వినాయకుడి ఫొటో లేదా ప్రతిమ లేని ఇల్లుండదు. ప్రధమ పూజ్యుడు కావడంతో ఏ పూజ చేయాలన్నా ముందుగా గణపయ్యని ఆరాధించాకే. అయితే రకరకాల వినాయకుడి ప్రతిమలు తీసుకొచ్చి ఇంటిని అందంగా ఆధ్యాత్మికంగా అలంకరించేవారూ ఉన్నారు. అయితే వాటిని సరైన దిశలో అలంకరిస్తేనే మంచి జరుగుతుందంటారు పండితులు.
ఏ దిక్కున ఏ గణపతిని ఉంచాలి
తూర్పు దిశ లో ఉండే గణపతి స్పటికం లేదా చలువరాతితో ఉండాలి
ఉత్తర దిక్కువైపు ఉంచే గణపతి ఆకుపచ్చ రంగులో ఉండడం మంచిది
దక్షిణ దిక్కులో ఉండే గణపతి పగడం లేదా ఎరుపు రంగులో ఉంటే ఆ ఇంట్లో ఉత్తమ ఫలితాలుంటాయి
పశ్చిమ దిశగా పెట్టే గణపతి నీలం రంగులో ఉంటే శుభం జరుగుతుంది
వాస్తు దోషాలు తొలగించే లంబోదరుడు
వక్ర తుండ గణపతి
తొండం ఎడమ వైపు తిరిగి ఉన్న గణపతిని ఇంటి ముఖద్వారం పై ప్రతిష్టించడం వలన ఇంట్లో సకారాత్మక శక్తి స్థిరంగా ఉంటుంది. ఇంటి వాతావరణం లో కూడా సమతౌల్యం ఏర్పడుతుందని నమ్మకం. పసుపు రంగుతో ఉండడం మరీ విశేషంగా పరిగణిస్తారు.
ఏకదంత గణపతి
ఏకదంతం ఉన్న స్వరూపం గల గణపతిని ప్రతిష్ఠిస్తే నకారాత్మక శక్తి నశించి ధన వృద్ది కలగడమే గాక కుటుంబంలో సమస్యలు నశించి సుఖ సంతోషాలు కలుగుతాయి, మంచి ఆలోచనలు , బుద్ది వికాసం ఏర్పడతాయి.
మహోదర గణపతి
ఈ మూర్తిని ఇంటి మధ్య భాగంలో ప్రతిష్టించడం వలన నకారాత్మక శక్తి ని తొలగిపోతుంది. దృష్టి దోషం తొలగి విఘ్నాలు పోయి ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది.
గజానన గణపతి
ఈ మూర్తి ని ప్రతిష్టించడం వలన ఆధ్యాత్మిక శక్తి వృద్ది చెంది కుటుంబంలో సభ్యుల మధ్య పరస్పర స్నేహభావం, ప్రేమానురాగాలు ఏర్పడతాయి.
లంబోదర గణపతి
పెద్ద పొట్ట ఉన్న గణపతిని స్థాపించడం వల్ల ఇంట్లో క్రోధాన్ని నిరోధిస్తుంది. కోపిష్టులు కూడా శాంతంగా ఉంటారట.
వికట గణపతి
ఈ వినాయకుడిని భవన నిర్మాణ సమయంలో ఏర్పాటు చేస్తారు
విఘ్న గణపతి
చేతిలో కమలం ఉన్న గణపతి ని ప్రతిష్టించడం వలన విఘ్నాలు తొలగిపోతాయి. ఆపదలు దరిచేరవు
గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.