వైసీపీలో పెరుగుతున్న అసంతృప్తి స్వరాలు – మంత్రి వేణుకు చెక్ పెట్టాలనుకుంటున్న పిల్లి సుభాష్ !

ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తులు బయటపడుతున్నారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ అసంతృప్తి వ్యక్తం చేసి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ ఆవిర్బావం నుంచి జగన్‍కు మద్దతుగా నిలిచిన అన్యాయం జరిగిందని పిల్లి అనుచరులు అంటున్నారు. వైసీపీలో తమ వారిని మంత్రి చెల్లుబోయిన వేణు టార్గెట్ చేస్తున్నారని సుభాష్ వర్గం ఆరోపిస్తోంది. ఎంపీ మిథున్ రెడ్డి సమీక్షలకు పిల్లి సుభాష్ హాజరు కాలేదు..అంతే కాదు.. మిధున్ రెడ్డి వచ్చి కలుస్తానన్నా ఆయన అంగీకరించలేదు.

జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉన్న పిల్లి సుభాష్

జగన్ పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన వెంటే ఉన్నారు పిల్లి సుభాష్ . రామచంద్రాపురం నుంచే పలుమార్లు ఎమ్మెల్యేగా గెలిచారు పిల్లి సుభాష్.గత ఎన్నికలకు ముందు ఆయనను కాదని చెల్లుబోయిన వేణుకు జగన్ సీటిచ్చారు. సుభాష్ చంద్రబోస్ ను మండపేట అభ్యర్థిగా ప్రకటించారు. అయితే రామచంద్రాపురంలో చెల్లుబోయిన వేణు గెలిచారు. కానీ మండపేటలో బోస్ ఓడిపోయారు. అయినా సరే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి తన వెంటే ఉన్న బోస్ కు మంత్రి పదవి ఇస్తానని ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ పదవిలో కుదురుకోక ముందే.. మండలి రద్దు చేస్తానంటూ.. ఆయనతో రాజీనామా చేయించారు. మండపేటకు తోట త్రిమూర్తుల్ని ఇంచార్జ్ గా పెట్టారు. దీంతో పిల్లి సుభాష్ కు సీటు లేకుండా పోయింది.

తమను కావాలనే పక్కన పెట్టారని పిల్లి సుభాష్ వర్గీయుల ఆందోళన

మొదట గెలిచే సీటు మార్చి ఓడిపోయే సీటిచ్చారు. తర్వాత మంత్రిని చేశారు. మళ్లీ పదవి పీకేశారు. ఎమ్మెల్సీ పదవి రద్దు చేశారు. రాజ్యసభ పదవి ఇచ్చి.. పూర్తిగా రాజకీయాల్లో కనబడకుండా చేశారు.. అసలు రాజకీయంగా విలువ లేకుండా చేశారు. దీంతో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి రెడీ అంటున్నారు. ఈ వ్యవహారం వైసీపీలో కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో పార్టీ వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్న ఎంపీ మిధున్ రెడ్డి పర్యటనకు పిల్లి సుభాష్ దూరంగా ఉన్నారు. ఆయనకు స్వయంగా ఎం.పి మిథున్ రెడ్డి ఫోన్ చేసారు..అయితే తర్వాత వచ్చి కలుస్తానని మిథున్ రెడ్డికి చెప్పారని సమాచారం..

కొడుక్కి సీటు ఇవ్వాల్సిందేనంటున్న పిల్లి సుభాష్

వైఎస్ జయంతి వేడుకల్లో 2024 రామచంద్రాపురం ఎన్నికల బరిలో పిల్లి సూర్యప్రకాష్ ఉంటాడని సుభాష్ అనుచరులు కామెంట్స్ చేసారు. ఈ కామెంట్స్ పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పించారని ప్రచారం జరుగుతుంది. నియోజకవ వర్గంలో నెలకొన్న పరిస్థితుల్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని పిల్లి సుభాష్ అనుచరులు వాపోతున్నారు. ఈ వ్యవహారం ఎటు తిరుగుతుందోనని వైసీపీ నేతలు కంగారు పడుతున్నారు.