ఏపీ ప్రజలకు కేంద్రం మరో వరం – వందే భారత్ ఈ సారి చెన్నైకు !

అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ రైళ్లను ఏపీకి కేంద్రం విరివిగా కేటాయిస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ – విశాఖపట్నం , హైదాబాద్ – తిరుపతి మధ్య రైళ్లు తిరుగుతున్నాయి. ఇప్పుడు విజయవాడ – చెన్నై మధ్య రైలును ప్రారంభించబోతున్నారు. ఏడో తేదీన ప్రధాని మోదీ వర్చవల్ గా ఈ రైలును ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఏడో తేదీ నుంచి విజయవాడు టు చెన్నై వందే భారత్

ప్రధాని జులై 7న 5 వందే భారత్ ట్రైన్స్‌కు వర్చువల్‌గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. అందులో విజయవాడ-చెన్నై వందేభారత్ కూడా ఉందని బెజవాడ రెల్వే డివిజన్‌కు సమాచారం అందింది. దీంతో అక్కడి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టారు. ఈ ట్రైన్ 8వ తారీఖు నుంచి ప్రయాణికులకు అందుబాటులోఉంటుంది. విజయవాడ నుంచి చెన్నై మధ్య స్టాపులు ఏమేం ఉంటాయి. టైమింగ్స్ ఎలా ఉంటాయి, టిక్కెట్‌ రేట్లు.. తదితర వివరాలు ఒకటి రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రైలును రేణిగుంట మార్గం గుండా నడిపే అవకాశం ఉంది. విజయవాడ నుంచి గూడూరు, రేణిగుంట, కాట్పాడి గుండూ చెన్నై వెళ్లి.. అదే రూటులో రిటన్ రానుంది.

ఇప్పటికే రెండు రైళ్లు

ఆంధ్రా మీదుగా ఇప్పటికే 2 వందే భారత్ ట్రైన్స్ రన్ అవుతున్నాయి. సికింద్రాబాద్ – వైజాగ్ మార్గంలో ఒకటి అందుబాటులో ఉండగా.. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య మరో ట్రైన్ ప్రయాణిస్తోంది. ఇప్పుడు 3వ ట్రైన్ రానుందని చెబుతున్నారు. ఏపీలో మరికొన్ని వందే భారత్ రైళ్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టయర్ 2/3 నగరాల మధ్య తక్కువ కిలోమీటర్ల దూరంలో రాకపోకలు సాగించడానికి అనువుగా పలు రైళ్ల ప్రారంభోత్సవానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.

ఏపీ సర్కార్ నిర్లక్ష్యంగా భారీగా ఆగిపోయిన రైల్వే ప్రాజెక్టులు

ఏపీ రైల్వే ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్ర‌భుత్వ స‌హాయ నిరాక‌ర‌ణ చేస్తోంది. ఏపీలో ప్ర‌స్తుతం రూ.70 వేల కోట్ల‌కు పైగా విలువ క‌లిగిన రైల్వే ప్రాజెక్టుల ప‌నులు కొన‌సాగుతున్నాయి. .కొత్త ప్రాజెక్టుల‌ను కాస్ట్ షేరింగ్ ప‌ద్ద‌తిన చేప‌డుతున్న‌ారు. ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప్రాజెక్టుల‌కు ఏపీ త‌న వాటాగా రూ.1,798 కోట్లు ఇవ్వాల్సి ఉంది. ఈ నిధుల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేయ‌డం లేద‌ని కేంద్ర మంత్రి పార్లమెంట్‌లోనే తెలిపారు. ఇలాంటి ప‌రిస్థితుల కారణంగా ఏపీకి కొత్త‌గా రైల్వే ప్రాజెక్టుల‌ను ప్ర‌క‌టించ‌డం సాధ్యం కాద‌ని మంత్రి తేల్చి చెప్పారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి చాలా వరకూ పనులు గత మూడేళ్లుగా ఆగిపోయాయి. బడ్జెట్ సమయంలో పెట్టే సమావేశాల్లో ఏపీ ఎంపలు పలు రకాల ప్రతిపాదనలు ఇస్తారు. కానీ ప్రభుత్వం తమ వాటా చెల్లించకపోవడంతో ఒక్క ప్రాజెక్ట్ కూడా మందుకు పడటం లేదు.