పేదరిక నిర్మూలనలో ఉత్తర ప్రదేశ్ టాప్..

భూ విస్తీర్ణంలోనూ, జనాభా పరంగానూ అది అతిపెద్ద రాష్ట్రం. 20 కోట్లకు పైగా జనాభా ఉన్న ప్రదేశం. ఎప్పుడు చూసినా అక్కడి ప్రజలు పేదరికంలో మగ్గిపోయేవారు. పూటగడవటం కష్టంగా ఉండేది.ఉపాధి అవకాశాలు లేక అల్లాడిపోయే ఉత్తర ప్రదేశ్ జనానికి గత దశాబ్దం, దశాబ్దంన్నర కాలంగా మంచిరోజులు వచ్చాయి. ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమాల్లతో జనం ఏకమొత్తంగా పేదరికం నుంచి బయట పడుతున్నారు…

బహుముఖ పేదరిక సూచీతో వాస్తవ పరిస్థితులు వెల్లడి

బహుముఖ పేదరికం నుంచి రాష్ట్ర ప్రజలను బయటపడేయ్యడంలో ఉత్తర ప్రదేశ్ అగ్రభాగాన ఉంది. గత తొమ్మిదేళ్ల కాలంగా 5 కోట్ల 94 లక్షల మంది బహుముఖ పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ గణాంకాలు చెబుతున్నాయి. గత ఐదేళ్ల కాలంలోనే 3 కోట్ల 43 లక్షల మంది పేదరికం నుంచి విముక్తి పొందారంటే అది మామూలు విషయం కాదు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2015 -16 ఆర్థిక సంవత్సరంలో ఉత్తర ప్రదేశ్లో 37.68 శాతం పేదరికం ఉండేది. 2022-23 నాటికి అది 17.40 శాతానికి తగ్గింది.

అన్ని రంగాల్లోనూ కనిపిస్తున్న అభివృద్ధి

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదికల ఆధారంగా నీతిఆయోగ్‌ ఒక అంచనాకు వస్తుంది. బాలికా శిశు, బాలింతల ఆరోగ్యం, విద్య, పారిశుద్ధ్యం, విద్యుత్, మంచినీరు, సొంత ఆస్తులు, బ్యాంక్‌ అకౌంట్‌ తదితర పన్నెండు అంశాలను తీసుకుని పేదలను లెక్కగడతారు. అందులో అత్యధికం తినేందుకు పౌష్టికాహారం, ఉండేందుకు సరైన ఇంటి వసతి లేని వారి సంఖ్యే ఎక్కువగా ఉందని తేలినప్పుడు కూడా వారిని పేదల కింద లెక్కగడతారు.. అలాగే అధ్వాన స్థితిలో ఉన్న రోడ్లు, వసతులు, ఉపాధ్యాయులు లేని పాఠశాలలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల స్థితిగతులను అంచనా వేసి వారిని పేదలుగా పరిగణిస్తారు. యూపీలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు వసతుల కల్పనలో ప్రత్యేక ప్రాధాన్యమిచ్చింది. ఆకలి చావులు లేకుండా చూసుకుంటోంది. ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచేందుకు అవసరమైన పరిశ్రమలను, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తోంది. యూపీ పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు దేశానికే ఆదర్శమని బీజేపీ పెద్దలు చెబుతున్నారు…

దేశంలోనూ తగ్గిన పేదరికం

మోదీ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత గత పదేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. దాదాపు ఎనబై కోట్ల మందికి ఉచిత రేషన్ ఇవ్వడమే కాకుండా ఆహార కొరత రాకుండా చూసుకున్నారు. ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే చర్యలు చేపట్టడంతో పాటు ఆదాయాలు పెంచే దిశగా స్టార్టప్ లను ప్రోత్సహించారు. 2013-14లో దేశంలో 29.17 శాతం ఉన్న పేదరికం, 2022-23 నాటికి 11.28 శాతానికి తగ్గింది. పదేళ్ల కాలంలో 24 కోట్ల 82 లక్షల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు. అందులో ఉత్తర ప్రదేశ్, బిహార్ వాసులే ఎక్కువగా ఉన్నారు. అలాగే మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా సమగ్ర ప్రాంతీయాభివృద్ధిపై దృష్టి పెట్టి బహుముఖ పేదరికం నుంచి బయటపడుతున్నాయి.