దేవుడి దగ్గరు వెళ్లేవారిలో నూటికి 99 శాతం మంది ఏవో కోర్కెలు నెరవేరాలనే ఏకరువు పెడతారు. అనుకున్నది తీరితే మళ్లీ మొక్కులు చెల్లించుకుంటాం అని మొక్కుకుంటారు. అయితే ఈ దేవాలయంలో మాత్రం మీరు కోరుకున్న కోర్కె తీరుతుందో లేదో వెంటనే తెలిసిపోతుదట. అదే శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం. కాకతీయుల కాలంలో వరంగల్ లో నిర్మించిన ఎన్నో దేవాలయాల్లో ఈ ఆలయం ఒకటి
ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉంది.
దాదాపు వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉన్న పుణ్యక్షేత్రం శ్రీ హనుమద్గిరి లక్ష్మీ నరసింహ స్వామి. ఈ ఆలయంలో దేవుడు గుహలో ఉంటాడు. అదే గుహలో నీటి కోనేరు ఉంది. పూర్వం ఇద్దరు మునులు ఆ గుహలో కూర్చుని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ధ్యానం చేస్తుండగా స్వామి వారు అక్కడ ప్రత్యక్షం అయ్యారని చెబుతారు. ఎక్కడైతే ఈ మునులు కూర్చుని ధ్యానం చేశారో అక్కడే మన కోరికలు నెరవేరుతాయో లేదో అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఆ గుహ లోనే ఉన్న కోనేరులోని నీటిని తీసుకుని ఆ ప్రాంతంలో రెండు చుక్కలు వేస్తే మన మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందా లేదా అనేది అక్కడే నిరూపణ అవుతుందట
కోనేర్లో నీరు లేకపోవడం జరగదు
ఈ ఆలయం గర్భగుడిలో కోనేరు ఉంటుంది ఈ కోనేరులోని నీటితోనే స్వామివారికి నిత్యం అభిషేకం చేస్తూ ఉంటారు. ఏ కాలంలో అయినా ఈ కోనేరులో నీరు ఇంకిపోదు. అంతేకాకుండా ఈ కోనేరులోకి నీరు ఎక్కడ నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. స్వామివారు ఇక్కడ ఉన్నారనేందుకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని ఇక్కడి అర్చకులు చెబుతున్నారు. ఈ జలంతో స్వామిని అభిషేకిస్తే మన మనస్సులో ఉన్న కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. అంతేకాదు ఆ నీటిని తలపై చల్లుకుంటే సర్వ రోగాలు నయం అవుతాయని విశ్వాసం.
రోజూ ఉదయం 11 వరకే!
రోజూ ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారికి అభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు ఉంటాయి. శనివారం రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. స్వామి వారికి నిత్య హారతి ఉంటుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక పూజల కోసం ఏమీ చెల్లించనవసరం లేదు కానీ ఆలయ అభివృద్ధి కోసం సహాయం చేయాలి అనుకుంటే చేయొచ్చు. హన్మకొండ సిటీ బస్ స్టాప్ నుండి లోకల్ ఆటోలో ఈ ఆలయానికి చేరుకోవచ్చు.
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.