2024 లోక్ సభ ఎన్నికలకు కేంద్రంలో ఎన్డీయేకు నాయకత్వం వహిస్తున్న బీజేపీ వడివడిగా సమాయత్తమవుతోంది. అన్ని వైపుల నుంచి విపక్షాల కంటే ఒక అడుగు ముందుండే ప్రయత్నం చేస్తోంది. అత్యధిక మెజార్టీతో గెలివాలన్న సంకల్ఫం వారిలో కనిపిస్తోంది తక్కువలో తక్కువగా 350 లోక్ సభా స్థానాలు సాధించాలన్న ఆకాంక్ష ఆ పార్టీ వర్గాల్లో కనిపిస్తోంది. దానితో సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. పైగా రాష్ట్రాన్ని బట్టి పార్టీ వ్యూహాలు మారుతున్నాయి. స్థానిక జనాభాను ఆకర్షించే దిశగా కూడా బీజేపీ పావులు కదుపుతోంది…
యూపీలో మిషన్ 80
బీజేపీ ఒకప్పుడు చాయ్ పే చర్చా నిర్వహించింది. పార్టీ విధానాలను జనంలోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు చాయ్ పే చర్చా ఉపయోగపడింది. జనంలో బీజేపీ పట్ల విశ్వాసం పెరిగింది. చాన్నాళ్ల తర్వాత ఇప్పుడు యూపీ బీజేపీ కూడా అదే బాటలో టిఫిన్ పే చర్చా లేదా ఖానే పే చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇవాళ (మంగళవారం) ప్రారంభమైంది. యూపీలో ఉన్న మొత్తం 80 లోక్ సభా స్థానాలను గెలిచి తీరాలన్న సంకల్పంతో సీఎం యోగీ ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు టిఫిన్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నెల రోజుల కార్యక్రమం
టిఫిన్ పే చర్చా నెల రోజుల పాటు నిర్వహించాలని యూపీ బీజేపీ నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని రెండు రకాలుగా ఏర్పాటు చేస్తున్నారు. నిర్దేశిత ప్రదేశానికి ప్యాక్ చేసిన టిఫిన్లు తీసుకొచ్చి తింటూ పార్టీ విధానాలు, తొమ్మిదేళ్ల మోదీ పాలనలో దేశం సాధించిన ప్రగతిని చర్చిస్తున్నారు. పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యవర్గ సభ్యులు నుంచి సాధారణ కార్యకర్తల వరకు టిఫిన్ పే చర్చాలో పాల్గొంటున్నారు.సామాన్య జనాన్ని కూడా భారీ సంఖ్యలో ఆహ్వానిస్తున్నారు. ఇళ్ల నుంచి కదల్లేని మహిళలు, వృద్ధులకు ప్రధాని మోదీ విధానాలు వివరించేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు నేరుగా వారి వారి నివాసాలను వెళ్లి మాట్లాడటం రెండో పద్ధతి. టిఫిన్ చేస్తూ ఆత్మీయంగా పలుకరించడంతో పాటు దేశ ప్రగతిని వివరిస్తున్నారు.
వచ్చే ఐదేళ్లకు పార్టీ విధానాల వివరణ
బీజేపీ సోషల్ మీడియా సైన్యం కూడా టిఫిన్ పే చర్చా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీని కోసం యూపీలోని 600 మంది సోషల్ మీడియా సైనికులకు శిక్షణ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రచారాన్ని కొనసాగిస్తూ జనంతో డైరెక్ట్ కాంటాక్ట్ ద్వారా పార్టీ విధానాలను వివరించేందుకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతోంది. యూపీలో యోగీ ప్రభుత్వం సాధించిన ప్రగతిని వివరించడం కూడా వారి బాధ్యత అవుతుంది 2024లో మోదీ గెలిచిన తర్వాత ఐదేళ్ల పాటు దేశాభివృద్ధికి కృషి చేసేందుకు చేపట్టే చర్యలు టిఫిన్ పే చర్చాలో భాగమవుతున్నాయి. ఈసారి యూపీలో ఒక్క లోక్ సభా స్థానంలో కూడా ఓడిపోకూడదన్న దృఢ సంకల్పంతో బీజేపీ శ్రేణులు పనిచేస్తున్నాయి.
త్వరలో అమిత్ షా, నడ్డా రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. నాలుగు రోజుల పాటు ఆయన మణిపూర్లో పర్యటిస్తున్నారు. ఆ పర్యటన పూర్తయిన తర్వాత అమిత్ షా యూపీ వచ్చే అవకాశం ఉంది. ఇంకా షెడ్యూల్ ఖరారు కానప్పటికీ వచ్చే వారం యూపీ పర్యటన ఉంటుందన చెబుతున్నారు. టిఫిన్ పే చర్చాలో పాల్గొని మోదీ విధానాలను స్వయంగా వివరించడమే కాకుండా కార్యకర్తలను ఆయన ఉత్తేజ పరుస్తారు. మరో పక్క టిఫిన్ పే చర్చాలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా యూపీలో పర్యటిస్తారని చెబుతున్నారు..