సీతాఫ‌లాల‌ను కాల్చి తింటే ఏమవుతుంది..!

చ‌లికాలంలో ఎక్కువ‌గా ల‌భించే పండ్ల‌ల్లో సీతాఫ‌లం ఒక‌టి. మ‌ధుర‌మైన రుచిని క‌లిగిన సీతాఫలాన్ని చాలామంది ఇష్టంగా తింటారు. చల్లటి వాతావరణానికి తోడు అనారోగ్య సమస్యలుంటాయేమో అని మరికొందరు తినేందుకు ఆసక్తి చూపరు. ఇంకొందరైతే సీతాఫలాలను కాల్చి తింటారు. ఇలా తినడం మంచిదేనా…ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు…

సీతాఫలంలో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే పోష‌కాల‌తో పాటు ఎన్నో ఔష‌ధ గుణాలు కూడా ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడిక‌ల్స్ ను న‌శింప‌జేయ‌డంలో స‌హాయప‌డ‌తాయి. ఒత్తిడి త‌గ్గి మాన‌సిక స్థితి మెరుగుప‌డుతుంది. శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే గుణం కూడా ఈ సీతాఫ‌లాలకు ఉంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరిగి వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా క‌లిగే ఇన్ఫెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాం. మ‌ల‌బ‌ద్ద‌కం వంటి జీర్ణ‌సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు సీతాఫ‌లాల‌ను తింటే సత్వరం ఉపశమనం కలుగుతుంది. కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో వాపులు, నొప్పుల‌ను త‌గ్గించ‌డంలో కూడా సీతాఫలం సహకరిస్తుంది. సీతాఫ‌లం గుజ్జును తేనెతో క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల బ‌రువు పెరుగుతారు.

కాల్చి తిన్నా మంచిదే
సాధార‌ణంగా సీతాఫలాలను పూర్తిగా పండిన త‌రువాతే తింటాం. అలా తింటేనే ఇవి రుచిగా ఉంటాయి. అంతేకాకుండా ఈ సీతాఫ‌లాల‌ను మంట‌లో కాల్చుకుని కూడా తినొ‌చ్చు. పూర్వ‌కాలంలో ఎక్కువ‌గా ఇలానే తినేవారు. మంట‌లో కాల్చిన సీతాఫ‌లాలు చాలా చ‌క్క‌టి రుచి క‌లిగి ఉంటాయి. వీటిని కాల్చ‌డం కూడా సుల‌భం. దీని కోసం ప‌చ్చిగా ఉన్న సీతాఫ‌లాల‌ను సేక‌రించాలి. త‌రువాత ఎండుక‌ట్టెల‌ను తీసుకుని కుప్ప‌గా పేర్చి మంట పెట్టాలి. ఈ మంట‌లో సీతాఫ‌లాల‌ను వేయాలి. త‌రువాత ఈ సీతాఫ‌లాల‌పై మ‌రికొన్ని క‌ట్టెల‌ను ఉంచాలి. ఇలా కాల్చ‌డం వ‌ల్ల సీతాఫ‌లం పైభాగం మాడిపోయిన‌ట్టుగా అవుతుంది కానీ లోప‌ల భాగం ఉడికి మెత్త‌బ‌డుతుంది. సీతాఫ‌లం మెత్త‌బ‌డిన త‌రువాత మంట నుండి తీసుకుని తినాలి. వీటిని కాల్చ‌డానికి అర‌గంట నుంచి గంట స‌మ‌యం ప‌డుతుంది. ఇలా కాల్చిన సీతాఫ‌లాలు తియ్య‌గా, వ‌గ‌రుగా ఉంటుంది. షుగ‌ర్ వ్యాధి గ్ర‌స్తులు కూడా ఇలా కాల్చుకుని తిన‌వ‌చ్చు. ఇవి కూడా ఆరోగ్యానికి మంచిదే.

గమనిక: ఆరోగ్య నిపుణులు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. దీనిని ఏ మేరకు విశ్వశించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.