పవన్ ఎక్కడ – పోలింగ్ సరళిపై పోస్టు మార్టం చేస్తున్నారా ?

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి. నెలల తరబడి ఎన్నికల వ్యూహాలు, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమైన నాయకులు.. గెలుపు భారం దేవుడిపై వేసి రిలాక్స్‌ మూడ్‌లోకి వెళ్తున్నారు. ఆపధర్మ ముఖ్యమంత్రి జగన్ కోర్టు పర్మిషన్ తీసుకుని మరీ కుటుంబసమేతంగా లండన్ వెళ్లారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్ విదేశీ పర్యటనలో ఉన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు.

పార్టీ నేతలతో పవన్ వరుస సమావేశాలు

హైదరాబాదులో ఆయన తన పార్టీ ముఖ్యులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న జనసేన ముఖ్య నాయకులతో 120 నుంచి 140 సీట్లు వరకు కూటమి గెలుస్తుందని.. జనసేన 18 స్థానాల్లో గెలుపొందుతుందని.. జనసేన పోటీ చేసిన మచిలీపట్నం, కాకినాడ పార్లమెంట్ స్థానాలు కూడా కైవసం చేసుకుంటామని.. ధీమా వ్యక్తం చేశారని చెబుతున్నారు. పోలింగ్ పూర్తవ్వగానే పవన్ కళ్యాణ్ వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లివచ్చారు.

పోలింగ్ సరళిపై విశ్లేషణ

మరోవైపు ప్రతి నియోజకవర్గంలో బూత్‌ల వారీగా పోలైన ఓట్లు.. కూటమికి వచ్చే మెజార్టీలపై ఆరాదీస్తూ లెక్కలు సేకరిస్తున్నారంట. హైదరాబాద్ నుంచే నియోజకవర్గం వారీగా సమీక్షలు నిర్వహిస్తూ.. జనసేన ఓటు బ్యాంకు ఎక్కువ ఉన్న నియోజకవర్గ నేతలను పిలిపించుకొని మాట్లాడుతున్నారంట. రేపు గెలుపొందిన తర్వాత ఎక్కువ శాతం రాజకీయాలకే పరిమితం కావాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచనగా కనిపిస్తుంది అంటున్నారు నాయకులు. గెలిచాక వీలైనంత త్వరగా చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసుకుని పూర్తిస్థాయి పొలిటీషియన్‌గా మారాలని భావిస్తున్నారంు.

కూటమి ప్రభుత్వం ఖాయమని అంచనా !

గోదావరి జిల్లాలు ఉత్తరాంధ్ర జిల్లాల్లో జన సైనికులు కూటమితో కలిసి పనిచేసిన తీరుపై ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారంట. కూటమి అధికారంలోకి వస్తుందని బలంగా నమ్ముతున్న పవన్ కళ్యాణ్ దానికి అనుగుణంగా.. ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయవలసిన వాటిపై ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో జనసేనకు మూడు మంత్రి పదవులు దక్కుతాయంటున్నారు. సినిమా పనులు పూర్తి చేసుకోవడానికి ఏడాది టార్గెట్ పెట్టుకున్న పవన్ అప్పటి వరకు కేబినెట్లో చేరే అవకాశం లేదంటున్నారు.