Varanasi: కాశీలో కాయో పండో వదిలేయాలి అంటారెందుకు – ఇంతకీ ఏం వదిలేయాలో తెలుసా!

జీవిత కాలంలో ఒక్కసారైనా దర్శించుకోవాలి అనుకునే క్షేత్రం వారణాసి. కాశీ యాత్ర చేసిన వారంతా కాశీలో ఏదో ఒక పండు, కాయ, ఆకు వదిలేస్తుంటారు. వారణాసి నుంచి వచ్చిన తర్వాత నుంచి అక్కడ వదిలేసిన పండు ను మళ్లీ తినరు…కూరగాయల్లో అక్కడ ఏం వదిలేశారో ఆ కూరగాయ వండరు..ఆకులు కూడా అంతే ( పూర్వం ఆకుల్లో భోజనం చేసేవారు కాబట్టి విస్తరాకు, మర్రి ఆకు, అరిటాకును వదిలేసేవారు). ఇలా చేస్తూ తమపై తాము నియంత్రణ పాటించేవారు. ఇంతకీ పరమేశ్వరుడి సన్నిధికి వెళ్లాక అక్కడ ఏం కాశీలో ఏం వదిలేయాలి..ఏం వదిలేస్తున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

హిందువులకు అత్యంత పవిత్రమైన పుణ్య క్షేత్రం కాశీ. గంగానదిలో స్నానమాచరిస్తే సకల పాపాలు నశించి జన్మజన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. సుమారు 5,000 సంవత్సరాల క్రితం శివుడు వారాణాసి నగరాన్ని స్థాపించాడని పురాణ గాథ. హిందువుల ఏడు పవిత్ర నగరాలలో ఒకటి , ఋగ్వేదం, రామాయణం, మహాభారతం, స్కాంద పురాణం వంటి ఎన్నో భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల్లో కాశీనగరం గురించి ప్రస్తావన ఉంది. అయోధ్య, మథుర, గయ,కాశి, అవంతిక, కంచి, ద్వారక నగరాలను సప్తముక్తి పురాలని చెబుతారు. కాశీలో ప్రతిరోజూ సాయంత్రం హారతి, ప్రార్థనలు భక్తులను కట్టిపడేస్తాయి.

కాయ,పండు కాదు – కాయాపేక్ష,ఫలాపేక్ష
సాధారణంగా కాశీకి వెళ్తే ఏ కాయో..పండో వదిలేయాలని చెబుతుంటారు. తరతరాలుగా మన పద్దలు కూడా ఇదే మాట చెబుతారు. కొందరు వదిలేసివచ్చి ఆ నియమాన్ని తప్పకుండా పాటిస్తున్నారు కూడా. తమపై తాము నియంత్రణ కోసం ఎంతో ఇష్టమైన పండ్లు, కూరగాయలు, ఆకులు శివయ్య సన్నిధిలో వదిలేసి వస్తారు. ఆ తర్వాత ఎప్పటికీ అవి తినరు. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కాశీలో వదిలేయాల్సింది కాయలు, పండ్లు కాదు…కాయాపేక్ష, ఫలాపేక్షను గంగలోనే వదిలి విశ్వనాథుడి దర్శనం చేసుకుని ఇంటికి తిరుగుముఖం పట్టాలని ఆంతర్యం.

కాయాపేక్ష – ఫలాపేక్ష అంటే
కాయం అంటే శరీరం…శరీరంపై ఆపేక్షని వదిలేయాలని అర్థం, ఫలం అంటే కర్మఫలం…కర్మఫలముపై ఆపేక్షని పూర్తిగా వదిలేసి నిజమైన భక్తితో ఈశ్వర చింతన కలిగి ఉండాలని అర్థం. కాయా పేక్ష, ఫలా పేక్ష కాలక్రమేణా కాయ-పండుగా మారిపోయింది. ఎప్పుడైతే కాశీ విశ్వనాథుడి సన్నిధికి వెళతారో ఆ క్షణం నుంచి ఐహిక సుఖాల పట్ల, శారీరక సుఖాల పట్ల ఆసక్తి తగ్గాలి. గంగలో మునిగిన తర్వాత అప్పటి వరకూ ఉన్న రకరకాల ఆలోచనలు వదిలేసి సాత్విక ఆలోచనలతో ఉండాలి. ప్రతి మనిషీ జీవిత చరమాంకంలో బంధాలు, రాగద్వేషాలు, వివాదాలు, విభేదాలు , లేనిపోని ఆలోచనలు వదిలిపెట్టి కాశీ యాత్రలో వదిలిపెట్టేసి పూర్తిగా పరమేశ్వరుడిపై మనసు లగ్నం చేయాలి. శరీరంపై ఉన్న ఆపేక్షను, ఐహిక సుఖాలిచ్చే ఆనందాలను వదులుకుంటూ ముందున్న జీవితాన్ని పరమేశ్వర ధ్యానంతో గడిపేస్తానని తనపై తాను నియంత్రణ పాటించాలి. అంతే కానీ కాయ, పండు వదిలేసి వచ్చి అవి తినకుండా ఉన్నంత మాత్రాన దేవుడి కటాక్షం లభిస్తుందనుకోవడం ఆధ్యాత్మిక చైతన్యం కాదంటున్నారు పండితులు.