ఆషాడ పౌర్ణమి ప్రత్యేకత ఏంటి, గురు పూర్ణిమ ( జులై 3) ఎందుకు జరుపుకోవాలి!

గురు బ్రహ్మ గురుర్విష్ణు:
గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

అమ్మా నాన్న తర్వాత సమస్త లోకాన్ని ఎలా చదవాలో నేర్పించేది గురువే. ఆ పాఠాలే భవిష్యత్ జీవితానికి పునాదులుగా నిలుస్తాయి. ఈ ఏడాది జూలై 3 సోమవారం గురుపూజా మహోత్సవం. హిందూమతంలో గురు పూర్ణిమను చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ సందర్భంగా గురుపూర్ణిమ విశిష్టత ఏంటో తెలుసుకుందాం.

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే
నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమః’
సాక్షాత్ విష్ణుస్వరూపుడు, జ్ఞాననిధి, వసిష్ఠ వంశోద్బవుడైన వేదవ్యాసునికి నమస్కారం అని ఈ శ్లోకానికి అర్థం

వ్యాస మహర్షి పుట్టిన రోజు
గురువును బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా పూజించే గొప్ప సంస్కృతి మనది. గు అంటే అంధకారం/ చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. అజ్ఞానాంధకారాన్ని తొలగించే గురువు సాక్షాత్తు బ్రహ్మ అనడంలో సందేహం లేదని వేదాలు చెపుతున్నాయి. పూర్వం గురుకుల విద్యా విధానం అమలులో ఉన్న సమయంలో శిష్యులు గురువులను దైవంతో సమానంగా పూజించేవారు. ఆ గురువులు కూడా శిష్యులని తమ కన్న బిడ్డలకన్నా మిన్నగా ప్రేమించే వారు. మనలో జ్ఞానజ్యోతిని వెలిగించే గురువుకి ఓ రోజుంది. ఆషాఢ శుద్ధపౌర్ణమి వ్యాస ముహాముని జన్మతిథి. అందుకే ఈ రోజునే గురుపౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా జరుపుకుంటారు.

ఆషాడ పౌర్ణమి ప్రత్యేకత
ఆది యోగి, ఆది గురువైన మహా శివుడు ఆషాఢ పౌర్ణమి నాడు సప్తర్షులకు జ్ఞానబోధ చేశాడని శివపురాణం చెబుతోంది. ఆషాఢ పౌర్ణమి దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేసిన రోజుగా దత్త చరిత్ర చెబుతుంది. వ్యాస మహాముని ఈ రోజున సత్యవతి (మ‌త్స్య‌గంధి),ప‌రాశ‌ర మ‌హ‌ర్షికి జన్మించాడని, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇదే రోజున వేదాన్ని బుగ్వేదం, యజుర్వేదం, సామవేదం , అధర్వణ వేదం విభజించాడని చెబుతారు.

గురు పౌర్ణమి రోజు ఇలా చేయండి
గురు పూర్ణిమ నాడు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని చాలా మంది హిందువుల విశ్వాసం. గురు పౌర్ణమి చాతుర్మస దీక్ష ప్రారంభ సమయంలో వస్తుంది. అంటే గురువులు ఎక్కడికీ వెళ్లకుండా ఒకేచోట ఉండి శిష్యులకు జ్ఞానబోధ చేసే సమయమే చాతుర్మాసం. ఈ కాలంలో వచ్చే తొలి పౌర్ణమినే గురు పౌర్ణమి అంటారు. ఈ రోజున గురుపూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటే సకల విద్యాభివృద్ధి ఉంటుందంటారు. గురు పౌర్ణమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి పూజకు ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో దేవుడికి నమస్కరించి ఆ తర్వాత గురువుల వద్దకు వెళ్లి కాళ్లు కడిగి పూజ చేసి శక్తికొలది వస్త్రాలు, స్వీట్స్, పండ్లు ,డబ్బులు సమర్పించి గురువుల ఆశీర్వచనం పొందాలి.

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.