బీఆర్ఎస్‌కు వేల కోట్ల విరాళాలిచ్చిందెవరు ?

దేశంలో అతి చిన్న రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న బీఆర్ఎస్ పార్టీ దగ్గర క్యాష్ అంటే నగదే.. రూ. 1250 కోట్లు ఉందని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా ప్రకటించారు.
దేశంలో బీజేపీ తర్వాత అత్యంత ధనిక పార్టీగా బీఆర్ఎస్ నిలుస్తోంది. స్వయంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అధికారిక ఆస్తుల గురించి ప్రకటించారు. పార్టీ ఫండ్ రూ. 1250 కోట్లకు చేరిందని పార్టీ నేతలకు తెలిపారు. ఇందులో రూ. 767 కోట్ల రూపాయల క్యాష్ ను బ్యాంకుల్లో డిపాజిట్ చేశారు. దీని నుంచి నెలకు 7 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఆ డబ్బుతో పార్టీని నడపడం, జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణాలు చేయడం, ప్రచారం, మౌలిక వసతులకు ఖర్చుపెడుతున్నారు. కానీ ఇంత నగదు ఎవరు ఇచ్చారు.. ఎందుకు ఇచ్చారన్నది మాత్రం కేసీఆర్ చెప్పలేదు.

బీఆర్ఎస్ పై తీవ్ర అవినీతి ఆరోపణలు!

తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉన్నప్పటి నుండి ఆ పార్టీ ఆర్థిక వ్యవహారాలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల తెలంగాణలో భూదందాలు పెరిగిపోయాయని.. చెబుతున్నారు. ధరణి అనే సాఫ్ట్ వేర్ ను తీసుకు వచ్చి వివాదాస్పద భూములన్నింటినీ అయిన వాళ్లకు కట్టబెట్టేసి వారి దగ్గర నుంచి పార్టీ ఫండ్ తీసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ సంస్థలకు తమ బ్లాక్ మనీ ఇచ్చి వారితో వైట్ రూపంలో తమ పార్టీకి ఫండ్ రూపంలో జమ చేసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇన్ని ఆరోపణల మధ్య తమ పార్టీ నగదు వేయి కోట్లు దాటిపోయిందని కేసీఆర్ స్వయంగా ప్రకటించడం సంచలనం అవుతోంది.

ఆ డబ్బుతోనే ఇతర రాష్ట్రాల్లో రాజకీయాలు చేస్తామన్న కేసీఆర్!

బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో వచ్చిన విరాళాలతోనే ఇతర రాష్ట్రాల్లోని పార్టీని నడుపుతామన కేసీఆర్ ప్రకటించారు. ఇక పార్టీకి కోశాధికారిని నామమాత్రం చేశారు. ఆర్థిక వ్యవహారాలన్నీ తన చేతుల్లోనే ఉండేలా చేసుకున్నారు. ఈ మేరకు పార్టీ రాజ్యాంగంలోనే మార్పులు ేచసుకున్నారు. పార్టీ ఆర్థిక వ్యవహారాల అధ్యక్షులే చూసుకుంటారని ప్లీనరీలో తీర్మానం చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఖాతాలు తెరవడం,  కోశాధికారి అధ్యక్షుడికి సహాయకుడిగా వ్యవహరించడం, పార్టీ ప్రచారం కోసం దేశవ్యాప్తంగా మీడియా వ్యవస్థలను ఏర్పాటు చేయడం.. తదితర ఆర్థిక వ్యవహారాలను పార్టీ జాతీయ అధ్యక్షునికి కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఇక .. ఆ డబ్బులపై పూర్తి అజమాయిషీ కేసీఆర్ దే అన్నమాట.

భారీ ఎత్తున మీడియాను ఏర్పాటు చేసే యోచనలో కేసీఆర్

ఇటీవల కేసీఆర్.. దేశంలో మోదీకి తనను లీడర్‌గా పెట్టుకుంటే అన్ని రాజకీయ పార్టీల ఖర్చూ తానే భరిస్తానని హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దీనిపైఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ.. బీఆర్ఎస్ పార్టీకి అఫీషియల్‌గానే వేల కోట్ల ధనం ఉందని స్పష్టంగా చెప్పారు. పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి TV యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా చేపడతామని కేసీఆర్ ప్రకటించారు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టీవీ ఛానల్ కూడా నడుపుతామన్నారు కేసీఆర్. నిజానికి మనస్తే తెలంగాణ పత్రికతో పాటు టీ చానల్ కూడా బీఆర్ఎస్‌దే. అసలు టీ చానల్ ఆఫీసు.. బ్రాడ్ కాస్టింగ్ మొత్తం తెలంగాణ భవన్ నుంచే నడుస్తోంది. అయినా పార్టీ తరపున చానల్ పెడతానని కేసీఆర్ ఎందుకన్నారో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకూ అర్థం కాలేదు. అయితే కేసీఆర్ పెట్టాలనుకుంటున్నది లోకల్ చానల్ కాదని.. జాతీయ చానెల్ అని తెలుస్తోంది. మొత్తంగా ప్రాంతీయ పార్టీల్లో అత్యధిక విరాళాలు బీఆర్ఎస్‌కే వచ్చాయి. ఎలా వచ్చాయన్నది మాత్రం సీక్రెట్ గానే ఉండిపోయింది.