వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలా ? – అచ్చెన్నాయుడపై విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు విమర్శలు

ఏపీలో శాంతిభద్రతల పరిస్థితులపై బీజేపీ చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుపై.. ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్దన్ రెడ్డి మండిపడ్డారు. ఈ అంశంలో సోము వీర్రాజుపై అచ్చెన్నాయుడు విమర్శలు చేయడాన్ని ఖండించారు. ముందు వైసీపీపై ధైర్యంగా పోరాడాలని అచ్చెన్నాయుడుకు సలహా ఇచ్చారు. ప్రతీ సారి పోరాటం నుంచి పారిపోయి.. ఇప్పుడు బీజేపీ పై నిందలేయాలని ప్రయత్నించడం ఏమిటన్నారు.

ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా అచ్చెన్నాయుడు తీరు

అచ్చెన్నాయుడు తీరు ఆడలేక మద్దెల ఓడన్నట్లుగా ఉందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వైసీపీపై పోరాడలేక బీజేపీపై నిందలేయడం చేతకాని తనమేనన్నారు. వైసీపీపై పోరాడలేక
బద్వేలు, ఆత్మకూరు ఉపఎన్నికల్లో పోటీ చేయలేక పారిపోయారు..స్థానిక ఎన్నికల్లో నామినేషన్లలు వేసి మరీ పోటీకి దూరంగా ఉన్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా వైసీపీ వైఫల్యాలపై నిలదీయలేకపోయారు.. ప్రతిపక్ష పార్టీగా అన్ని రకాలుగా వైఫల్యంగా చెందారని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ గా ఘోర వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజలు గుర్తించారని.. దాన్ని కప్పి పుచ్చుకునేందుకు బీజేపీపై వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

2018-19లో రాష్ట్రపతి పాలన విధించేవాళ్లు కాదా ?

రాష్ట్రంలో శాంతిభద్రతల వైఫల్యంపై కేంద్రం జోక్యం చేసుకోవాలనుకుంటే 2018-19లోనే ఏపీలో రాష్ట్రపతి పాలన విధించేవారని విష్ణువర్దన్ రెడ్డి గుర్తు చేశారు. అప్పట్లో సాక్షాత్తూ హోంమంత్రి అమిత్ షా పై తిరుపతిలో రాళ్ల దాడి జరిగిందన్నారు. ప్రధాని పర్యటనకు వస్తే ప్రోటోకాల్ పాటించకుండా అవమానించారని.. నల్లబెలూన్లు ఎగురవేశారన్నారు. శాంతిభద్రతల అంశంలో జోక్యం చేసుకోవాలనకుంటే అప్పుడే జోక్యం చేసుకుని ఉండేవారన్నారు. అప్పుడే రాష్ట్రపతి పాలన వచ్చి ఉండేదనిగుర్తు చేశారు.

పొత్తు కోసం ప్రయత్నిస్తూ కుట్రలెందుకు ?

ఓ వైపు పొత్తు కోసం ప్రయత్నిస్తూ.. మరో వైపు బీజేపీని దెబ్బతీసే కుట్రలను తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అమలు చేస్తోందని విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రం .. ఏపీలో వైసీపీ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని.. ఆ రెండు పార్టీలు ఒకటేనన్న అభిప్రాయం కల్పించేందుకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు రోజూ అలాంటి ప్రకటనలు చేస్తున్నారన్నారు.
ఓ వైపు బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తూ .. మరో వైపు పార్టీని దెబ్బతీసే ప్రకటనలు ఎందుకని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. యూటర్నులతో ఏ మాత్రం విశ్వాసం లేని రాజకీయాలు చేసే పార్టీ టీడీపీ ! చేతనైతే వైసీపీపై పోరాడాలని ప్రతీదానికి బీజేపీ ప్రస్తావన మానుకోవాలని అచ్చెన్నాయుడును సూచిస్తున్నమన్నారు. ఎలాంటి దుష్ప్రచారాలు చేసినా.. ఏపీలో వైసీపీపై పోరాడుతున్న ఒక్క పార్టీ బీజేపీనేనని ప్రజలందరికీ తెలుసని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.