బిహార్ సీఎం నితీష్ కుమార్ పట్నాలో ఈ నెల 23న ఏర్పాటు చేస్తున్న విపక్ష నేతల సమావేశానికి పబ్లిసిటీ ఎక్కువ పని తక్కువ అన్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని పార్టీల నేతలు విపక్షాలతో కలిసేందుకే ఇష్ట పడటం లేదు. మరి కొందరు ఎలాగూ రారు కదా అని పిలవడం మానేశారు. జనంలో లేని పార్టీలు, అధికారానికి దూరంగా ఉండే పార్టీలే పట్నాలో ఎక్కువగా కనిపించబోతున్నాయన్న టాక్ నడుస్తోంది..
పట్నాయక్ ను ఆహ్వానించిన విపక్ష నేతలు
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ను ఆహ్వానించి ప్రయోజనం లేదనుకున్న విపక్షాల నేతలు ఆయన వైపు చూడలేదు. అంత బలమైన బీజేడీని వదులుకోవడానికి ఆ పార్టీ అంటీముట్టని వైఖరే కారణమని తేల్చారు. పట్నాయక్ పార్టీ అనధికారికంగా ఎన్డీయేలో ఉందన్నది విపక్షాల ఆరోపణ. మణిపూర్ హింసాకాండపై పట్నాయక్ ఒక్క మాట్ల మాట్లాడటం లేదని అక్కడ 250 చర్చిలను ధ్వంసం చేస్తే ఆయన స్పందించలేదని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెర్రిక్ ఓ బ్రెయిన్ ఆరోపించారు. పట్నాయక్ ఆర్సెస్సెస్ తో కలిసి పనిచేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ అంటుండగా అది ఒట్టి ఆరోపణ మాత్రమేనని తేలిపోవడం వేరే విషయం
ప్లీజ్ అర్థం చేసుకోండీ అంటున్న బీఆర్ఎస్
తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ పరిస్థితి ఆగమ్య గోచరంగా ఉంది. విపక్షాల మీటింగుకు బీఆర్ఎస్ ఆహ్వానిస్తే వచ్చే ప్రసక్తే లేదన్న మాట ఆ పార్టీ నేతల నోటి నుంచి రాలేదు. తమకు కొన్ని రాజకీయ అనివార్యతలున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో విపక్ష పార్టీల సరసన కూర్చోలేమని ఒక బీఆర్ఎస్ ఎంపీ వివరణ ఇచ్చుకున్నారు. అంటే భవిష్యత్తులో కలిసినా కలవొచ్చన్న సంకేతమూ అందులో ఉందని విపక్ష పార్టీల నేతలు అంటున్నారు. ఈ ఏడాది ఆఖరుకు తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కాంగ్రెస్ సరసన కూర్చుంటే తమకు ఇబ్బందిగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఆలోచన మారొచ్చని వాదన వినిపిస్తోంది.
ఆ మూడు పార్టీలపై డౌట్స్
వైసీపీ, బీఎస్పీ, జేడీఎస్ లను వేరుగా పరిగణించాల్సి ఉంటుందని అవకాశాన్ని, అవసరాన్ని బట్టి వారి వైఖరి మారుతుందని విపక్షాలు అంచనా వేసుకుంటున్నారు. ఏపీ అధికార పార్టీ వైసీపీ ఇప్పుడు బీజేపీకి సన్నిహితంగా ఉంది. రాష్ట్రంలో దాదాపుగా బీజేపీకి బీ టీమ్ గా పనిచేస్తోంది. అయితే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని బీజేపీ నిర్ణయించుకున్న పక్షంలో వైసీపీ తీరు మారొచ్చని విపక్షాలు ఎదురు చూస్తున్నాయి. అయితే జగన్ ఆలోచన ఎవరికీ అర్థం కాదన్న వాదన కూడా ఉంది. మరో పక్క బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆశలు, ఆకాంక్షలు వేరుగా ఉన్నాయి. అందుకే ఆమె ఎవరితో కలవలేక పోతున్నారు. విపక్షాలు కూడా ఆమెకు సాధ్యమైనంత దూరంగా ఉండాలనుకుంటున్నాయి. జేడీఎస్ అవకాశవాద పార్టీ అని అందరికీ తెలుసు.