సెక్యులర్ రచయితల ఫోరం పేరుతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దేశంపై, ప్రధానమంత్రితో పాటు ఏకంగా పార్లమెంట్ పై నోరు పారేసుకన్న ప్రకాష్ రాజ్ కు ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఘాటు కౌంటర్ ఇచ్చారు. కన్నడ ప్రజలతోనే కాదు .. సినీ నటులతోనూ ఛీ కొట్టించుకున్న మీ కన్నా జోకర్, విలన్ ఎవరు ఉంటారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
వృత్తిలో నటించండి.. మేధావిగా నటిస్తే జోకర్‌గానే మిగులుతారు !
నటించడంతో వచ్చిన గుర్తింపు …. ఇంకా సినిమాల్లో నటిస్తే ఇంకాస్తే పేరు, డబ్బులు వస్తాయి. అదే పేరున్న నాయకుల్ని వ్యతిరేకిస్తున్నట్లుగా… మేధావులుగా చెలామణి అయ్యే వారి ముందుకు వచ్చి నటిస్తే జోకర్లు అవుతారు. ప్రపంచం మెచ్చిన నేతల్ని విమర్శించి … జోకర్లు, ఫేకర్లు అవుతారు అదే జాబితాలో ఉన్నత స్థానానికి చేరేందుకు మిస్టర్ మోనార్క్, విలన్ తెగ ప్రయత్నించేస్తున్నారని మండిపడ్డారు. చూసే కళ్లు, చేసే ఆలోచనల్లోనే అంతా ఉంటుంది. ఎదురుగా కొంత మందికి భవిష్యత్ కనిపించవచ్చు.. కానీ కొంత మందికి నిరాశ కనిపిస్తుంది. ఇలాంటి వారందరూ ఎప్పుడూ నిస్పృహలతో ఉండటమే కాదు.. తమతో ఉన్న వార్ని.. తమ మాటలు వింటున్న వార్ని కూడా అలాంటి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఆర్థం లేని ఆవేశంతో ఊగిపోతూ ఉంటారన్నారు. రచయితల ఫోరం సమావేశంలో మిస్టర్ మోనార్క్ … అదే చేశారు. కానీ అక్కడ ఆయన జోకర్ అయ్యారు. మిస్టర్ మోనార్క్ ని చుట్టపక్కల ఉన్న వారు ఇండస్ట్రీలో ఉన్న వారు జోకర్‌గా ఎలా చూస్తారో … మోదీని, బీజేపీ వ్యతిరేకించడమే సెక్యులర్ భావాలనుకునేవాళ్లు ఎలా ఐకాన్‌తో చూస్తారో అలా అన్న మాట. ఎక్కడైతే పేరు తెచ్చుకున్నారో ఆ రంగంలో పట్టుమని పది మందికి మేలు చేసి ఓట్లు పొందలేకపోయిన అసలైన జోకర్ మిస్టర్ మోనార్క్. తుకడే, తుకడే గ్యాంగుల్ని పెట్టుకుని సెక్యులరిజం పేరుతో దేశంపై దాడి చేసే సర్కస్‌లో మాత్రం రింగ్ మాస్టర్ అయిపోయారన్నారు.
మణిపూర్ మంటల్లో మడిపోవాలనేదే మనసులో వారి కోరిక !
కోతులకు కొబ్బరి చిప్పలు దొరికినట్లు దేశంలో ఇప్పుడు మోదీని వ్యతిరేకించడానికి ఒక్క మణిపూర్ తప్ప ఏం కనిపించడం లేదు. మణిపూర్ సమస్యకు మూలం ఏమిటో కనీసం తెలుసుకునే ప్రయత్నం చేయరు. దేశంపై పొరుగుదేశాలు చేస్తున్న కుట్రల్లో భాగం అయ్యేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. అక్కడి ప్రజల్ని నిలువునా తగులబెట్టేసి.. దాన్ని బీజేపీ వైఫల్యంగా ప్రకటించడానికి ..మణిపూర్ మంటల్లో పెట్రోల్ పోయడానికి మాత్రం రెడీ అవుతారు ! వందేళ్లుగా సామరస్యంగా ఉన్న ప్రజల మధ్య చిచ్చు పెట్టింది సెక్యులరిజం పేరుతో చేసిన మీలాంటి వారి ఓటు బ్యాంక్ రాజకీయాలేనని ప్రజలకు తెలియకుండా ఇలాంటి పిచ్చి ప్రసంగాలతో ఎంత కాలం మభ్య పెట్టగలరని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.
సెక్యులరిజం అంటే హిందువుల్ని అవమానించడమా ?
అసలు సెక్యూలరిజం అంటే ఏమిటి హింందువుల్ని అవమానించడమా ? మెజార్టీ ప్రజల్ని కించ పర్చడమా ? దేశ ప్రధానిని గుడ్డిగా వ్యతిరేకించడమా ? మణిపూర్ శాంతికి ప్రయత్నిస్తూంటే ఎప్పటికప్పుడు ఆరకుండా మంటలు రాజేయడం సెక్యులరిజమా ? చివరికి పార్లమెంట్‌నూ నిందిస్తున్న తెంపరితనం సెక్యూలరిజమా ?. సెక్యులరిజం అంటే సమానత్వం. సమానత్వం అంటే కొన్ని మతాలను ప్రోత్సహించి… మెజార్టీ ప్రజల్ని కించపర్చడం కాదు. కానీ గీతను అర్థం చేసుకోలేని మేధావులు.. సెక్యూలరిజం అంటే… హిందూ మతాన్ని వ్యతిరేకించడం… ఇతర మతాల్ని పొగడటం అనుకుంటున్నారు. చివరికి మత పార్టీ అయిన ఎంఐఎం కూడా వీరికి సెక్యూలరే. అంటే.. ఇలాంటి బుర్రలో ఎంత బురద చేరుకుందో అర్థం చేసుకోవచ్చన్నారు. మోదీని, బీజేపీని వ్యతిరేకించే వారు ఉంటారు .. వంద శాతం సమర్థించాలని కూడా మోదీ కూడా అనుకోరు. గట్టి ప్రతిపక్షం ఉండాలని తప్పొప్పులు ఎత్తి చూపాలని మోదీ కూడా చాలా సార్లు చెప్పారు. అదే ప్రజాస్వామ్యం. కానీ.. ఆ వ్యతిరేకత పేరుతో దేశాన్ని తగులబెట్టాలనుకోవడం.. సెక్యులరిజం పేరుతో మెజార్టీ ప్రజల్ని కించపర్చడం ప్రజాస్వామ్యం కాదని స్పష్టం చేశారు. ఇదేమీ తెలియని తుక్డే.. తుక్డే గ్యాంగ్ కాబట్టే ప్రజల మద్దతు పొందలేక ఇలా మైకుల ముందు అసభ్య భాష మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వాళ్లకు పాలకులను ప్రశ్నించే హక్కు.. విమర్శించే హక్కు కూడా ఉండదు. తనను తాను మోనార్క్ లా ఫీలయ్యే వ్యక్తికి ఇవన్నీ చెప్పినా అర్థం కావని ఎద్దవా చేశారు.