భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధ్ రెడ్డి కదిరిలో నిర్వహించిన విద్యుత్ చార్జీల పెంపుపై వ్యతిరేక నిరసన హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా బీజేపీ నేతలు ఉద్యమాలు చేస్తే మీడియా పెద్దగా కవరేజీ ఇవ్వదు. కానీ విష్ణువర్ధన్ రెడ్డి కదిరిలో నిర్వహించిన ఆందోళనకు పెద్ద ఎత్తున జనం హాజరు కావడంతో మీడియా కూడా ప్రముఖంగా ప్రసారం చేయాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి.
కదిరిలో కదం తొక్కిన బీజేపీ కార్యకర్తలు
కదిరి నియోజకవర్గంలో బీజేపీ మొదటి నుంచి బలంగా ఉంది. ప్రభుత్వంపై అసంతృప్తి కూడా కనిపిస్తోంది. విద్యుత్ చార్జీల భారం ప్రజల్ని కుంగదీస్తోంది. ప్రతిపక్ష పార్టీలు పట్టించుకోవడం లేదు. ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని గుర్తించిన బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి రంగంలోకి దిగారు. హిందూపురం పార్లమెంట్ మొత్తం వారం రోజుల పాటు ఆందోళనలకు పిలుపునిచ్చారు. తాను స్వయంగా పాల్గొంటున్నారు. కదిరిలో ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ఆందోళనకు బీజేపీ కార్యకర్తలే కాక.. స్వచ్చందంగా జనం కూడా తరలి వచ్చారు.
ప్రభుత్వంపై జనాగ్రహాన్ని బయట పెట్టిన బీజేపీ
ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత ఆగ్రహం ఉందో.. కదిరిలో విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహించిన ఆందోళన వెలుగులోకి తెచ్చిందని అనుకోవచ్చు. విద్యుత్ చార్జీల భారం పై ప్రజల్లో ఉన్న కోపానికి తమ కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతు తెలుపడం ద్వారాప్రజలు వ్యక్తం చేశారు. సామాన్య ప్రజలు కూడా.. ఆందోళనలో పాలు పంచుకున్నారు. పోలీసులు ఉక్కుపాదం మోపే అవకాశం ఉందని తెలిసినా వెనక్కి తగ్గలేదు. ఈ స్పందన బీజేపీ నేతలను సంతృప్తి పరిచింది.
విద్యుత్ చార్జీల ఉద్యమం రాష్ట్రమంతా చేసే ఆలోచన ?
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రజల్లో ఊహించనంత ఆగ్రహం ఉందని విష్ణువర్ధన్ రెడ్డి నిర్వహిస్తున్న కరెంట్ ఉద్యమంతో బయటపడటంతో ఇక రాష్ట్ర మంతా నిర్వహించాలన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది. ఇటీవలి కాలంలో బీజేపీ రాష్ట్ర స్థాయి ఉద్యమాలు జరగలేదు. గతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ తో పాటు ప్రధాని పాలనా విజయాల ప్రచారం వ్యవస్థీకృతంగా జరిగింది. ఈ సారి మరింత ఆర్గనైజ్డ్ గా రాష్ట్రం మొత్తం విద్యుత్ చార్జీల పెంపుపై ఉద్యమం చేయాలన్న అభిప్రాయం వినిపిస్తోంది.