వాషింగ్టన్ వేదికగా పాక్ కు హెచ్చరిక

పాకిస్థాన్ ఓ వైఫల్యం చెందిన రాజ్యం. ఒక రోజు కూటికి లేక పక్క చూపులు చూస్తున్న దేశం. అంతర్జాతీయ సంస్థల దాతృత్వం కోసం దీనంగా రోదిస్తున్న జాతి. అయినా తన నీచ బుద్ధిని మాత్రం పాకిస్థాన్ వదులుకోవడం లేదు. కశ్మీర్ పై ఆశలతో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానుకోవడం లేదు. ఎన్ని దెబ్బలు తిని తలబొప్పి కట్టినా పాక్ వక్రబుద్ధికి అంతే లేకుండా పోతోంది. ఇక ఉపక్షించి లాభం లేదనుకుని భారత ప్రభుత్వం మరింత కఠిన వైఖరి పాటించేందుకు సిద్ధమవుతోంది.

భారత్ – అమెరికా సంయుక్త ప్రకటన

భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. దేశంలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రవాస భారతీయులు ఆయన్ను చూసి ఉద్వేగానికి లోనయ్యారు. తన బిజీ పర్యటనలో భాగంగా మోదీ, అమెరికా రాజధానిలో వాషింగ్టన్ డీసీ వెళ్లారు. ఆ దేశాధ్యక్షుడు బైడెన్ దంపతులతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగా మోదీ, బైడెన్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సీమాంతర ఉగ్రవాదం గర్హనీయమంటూ అందులో ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్ ను కోరారు. పాక్ నియంత్రణలో ఉన్న భూభాగం ( ఆక్రమిత కశ్మీర్) నుంచి ఉగ్రవాదులు భారత్లోకి రాకుండా చూసుకోవాలని సూచించారు. ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాదులు పాకిస్థాన్ భూభాగం నుంచి కార్యకలాపాలు నిర్వహించడం సహేతుకం కాదని హెచ్చరించారు. పాక్ వైపు నుంచి ఇండియాలోకి వచ్చే డ్రోన్లను ఆపకుంటే జరిగే పరిణామాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తు చేశారు.

ముంబై దాడుల సూత్రధారుల భరతం పట్టాలి..

నవంబరు 26 ముంబై ఉగ్రదాడి, పఠాన్ కోట్ దాడికి సూత్రధారులను ఎక్కడున్నా సరే పట్టుకుని శిక్షించాలని ఇరు దేశాలు పిలుపునిచ్చాయి. ఉగ్రవాదం, అతివాదంపై పోరాటంలో భుజం, భుజం కలిపి పనిచేస్తామని మోదీ, బెడెన్ ఉమ్మడి పత్రికా సమావేశంలో ప్రకటించారు. ప్రజాస్వామ్య విలువలు, సమన్యాయ పాలన, మానవ హక్కులకు ఉగ్రవాదం ప్రతిబంధకంగా మారిందని ఇద్దరు నేతలు అభిప్రాయపడ్డారు. అల్ ఖైదా, ఐసిస్, లష్కరే తయ్యబా, జేషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి సంస్థల అణచివేసేందుకు పాకిస్థాన్ దృఢనిశ్చయం ప్రదర్శించాలని ఇద్దరు నేతలు సూచించారు.

అఫ్ఘాన్ శాంతికి చేయూత

అఫ్ఘానిస్థాన్లో శాంతి ప్రయత్నాలకు ఊతమివ్వాలని మోదీ, బైడెన్ తీర్మానించారు.అక్కడి రాజకీయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామన్నారు. అఫ్ఘానిస్థాన్లో మహిళలు, పిల్లలు హక్కులకు భంగం కలుగుతున్న అంశాన్ని ఇద్దరు నేతలు గుర్తించారు. మానవ హక్కులను కాపాడాలని అక్కడి తాలిబన్ ప్రభుత్వానికి ఇద్దరు నేతలు విజ్ఞప్తి చేశారు. ఇతర దేశాలపై దాడులకు అఫ్ఘాన్ భూభాగాన్ని వాడుకోవద్దంటూ ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం నెంబర్ 2593ని గౌరవించాలని తాలిబన్ పాలకులను ఇద్దరు నేతలు కోరారు.