కైలాస పర్వతం. సాక్షాత్తు పరమశివుడు నివాసం ఉండే ప్రాంతం. యుగయుగాలుగా పంచాక్షరీ మంత్ర జపంతో మారుమోగుతున్న పవిత్ర ప్రదేశం. కేవలం హిందువులకే కాదు, జైనులకి, బుద్ధిస్టులకి కూడా అతిపవిత్రమైన పర్వతం. పరమేశ్వరుడి నివాసంగా చెప్పే కైలాస పర్వతానికి నాలుగు రూపాలు ఉన్నాయి. నాలుగు దిక్కుల్లో చూస్తే ఒక్కో దిక్కువైపునుంచి ఒక్కో రూపంలో కనిపిస్తుంది. ఈ పర్వతంపై అణువణువునా ప్రత్యేకతలే!
కైలాస పర్వతంపై ట్రెక్కింగ్ దోషం
నలువైపులా మంచుతో కప్పిఉండే ఈ పర్వతం వెండికొండలా మిలమిలా మెరుస్తూ కనిపిస్తుంది. పౌర్ణమి రోజు రాత్రివేళల్లో కూడా ఆ మెరుపులు చూడొచ్చు. ప్రపంచంలో ఇంతవరకూ ఎవ్వరూ కైలాస పర్వతాన్ని అధిరోహించలేదు. ఎవ్వరికీ సాధ్యం కాలేదు కూడా. పూర్వకాలం కొందరు సాధువులు కైలాస పర్వతంపైకి వెళ్లాలని భావించి ఆ ప్రయత్నం చేసి మధ్యలోనే అదృశ్యమయ్యారు. వాళ్లు ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. ఈ పర్వతం వాలుపై ఎవ్వరూ కాలుపెట్టలేరు, ఇక్కడ పాదం మోపడం కూడా అపచారం అని భావిస్తారు. పర్వత పవిత్రకు, అక్కడ నివసించే దైవ శక్తికి భంగం కలుగుతుందని వారి నమ్మకం. కైలాస పర్వతం దగ్గర మానస సరోవర్, రాక్షస తాల్ అనే రెండు అందమైన సరస్సులు ఉన్నాయి. మానస సరోవరం 14,950 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోనే ఎత్తైన మంచినీటి సరస్సుగా చెబుతారు.
మానస సరోవరం
కైలాస పర్వతానికి పాదపీఠంలోనే మానస సరోవరం ఎంతో అపురూపంగా దర్శనమిస్తుంటుంది. మానస్ అంటే మెదడు. అంటే బ్రహ్మ తన మెదడు నుంచి ఈ సరస్సును సృష్టించాడని హిందూ పురాణాలు చెబుతున్నారు. పూర్వం శివుడు ఉదయం 3 నుంచి 5 గంటల మధ్యలో బ్రహ్మ ముహూర్తంలో ఈ మానస సరోవరంలోనే స్నానం ఆచరించేవాడని పండితులు చెబుతారు. ఈ సరస్సుకు చుట్టుపక్కల ఉండే గుహల్లో చాలామంది మునులు కొన్ని వేల సంత్సరాలు తపస్సు చేశారంటారు.
బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రం
బౌద్ధులకు అత్యంత ముఖ్యమైన పుణ్య క్షేత్రంగా ఈ ప్రాంతం పూజలు అందుకుంటోంది. కైలాస పర్వత శిఖరంపై కొలువైన డెమ్‌చొక్ ( బుద్ధుని ఉగ్రరూపం) ను బౌద్ధ మతస్థులు పూజిస్తుంటారు. దీనినే ధర్మపాలగా పిలుస్తుంటారు. తమను నిర్వాణానికి చేర్చే పుణ్యధామంగా బౌద్ధ మతస్థులు ఈ క్షేత్రాన్ని బలంగా విశ్వసిస్తుంటారు. తొలి తీర్థాంకరులు ఇక్కడే నిర్వాణం పొందారని జైన మతస్థుల నమ్మకం. గురునానక్ ఇక్కడే ధ్యానం చేశారని కొందరు చెబుతుంటారు.
నాలుగు వైపులా 4 రూపాలు
సమస్త మానవాళికి అర్థంకాని రహస్యాలు ఇక్కడెన్నో ఉన్నాయి. హిందూమతం ప్రకారం శివుడు, పార్వతీ సమేతుడై ఇక్కడే కొలువై ఉన్నాడని పురాణాలలో కొన్ని కథలు కూడా వున్నాయి. మొత్తం ఆసియాలోనే పొడవైన నదులుగా పేరుగాంచిన బ్రహ్మపుత్ర, సింధూ, సట్లజ్, గంగానదికి ఉపనది అయిన కర్నాలి మొదలైన నదుల మూలాలు ఈ పర్వత ప్రాంతంలోనే ఉన్నాయి. కైలాస పర్వతం నలువైపులా నాలుగు రూపాల్లో కనిపిస్తూ నాలుగు రంగుల్లో దర్శనమిస్తుంటుంది. ఒకవైపు సింహం, రెండోవైపు గుర్రం, మూడోవైపు ఏనుగు, నాలుగోవైపు నెమలిలాగా ఈ పర్వతశిఖరం కనిపిస్తుంది. పార్వతీ సమేతుడై నిరంతరం ధ్యాన పరిస్థితిలో ఉంటాడు. విష్ణుపురాణం ప్రకారం కైలాస పర్వత నాలుగు ముఖాలు స్ఫటిక, బంగారం, రుబి, నీలం రాయితో రూపొందించినట్లు చెబుతారు.తామర పువ్వు ఆకారంలో ఉన్న ఆరు పర్వతాల మధ్య ఈ కైలాస పర్వతం ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
సైన్స్ కి అంతుపట్టని రహస్యాలెన్నో
దీనిని మూఢవిశ్వాసంగా భావించిన చైనా ప్రభుత్వం వారు దీనిపై పరిశోధనలు కూడా చేశారు. రెండుసార్లు ఈ పర్వతంపై పంపించిన హెలికాప్టర్లు మధ్యలోనే కూలిపోయాయి. అప్పటినుంచి ఈ పర్వతం జోలికి ఎవ్వరు వెళ్లలేదు. ఈ పర్వత ఉపరి భాగంలో ఏముందో తెలుసుకోవడానికి సైన్స్ కి కూడా ఇంతవరకు అంతపట్ట లేదు.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం