ శుద్ధ తదియ రోజు సింహాచలం వరాహ లక్ష్మీనారసింహ స్వామి చందనోత్సవం జరుగుతుంది. సింహాచలేశ్వరుడిపై ఉన్న చందనం పూతను తొలగించి భక్తులకు నిజరూప దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు. ఈ చందనోత్సవం ఎప్పటి నుంచి చేస్తున్నారు..ఎందుకు చేస్తున్నారో తెలిపే కథనం ఇది…
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి దేవాలయాలు మన దేశంలో చాలా ఉన్నాయి..అయితే వరాహం, నారసింహ అవతారాలు కలిసున్న విగ్రహం కొలువైన దేవాలయం కేవలం సింహాచలం మాత్రమే. ఈ స్వామి దర్శనమే మహాభాగ్యంగా భావిస్తారు..మరి నిజరూపాన్ని దర్శించుకోవాలంటే ఇంకెంత అదృష్టం చేసుకోవాలో. ఏడాదికోసారి చందనోత్సవం పేరుతో భక్తులకు ఈ భాగ్యం కలుగుతుంది..ఆ రోజే వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ). ఈ ఏడాది ఏప్రిల్ 23న వచ్చింది..
ప్రహ్లాదుడు ప్రారంభించిన చందనోత్సవం
హిరణ్యాక్షుడనే రాక్షసుడిని వధించేందుకు శ్రీమహావిష్ణువు వరాహావతారాన్ని, హిరణ్యకశిపుణ్ని సంహరించేందుకు నృసింహావతారాన్ని దాల్చాడు. అసురులైన అన్నదమ్ములు ఇద్దర్నీ వధించేందుకు శ్రీహరి వరుసగా ధరించిన అవతారాలివి. హిరణ్యాక్షుడిని వధించి వరాహ అవతారాన్ని విరమించేలోగా… ప్రహ్లాదుడు పిలవడంతో భక్తుడిని రక్షించాలనే తొందర్లో వరాహ రూపం వదలకుండానే నృసింహుడిగా ప్రత్యక్షమయ్యాడు. అందుకే వరాహం, నృసింహ రూపం కలసిపోయింది. అయితే ఏడి శ్రీహరి…ఈ స్తంభంలో ఉన్నాడా చూపించు అని గర్జించిన హిరణ్యకశిపుడిని సంహరించిన తర్వాత కూడా నృసింహుడు ప్రళయ భీకరం రూపం మారలేదు. ఆ సమయంలో దేవతలంతా కలసి ప్రార్థించినా ఫలితం లేకపోయింది. అప్పుడు బ్రహ్మకు గుర్తొచ్చింది చందన వృక్షం. తాపాన్ని నివారించే శక్తిని చందనవృక్షానికి ప్రసాదించింది బ్రహ్మే. ఆ విషయం గుర్తుచేసుకుని ప్రహ్లాదుడికి సూచించాడు బ్రహ్మ. అప్పుడు ప్రహ్లాదుడు చేసిన చందన సేవ వల్ల నారసింహుడు శాంతించాడు. ఆ తర్వాత ప్రహ్లాదుడి కోరిక మేరకు వరాహం, నృసింహ రూపంలో సింహగిరిపై కొలువయ్యాడు. ఇదంతా అక్షయ తృతీయ రోజు జరిగింది.
పురూరవుడితో తిరిగి ప్రారంభమైన చందన సేవ
ప్రహ్లాదుడి తదనంతరం కాలం వరాహ నారసింహకృతి మట్టిపుట్టలో నిక్షిప్తమైంది. ఆ తర్వాత కొంతకాలానికి పురూరవ చక్రవర్తి తన పుష్పక విమానంలో ఊర్వశితో కలిసి ప్రయాణిస్తుండగా ఆ విమానం సింహగిరిపైకి వచ్చేసరికి ఉన్నట్టుండి ఆగిపోయింది. ఊర్వశి తన దివ్యదృష్టి ద్వారా ఈ కొండ అత్యంత మహిమాన్వితమైనదని పురూరవ చక్రవర్తికి వివరిస్తుంది. ఆ రాత్రికి అక్క డే బస చేయడంతో…స్వామివారు కలలో కనిపించి తాను ఇక్కడే కొలువై ఉన్నానని ఉత్సవం చేయాలని కోరాడు. అలా పుట్టలోంచి స్వామివారి విగ్రహాన్ని వెలికితీసి వైభవంగా చందనోత్సవం నిర్వహించినట్టు చెబుతారు. స్వామి 12 అడుగుల పుట్టలో వచ్చినందుకు గుర్తుగా ఉత్సవం తదుపరి దశల వారీగా 12 మణుగుల చందనాన్ని సమర్పిస్తూ వస్తున్నారు.
స్వామి చల్లగా ఉంటేనే జగమంతా చల్లగా ఉంటుంది
వరాహ ముఖం, నరుని శరీరం, తెల్లని జూలు, రెండు చేతులు, భూమిలో దాగివున్నపాదాలు.. ఈ నిజరూప స్వామి దర్శనం అక్షయ తృతీయ రోజు మాత్రమే కొన్ని గంటలు సేపు ఉంటుంది. ఆ సమయంలో లక్షలాది భక్తులు స్వామిని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజల అనంతరం తిరిగి చందనం లేపనం చేయడంతో శివలింగాకారుడుగా దర్శనమివ్వడం అద్వైత దర్శనానికి ప్రతీక. స్వామి చల్లగా ఉంటేనే జగమంతా చల్లగా ఉంటుందని భక్తుల విశ్వాసం.
గమనిక: ఒక రాశిలో పేర్కొన్న ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ వ్యక్తిగత పూర్తి వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య శాస్త్ర పండితులను సంప్రదించగలరు. ఈ ఫలితాలను ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.