పంచాయతీల నిలువు దోపిడీ – ఏపీ సర్కార్ కేంద్రం షాక్ ఖాయం

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను వైసీపీ సర్కారు మళ్లీ లాగేసుకుంది. పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడం, ఆ మేరకు యూసీలు పంపకపోవడంతో కేంద్రం నిధుల విడుదలను నిలిపేసింది. సర్పంచ్‌లు నేరుగా కేంద్రానికి మొరపెట్టుకోవడంతో మే 15, 22వ తేదీల్లో 202223కి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు రూ.986 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను పంచాయతీల ఖాతాల్లో వేయాలంటూ పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కార్యాలయం నుంచి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపారు. కానీ ఆ నిధులను ఏపీ సర్కార్ స్వాహా చేసేసింది.

15వ ఆర్థిక సంఘం నిధుల స్వాహాపై సర్పంచ్‌ల ఆగ్రహం

దేశంలో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ 15వ ఆర్థికసంఘం నిధుల కోసం పీఎఫ్‌ఎంఎస్‌ అకౌంట్లు తెరిచాయి. ఇలా చేస్తే నిధులు మళ్లించడానికి అవకాశం ఉండదు. అలా ఉండదని ఏపీలో మాత్రం పట్టించుకోవడం లేదు. ఐదో రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటుచేసి బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నట్లు తీర్మానాలు పంపిస్తేనే కేంద్ర ఆర్థికశాఖ నిలిచిపోయిన నిధులను విడుదల చేస్తుంది. ఈ విషయంపై పలు దఫాలు లేఖల ద్వారా రాష్ట్రానికి తెలియజేశాసినా స్పందన లేుదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు లేఖలు రాసింది. అయినా స్పందించలేదు. చివరికి పంచాయతీ సర్పంచ్‌ల విజ్ఞప్తి మేరకు ఆర్థిక సంఘం నిధుల విడుదలకు గ్రీన్‌సిగ్నల్‌ వచ్చింది. కానీ ఆ నిధులు మాత్రం పంచాయతీలకు జమ కాలేదు.

ప్రతీ ఏడాది ఇదే తంతు

వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీల నిధులను దారిమళ్లించడంతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధులు రాబట్టడంలోనూ విఫలమైంది. గ్రామ పంచాయతీల్లో ఆర్థిక సంఘం నిధులు ఒక్క పైసా కూడా ఖర్చు చేయకపోవడంతో యూసీలు సమర్పించలేకపోయింది. దీంతో 2022-23కు సంబంధించి రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు రూ.2,010 కోట్లు ఇవ్వకుండా నిలిపేశారు. పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం వాడేసుకోవడంతో కేంద్రం దృష్టిలో బ్లాక్‌లిస్ట్‌లో పడ్డాయి. ఆర్థిక సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడిగా అసెంబ్లీలో తీర్మానం చేసినా ఆ ప్రక్రియ మాత్రం ప్రారంభం కాలేదు.

గ్రామాల్లో ఎన్నో సమస్యలు

పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కపైసా విదల్చకపోయినా.. కేంద్రం నుంచి వస్తున్న 14వ, 15వ ఆర్థిక సంఘం నిధులను యథేచ్ఛగా వాడేసుకోవడంతో పంచాయతీ ఖజానాలు ఖాళీ అయ్యాయి. జల్‌జీవన్‌ మిషన్‌ నిధులను ఇతర అవసరాలకు వాడటంతో కేంద్రం వాటినీ ఆపేసింది. చివరకు మ్యాచింగ్‌ గ్రాంట్‌ కోసం నాబార్డు అప్పు ఇస్తే ఆ నిధులు కూడా బటన్‌ నొక్కుడుకు వినియోగించారు. నిధులు నిలిచిపోవడంతో గ్రామాల్లో తాగునీటి పనులు సాగడం లేదు. ప్రభుత్వం ఏ పనులు పిలిచినా టెండర్లు వేసేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. సర్పంచ్‌ల వద్ద నిధులు లేకపోవడంతో కాలిపోయిన మోటార్లను రిపేరు చేసే దిక్కు లేకుండా పోయింది.

సర్పంచ్‌లకు మద్దతుగా బీజేపీ పోరాటం

కేంద్ర పథకాలకు స్టిక్కర్లు వేసి తమ పేరు ప్రచారం చేసుకోవడంపై ఇప్పటికే బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఇప్పుడు పంచాయతీలకు ఇచ్చిన నిధుల్ని కూడా స్వాహా చేస్తూండటంపై మండి పడుతున్నారు. సర్పంచ్‌లకు మద్దతుగా బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంపై పోరాటం చేసి పంచాయతీ నిధులు వారికి అప్పగించే అవకాశం ఉంది.