Shani Dev: వైశాఖ అమావాస్య శనీశ్వరుడి జయంతి, జాతకంలో శనిదోషం ఉంటే ఏం జరుగుతుంది!

శ్లోకం
నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం|
ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం||

వైశాఖ అమావాస్య శనికి చాలా ప్రత్యేకం. సూర్యభగవానుడికి – ఛాయాదేవికి ఇదే రోజున జన్మించాడు శనీశ్వరుడు. అందుకే ఈ తిథిని శనైశ్చర జన్మ తిథి అని పిలుస్తారు. గ్రహాలకు రాజైన సూర్యభగవానుని పుత్రుడు కాబట్టి శని అనుగ్రహం పొందాలంటే ముందుగా సూర్యుడిని ఆరాధించాలని చెబుతారు పండితులు. అందుకే అమావాస్య రోజు పితృతర్పణాది కార్యక్రమాలు చేస్తారు. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించి సూర్యుడికి తర్పణాలు సమర్పించి నవగ్రహ ఆలయానికి వెళతారు. ఇదే రోజున హనుమంతుడు ఆకాశంలోకి ఎగిరి సూర్యుడిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అందుకే ఈ రోజు ఆంజనేయ ఆరాధన కూడా చాలా ముఖ్యమని చెబుతారు పండితులు.

జాతకంలో శని ఉంటే ఏం జరుగుతుంది
జాతకాలను విశ్వశించేవారు ఏ గ్రహం అనుకూలంగా లేకపోయినా భయపడరు కానీ శని విషయంలో మాత్రం టెన్షన్ పడతారు. ఏలినాటి శని, అర్టాష్టమ శని, అష్టమ శని ఉంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందని భావిస్తారు.

ఏలినాటి శని అంటే
జన్మ రాశి నుంచి శని… 12,1,2 స్థానాల్లో సంచరించే కాలాన్ని ఏల్నాటి శని అంటారు. ఈ 3 రాశుల్లో మొత్తం ఏడున్నర సంవత్సరాలు సంచరిస్తుంది.
శని 12వ స్థానంలో సంచరించేటప్పుడు వ్యవహారాల్లో చిక్కులు, వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఊహించని మార్పులు, అనారోగ్యం, మందులు వాడకం, తరచూ ప్రయాణాలు ఉంటాయి
జన్మరాశిలో అంటే శని ఒకటో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యభంగం, నీలాపనిందలు, భాగస్వాములతో వివాదాలు, మనశ్సాంతి ఉండకపోవడం, ధనవ్యయం, రుణబాధలు,వృత్తి-ఉద్యోగం-వ్యాపారంలో చికాకులు, స్థానచలన సూచన ఉంటుంది.
శని రెండవ రాశిలో సంచరిస్తున్నప్పుడు అన్ని పనులు అనుకున్నట్టే అనిపిస్తాయి కానీ ఏదీ పూర్తికాదు. అంటే ఆశ కల్పించి నిరాశపరుస్తాడు. ఇంకా అప్పుల బాధలు, అనారోగ్యం, మానసిక ఆందోళన ఉంటుంది.

మూడోసారి ఏలినాటి శని వస్తే కష్టమే
జీవితంలో మొదటిసారి వచ్చే ఏల్నాటి శనిని ‘మంగుశని’ అంటారు. రెండోసారి వచ్చే ఏల్నాటి శనిని ‘పొంగుశని’ అని అంటారు. ఈ కాలంలో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏదో ఒక సందర్భంలో సమస్యలు తీరుతాయి. కానీ మూడోసారి వచ్చిన శనిని ‘మృత్యుశని’ అంటారు. ఈ దశలో అనారోగ్య సమస్యలు, అపమృత్యు భయం తప్పవు. ప్రాణం పోయేంతవరకూ పరిస్థితులు వెళతాయని జ్యోతిష్యశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

జన్మరాశికి 4,8,10 స్థానాల్లో శని సంచరించడాన్ని అర్ధాష్టమ, అష్టమ, దశమ శని సంచారం అంటారు. ఇవి కూడా దోషమే.
అర్ధాష్టమ శని
జన్మరాశి నుంచి నాలగవ రాశిలో శని సంచరిస్తే అర్ధాష్టమ శని అంటారు. రాజకీయ, వ్యాపారాల్లో చిక్కులు, కుటుంబసమస్యలు, అశాంతి, ఆకస్మిక బదిలీలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు వంటి ఫలితాలు ఉంటాయి.

అష్టమ శని
జన్మరాశి నుంచి 8వ స్థానంలో శని సంచరించడాన్ని అష్టమ శని అంటారు. ఈ కాలంలో ఉద్యోగాల్లో ఆటంకాలు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు. ఆలోచనలు స్థిరంగా ఉండకపోవడం, అశాంతి, అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి.శత్రు బాధలు,ఊహించని నష్టాలు వస్తాయి.

దశమ శని
జన్మరాశి నుంచి 10వ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు కంటక శని అంటారు. దీనివల్ల కోర్టు కేసులు, సాంఘిక, రాజకీయంగా అపవాదులు, అధికారులతో విభేదాలు, ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు ఉంటాయి.

సోమరితనాన్ని శని క్షమించడు
మీ జాతకచక్రంలో శని మంచి స్థానంలో సంచరించకపోయినా గోచారంలో గురుబలం ఉంటే శని ప్రభావం అంతగా ఉండదు. ఇక శనిదోషం నుంచి ఉపశమనం లభించాలంటే శనివారం శనికి తైలాభిషేకం, జపాదులు చేయించుకోవచ్చు. మరో ముఖ్యవిషయం ఏంటంటే శని శ్రమకారకుడు. బద్ధకాన్ని, సోమరితనాన్ని అస్సలు సహించడు. శ్రమకారక జీవులైన చీమలకు పంచదారం వేయడం, పశు-పక్ష్యాదులకు ఆహారం-నీళ్లు ఏర్పాటు చేయడం వల్ల కూడా ఈ దోషం తగ్గుతుందంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.