ప్రభాస్ రాముడిగా – కృతి సనన్ సీతగా ఓం రౌత్ తరెకెక్కించిన ‘ఆదిపురుష్’ పై ట్రోల్స్ ఆగడం లేదు. రామాయణాన్ని చూపిస్తామని చెప్పి ఓంరౌత్ తనకు నచ్చినట్టు పాత్రలు చిత్రీకరించాడంటూ పెద్ద దుమారం రేగింది. డైలాగ్స్ పై, కొన్ని సన్నివేశాలపై వివాదాలు జరిగాయి. ఇక పేలవమైన VFX అంటూ కామెంట్స్ వెల్లువెత్తాయి. సాధారణ ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు, పలువురు రాజకీయ నాయకులు, హిందూ సంఘాలు నేరుగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ జాబితాలో చేరారు భారత్ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్
‘ఆదిపురుష్’ పై సెహ్వాగ్ సెటైర్
ఆదిపురుష్ మూవీ చూసిన తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ పోస్ట్ చేసిన కామెంట్ ప్రభాస్ అభిమానులకు మింగుడుపడడం లేదు.ప్రభాస్ బ్లాస్‍బాస్టర్ సినిమా బాహుబలిని ప్రస్తావిస్తూ వీరేందర్ సెహ్వగ్ ఈ ట్వీట్ చేశాడు. “బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో ఆదిపురుష్ చూశాక నాకు అర్థమైంది”అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ఆదిపురుష్‍పై వ్యంగంగా జోక్‍లా ఇలా ట్వీట్ పోస్ట్ చేశాడు. అయితే, ఇలాంటి ట్వీట్ చేయడం పట్ల నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. కొందరు వీరూకు మద్దతు తెలుపుతుంటే..చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
వీరుపై ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్
ఆ స్థాయిలో ఉన్న వీరేందర్ సెహ్వాగ్ ఓ సినిమాపై ఇలాంటి ట్వీట్ చేయడం సరికాదంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఆదిపురుష్‍ను విమర్శించడం ద్వారా అటెన్షన్ పొందాలని వీరూ కూడా అనుకుంటున్నట్టు ఉన్నాడని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది పాత జోక్ అని.. దాన్ని ఇప్పుడు కాపీ చేశావా సెహ్వాగ్ అని ఓ యూజర్ కామెంట్ చేశారు. పెయిడ్ ట్వీట్ చేసేందుకు చాలా ఆలస్యమైందని మరో యూజర్ రాసుకొచ్చాడు. మరికొందరేమో సెహ్వాగ్‍ను సమర్థిస్తూ కామెంట్లు చేస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ కోసం మనోజ్ ముంతాషిర్ రాసిన కొన్ని డైలాగ్‍పై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కొన్ని డైలాగ్స్ లో మార్పులు చేర్పులు చేయకతప్పలేదు. ఇక ఆదిపురుష్ లో రావణుడి వేషధారణ, గ్రాఫిక్స్ గురించి కూడా చాలా విమర్శలు వచ్చాయి. పీఎఫ్‍ఎక్స్ గురించి మీమ్స్ కూడా భారీగానే పేలుతున్నాయి. జూన్ 16న విడుదలైన ఈ సినిమా తొలి మూడు రోజులు కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికే నెగిటివ్ ట్రోల్స్ కి సమాధానం చెప్పలేక ఆదిపురుష్ టీమ్ సతమతమవుతున్న టైమ్ లో సెహ్వాగ్ ట్వీట్ వైరల్ అవుతోంది.