అద్భుతంగా తిరుపతి ఐఐటీ – అభివృద్ధిని చూపించిన విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్

ఏపీలో కేంద్రం ఏమీ చేయలేదన్న ఓ ప్రచారాన్ని ప్రాంతీయ పార్టీలు ఉద్ధృతంగ చేస్తూంటాయి. నిజానికి ఏపీలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పని వెనుక ఉన్నది కేంద్రం నిధులే. రాష్ట్రం కొన్ని దారి మళ్లించుకుంటోంది. కానీ నేరుగా కేంద్రం నిధులతో కడుతున్న పనులు మాత్రం జోరుగా సాగుతున్నాయి. అందులో ఒకటి తిరుపతి ఐఐటీ.

రెడీ అయిన ఐఐటీ క్యాంపస్

విభజన చట్టంలో భాగంగా తిరుపతి ఐఐటీ ని కేంద్రం ఏర్పాటు చేసింది. ఐఐటి క్యాంపస్‌లో నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఐఐటీలు అన్నింటికి కలిపి 9361 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించింది. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేశారు. ఇప్పుడు ఐఐటీ క్యాంపస్ అద్భుతంగా రూపొందిందింది. అనేక మందిని ఆకర్షిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో వేల కోట్లు ఖర్చు పెట్టి ఈ క్యాంపస్ ను సిద్ధం చేశారు.

2015 నుంచే తరగతులు

చదలవాడ నగర్‌లోని కృష్ణ తేజ విద్యా సంస్థలలో తాత్కాలిక క్యాంపస్‌లో 5 ఆగస్టు 2015న కళాశాల పనిచేయడం ప్రారంభించింది. IIT తిరుపతి మొదట్లో తిరుపతిలోని చదలవాడ గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూట్‌ల క్యాంపస్‌లో పని చేయగా, రేణిగుంట మరియు శ్రీకాళహస్తి మధ్య ఉన్న ఏర్పేడు సమీపంలో శాశ్వత భవనాలు నిర్మించారు. క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, హాస్టల్ బ్లాక్, ఓపెన్ ఎయిర్ థియేటర్, కంప్యూటర్ ల్యాబ్‌లు, అన్ని ట్రేడ్‌ల కోసం ఇంజనీరింగ్ వర్క్‌షాప్‌లు, లైబ్రరీ, 500-సీటర్ మెస్, ప్లే గ్రౌండ్, ఇండోర్ స్టేడియం ఆరోగ్య కేంద్రాలను నిర్మించారు.

అన్ని రకాల భవనాలు రెడీ

అత్యున్నత విద్య అందించేలా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. అకడమిక్ జోన్‌లో నిర్మించిన భవనాలలో సుమారు 100 మంది అధ్యాపకులకు కార్యాలయాలు , 50 ప్రయోగశాలలు, సెంట్రల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఫెసిలిటీ (సిఐఎఫ్), లెక్చర్ హాల్ కాంప్లెక్స్ (ఎల్‌హెచ్‌సి), అడ్మినిస్ట్రేటివ్ భవనంతో కూడిన రెండు డిపార్ట్‌మెంట్ భవనాలు ఉన్నాయి. హాస్టల్ జోన్‌లో ఒక్కొక్కటి 500 గదులతో రెండు హాస్టళ్లు, సెంట్రల్ డైనింగ్ సౌకర్యం, క్రీడా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. నీటిని నిల్వ చేయడానికి క్యాంపస్‌లో 10 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో రెండు చెరువులను కూడా ఏర్పాటు చేశారు.

ఈ క్యాంపస్ ఫోటోలను సోషల్ మీడియాలో ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి షేర్ చేశారు. ఇవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.