ఏడువారాల నగలు..ఈ పేరులోనే నిండుదనం ఉంది. ఏంత బంగారం ఉన్నా ఏడువారాల నగలు అనే మాట వింటే మగువలకు ఆ ఆనందమే వేరు. వింటేనే అంత ఆనందం ఉన్నప్పుడు మరి వేసుకుంటే ఇంకెంత బావుంటుందో కదా. పైగా బంగారానికి మగువలకు విడదీయలేని బంధం ఉంటుంది. తరాలు మారుతున్నా ఆభరణాల డిజైన్లు, మోడల్స్ మారుతుంటాయే కానీ బంగారానికి ఉన్న ఆదరణ మాత్రం అస్సలు తగ్గదు. ట్రెండ్ మారినా, కొత్త కొత్త డిజైన్లు మార్కెట్లో సందడి చేసినా, మురిపించే ఎన్ని డిజైన్లు వచ్చినా…ఏడువారాల నగలపై ఉండే ఆసక్తే వేరు. ఇంతకీ ఏడువారాల నగలలకున్న ప్రత్యేకత ఏంటి..అవి అలంకారమా -ఆరోగ్యమా-సంప్రదాయమా…
ఏడు వారాల నగలు వేసుకోవడం వెనుక ఆంతర్యం
గ్రహాల అనుగ్రహం కోసం, జాతకంలో ఉన్న దోషాలు తొలగించుకోవడం కోసం ఇప్పటివారంతా రంగు రాళ్లు ధరిస్తున్నారు. ముత్యం, పగడం, వజ్రం, వైఢూర్యం, గోమేధికం, పుష్యరాగం, మరకతం, నీలం, కెంపు ఇలా జన్మ నక్షత్రాన్ని బట్టి…లైఫ్ స్టోన్…గ్రహాల సంచారం ఆధారంగా రన్నింగ్ స్టోన్ ధరిస్తారు. కొందరైతే ఏకంగా నవరత్నాల ఉంగరాలు ధరిస్తున్నారు. అయితే ఇప్పుడంటే స్టోన్స్ ని ఉంగరాల రూపంలో ధరిస్తున్నారు కానీ అప్పట్లో వీటినే ఏడువారాల నగలుగా ధరించేవారు.
ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం ఒక్కో నగ
ఒక్కో రోజు ఒక్కో గ్రహం అనుగ్రహం కోసం ఏడు రోజులు ధరించే నగలనే ఏడువారాల నగలు అంటారు. వీటిని అప్పట్లో స్త్రీలు, పురుషులు కూడా ధరించేవారు. గ్రహస్థితి మెరుగుపడేందుకు మాత్రమే కాదు ఆరోగ్యం కోసం కూడా వేసుకునేవారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వీటికున్న క్రేజే వేరు. అందుకే బంగారు ఆభరణాలు ఎన్ని ఉన్నా ఏడువారాల నగలు అనేసరికి కళ్లు జిగేల్మంటాయ్.
ఏడువారాల నగలంటే ఇవే
ఆదివారం- సూర్యుడు: కెంపులు పొదిగిన కమ్మలు, హారం
సోమవారం – చంద్రుడు: ముత్యాల హారాలు, గాజులు
మంగళవారం- కుజుడు: పగడాల దండలు, ఉంగరాలు
బుధవారం – బుధుడు: పచ్చల పతకాలు, గాజులు
గురువారం – బృహస్పతి: పుష్యరాగం కమ్మలు, ఉంగరాలు
శుక్రవారం – శుక్రుడు: వజ్రాల హారాలు, ముక్కుపుడక
శనివారము – శని: నీలమణి హారాలు
ఏడు వారాల నగలు..ఏ రోజు ధరించాల్సినవి ఆరోజు వేసుకుంటే సంపూర్ణ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు గ్రహాల అనుకూలత సిద్ధిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతారు. అప్పట్లో ఏడువారాల నగలంటే మక్కువ పెరగడానికి కారణం కూడా ఇదే.. అందానికి అందం, ఆరోగ్యానికి ఆరోగ్యం, హోదాకి హోదా..అన్నీ వీటితో సాధ్యం అవుతాయి..
నోట్: కొన్ని ఆధ్యాత్మిక గ్రంధాల్లో పేర్కొన్న వివరాలు, పండితుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా రాసిన వివరాలివి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం