భారతపై నిత్యం విషం చిమ్మెందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఎన్ని దెబ్బలు తగిలినా పాకిస్థాన్ బుద్ధి మాత్రం మారే అవకాశం కనిపించడం లేదు. సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్ స్ట్రైక్స్ తో ఎన్ని సార్లు గట్టిగా హెచ్చరించినా పాకిస్థాన్ మళ్లీ అదే తప్పు చేస్తోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఏదో మాట్లాడి మన దౌత్యవేత్తల చేతిలో చీవాట్లు తిన్నది. ఇండియా కౌంటర్ ఏమిటో ఓ సారి చూద్దాం….
కశ్మీర్ వ్యవహారంపై భారత్ ఆగ్రహం
ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి 55వ వార్షిక సమావేశంలో పాకిస్థాన్ ప్రతినిధులు కావాలనే జమ్మూకశ్మీర్ వ్యవహారాన్ని ప్రస్తావించారు. అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నట్లు ఆరోపించారు. పైగా ఆ ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్ (స్వతంత్ర కశ్మీర్)గా సంబోధించారు. దానితో ప్రభుత్వం మరోసారి గట్టిగా సమాధానం చెప్పింది. మానవహక్కుల వ్యవహారంలో అత్యంత నీచమైన రికార్డు ఉన్న పాకిస్థాన్ ప్రభుత్వం పొరుగువారి అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని భారత్ దౌత్యవేత్త అయిన ఫస్ట్ సెక్రటరీ అనుపమా సింగ్ హితబోధ చేశారు. కశ్మీర్, లద్దాక్ …భారతదేశంలో అంతర్భాగాలని, ముమ్మాటికి అవి అలాగే ఉంటాయని అనుపమా సింగ్ గుర్తుచేశారు. భారత్ పై తప్పుడు ఆరోపణలు చేసేందుకు మానవ హక్కుల మండలి లాంటి అంతర్జాతీయ వేదికను పాకిస్థాన్ వినియోగించుకోవడం దురదృష్టకరమని భారత్ అంటోంది..
పాక్ దేశంలోనే ఉల్లంఘనలు
పాకిస్థాన్ పాలకుల దుశ్చర్యలు, అక్కడి మైనార్టీలు పడుతున్న ఇబ్బందులను కూడా మన దౌత్యవేత్తలు ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లారు. 2023 ఆగస్టులో అక్కడి జరన్వాలా నగరంలో 19 చర్చిలను దుండగులు తగులబెట్టిన సంగతిని గుర్తుచేశారు. 89 క్రైస్తవుల ఇళ్లను ధ్వంసం చేసిన సంగతిని కూడా ప్రస్తావించారు. మైనార్టీలను వేధించే ప్రక్రియకు వ్యవస్థీకృత గుర్తింపు తెచ్చినది పాకిస్థాన్ మాత్రమేనని అనుపమా సింగ్ అన్నారు. అలాంటి దేశం భారత్ ను తప్పుపట్టడం సరికాదన్నారు. భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడం చూసి ఓర్వలేకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషించారు. ఆర్థిక, సామాజిక న్యాయంలో భారత్ అందరికంటే ముందున్నదని ఆమె చెప్పారు..
పాక్ తీరును తప్పుపట్టిన విదేశాంగ మంత్రి
భారత విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ కూడా పాకిస్థాన్ తీరును తప్పుపట్టారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ ఇతరులపై బురద జల్లే ప్రయత్నంలో ఉందని ఆయన అన్నారు. ఉగ్రదాడులు పారించిన రక్తంతో పాకిస్థాన్ పాలకుల చేతులు తడిసిపోయాయని ఆయన వాస్తవాలను కళ్లకు కట్టారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే చర్యల కంటే పాతాళానికి దిగిపోయిన పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు. ఉగ్రవాదం నుంచి దూరం జరిగినప్పుడే పాకిస్థాన్ మనుగడ సాధ్యమని ఆయన అన్నారు…