పోలవరం ప్రాజెక్టుపై ఏపీలోని అధికార ప్రతిపక్షాలు రెండు రోజులుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. నిజానికి ఆ రెండు పార్టీలు పోలవరాన్ని భ్రష్టుపట్టించాయి. చెల్లించే ప్రతి రూపాయి కేంద్రం ఇస్తూంటే… కట్టుకోవడం చేతకాక .. కమిషన్ల కక్కుర్తితో … కాంట్రాక్టర్లను మార్చుకుంటూ… మొత్తం ప్రాజెక్టు ను రిస్క్ లో పడేశారు. ఈ వ్యవహారాన్ని ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి బయట పెట్టారు. అసలు లొసుగులు రాకుండా రెండు పార్టీలు వ్యూహాత్మకంగా ఒకరిపై ఒకరు విమర్శలు దాడి చేసుకుంటున్నట్లుగా ఉండటంతో ఆ కుట్రను బయట పెట్టేందుకు ప్రయత్నించారు.
ప్రాంతీయ పార్టీల వల్లే పోలవరానికి గండం
“ పేనుకు పెత్తనం ఇస్తే తలంతా కొరికేసిందనే సామెత పోలవరం విషయంలో రెండు పార్టీల తీరు సరిపోయింది ” అని విష్ణువర్ధన్ రెడ్డి తేల్చేశారు. ప్రాంతీయ పార్టీల దురాశకు జాతీయ ప్రాజెక్టు పోలవరం దుస్థితే సాక్ష్యమన్నారు. కేంద్రం ప్రతీ పైసా ఇస్తాం నిర్మించుకోండని భరోసా ఇస్తే 2014-19 వరకూ టీడీపీ ప్రభుత్వం చేసింది – పని తక్కువ- పబ్లిసిటీ రాజకీయం ఎక్కువ. 2018 కల్లా పూర్తి చేస్తామన్నారు మధ్యలో కాంట్రాక్టర్లను మార్చి సమయాన్ని వృధా చేశారు. అడిగినన్ని నిధులు రీఎంబర్స్ చేసినా పూర్తి చేయలేకపోయారు టీడీపీకి చేత కాదని ప్రజలు వైసీపీకి అధికారం ఇస్తే అతని కంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లుగా మారింది పరిస్థితని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
కేంద్రం మీద నిందలేస్తారా ?
ప్రాజెక్టు కట్టుకోవడం చేతకాక మళ్లీ నిధులో.. నిధులో … అని కేంద్రం మీద నిందలు వేస్తున్నారు. – మీరు ప్రాజెక్టు కడితే రీఎంబర్స్ చేయనని కేంద్రం చెప్పిందా ? అని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు దేశంలో 100% కేంద్ర నిధులతో నిర్మాణం చేస్తున్న జాతీయ ప్రాజెక్ట్ ను టీడీపీ ఎందుకు తీసుకుందని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. టీడీపీ నిర్వాకం చాలదని. .. అరకొరగా జరుగుతున్న పనుల్ని కూడా రివర్స్ టెండర్ పేరుతో రివర్స్ చేసేశారని మండిపడ్డారు. నాలుగేళ్లలో ప్రాజెక్టులో పనులు జరగకపోగా.. చేసిన పనుల్నే మళ్లీ చేయాల్సి వస్తోందని.. డయాఫ్రం వాల్, గైడ్ బండ్ మళ్లీ కట్టాలా అని ప్రశ్నించారు.
పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ చెప్పిన సలహాలు వినకుండా ఇష్టారాజ్యంగా చేసుకుని ఏపీ జీవనాడితో ఆటాడుకున్నారని మండిపడ్డారు.
ప్రాంతీయ పార్టీల అహంకారంతోనే అసలు సమస్య !
ఎలా చూసినా రెండుప్రభుత్వాలు అహంతో తీసుకున్న నిర్ణయాలే పోలవరానికి శాపంగా మారాయి. నిధులన్నీ కేంద్రం ఇస్తుందని చట్టంలో ఉంటే నిర్మించుకోవడం చేతకాని అసమర్థ ప్రభుత్వాలు మీ రెండు పార్టీలని విష్ణువర్ధన్ రెడ్డి స్పష్టం చేశారు. కేంద్రంపై నిందలేసి పోలవరం భారం దించేసుకోవడానికే ప్రజలు వైకాపాకు అధికారం ఇచ్చిందా అని ప్రశ్నించారు. అధికారం ఉన్నా ప్రాజెక్టు పూర్తి చేయకుండా విపక్షాలు పై రాజకీయ విమర్శలు చేయడం వైకాపా వైఫల్యమన్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం రావాలి , పోలవరం పూర్తి కావాలాని నినాదం ఇచ్చారు.