కొత్తగా పెళ్లైన వాళ్లు ఆషాడంలో కలసి ఉంటే ఏమవుతుంది!

ఆషాడ మాసం ప్రారంభం కాగానే కొత్తగా పెళ్లైన దంపతులను దూరంగా ఉంచుంతారు. అమ్మాయిని పుట్టింటివారొచ్చి తీసుకెళ్లిపోతారు. ఒకరోజో రెండు రోజులో కాదు ఏకంగా నెల రోజుల పాటూ అత్తారింట్లో అమ్మాయి అడుగుపెట్టదు. అల్లుడు కూడా భార్య పుట్టింటికి రాడు. ఈ నియమం అసలు ఎందుకు పెట్టారు? పాటించకపోతే ఏమవుతుంది? ఎందుకిలా చేస్తారు? ఒకవేళ నూతన దంపతులు కలసి ఉంటే పర్వాలేదా? దీనివెనుకున్న ఆంతర్యం ఏంటి, పండితులు ఏమంటున్నారో చూద్దాం.

ఆషాడంలో ఎడబాటు ఎందుకు!
ఆషాడం సెంటిమెంట్ పెళ్లైన వాళ్లందరకీ ఉండకుండా కేవలం నూతన దంపతులకు మాత్రమే ఎందుకు ఉంటుంది…ఏ నెలకీ లేని నిబంధన ఆషాడంలోనే ఎందుకనే సందేహాలకు పండితులు ఇచ్చే సమాధానం ఇది. నూతన దంపతుల బంధం అప్పుడే ప్రారంభమవుతుంది. పెళ్లి జరిగిందో లేదో రెండు కుటుంబాల్లో పెద్దలు అమ్మాయి నెలతప్పిందన్న శుభవార్త కోసం ఎదురుచూస్తుంటారు. ఆషాడ మాసంలో నెలతప్పితే సరిగ్గా ఎండలు ముదిరే సమయంలో ప్రసవం అవుతారు. అంటే మార్చి నుంచి మే లోగా డెలివరీ ఉంటుంది. ఆ సమయంలో పుట్టిన శిశువు వేడి వాతావరణానికి అల్లాడిపోతుంది. తల్లికి కూడా అనారోగ్య సమస్యలు తప్పవు. వేసవి సీజన్ తల్లీబిడ్డల ఆరోగ్యానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదు. అందుకే ఈ నెల రోజులూ నూతన వధూ వరులను దూరంగా ఉంచే సంప్రదాయం తీసుకొచ్చారు. తిరిగి శ్రావణమాసంలో భర్త వద్దకు పంపించిన తర్వాత అమ్మాయి నెల తప్పినా వాతావరణంలో వేడి తీవ్రత తగ్గేసరికి ప్రసవం ఉంటుందని. అందుకే నూతన వధూవరులను ఈ నెలలో దూరంగా ఉంచే సంప్రదాయం తీసుకొచ్చారు.

అల్లుడు అత్తవారింటికి ఎందుకు వెళ్లకూడదు!
ఆషాఢమాసంలో వానలు జోరందుకుంటాయి. ఇంట్లో అందరూ వ్యవసాయ పనులపై పొలాలకు వెళ్లినా..కొత్తగా పెళ్లైన జంట ఇల్లు కదలేందుకు అస్సలు ఆసక్తి చూపించరు. ఇప్పుడంటే ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారు కానీ అప్పట్లో అన్నీ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కదా. పైగా కుటుంబంలో సభ్యులంతా కలసి వ్యవసాయ పనులు చేసుకునేవారు. అలాంటప్పుడు కొత్తగా పెళ్లైన వాళ్లు ఇంట్లోంచి కదిలేందకు సుముఖంగా ఉండరు. ఆ ప్రభావం మిగిలిన వారిపై కూడా పడుతుంది. అందుకే ఆ సమయంలో కోడలిని పుట్టింటికి పంపించేసి అత్తింటివారంతా వ్యవసాయ పనుల్లో మునిగితేలుతారు. కొత్త అల్లుడు అత్తవారింటి గడప తొక్కకూడదన్న సంప్రదాయం కూడా ఇందుకే వచ్చిందంటారు.

కొత్త పెళ్లికూతురికి హోం సిక్
కొత్తగా పెళ్లై అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆడపిల్ల ఒక్కసారిగా తల్లిదండ్రులను వదిలేసి ఉండాలంటే ఇబ్బంది పడతారు. ఇప్పుడంటే పెళ్లికి ముందు నుంచీ పరిచయాలు, రాకపోకలు సాగిపోతున్నాయి. పెళ్లైన తర్వాత కూడా ఫోన్లున్నాయి. కానీ అప్పట్లో ఇవేమీ ఉండేవి కాదుకదా. పెళ్లైన వెంటనే వచ్చేసి అత్తారింట్లో వాతావరణానికి అడ్జెస్ట్ అయ్యేలోగా మధ్యలో వచ్చే చిన్న బ్రేక్ ఆషాడం.

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం