తెలంగాణను అన్ని రకాలుగా ఆదుకుంటున్న.. ప్రధాని మోడీని రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. శనివారం ప్రధాని హైదరాబాద్ లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య వందే భారత్ ట్రైన్‌ను ప్రారంభించారు. అలాగే రిమోట్ ద్వారా పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులతో పాటు జాతీయ రహదారుల నిర్మాణం, బీబీ నగర్ ఎయిమ్స్ భవన నిర్మాణం, మహబూబ్ నగర్- చించోలి మార్గాన్ని 2 ప్యాకేజీలుగా విస్తరణ, ఖమ్మం – దేవరపల్లి రహదారిని 4 వరుసలతో గ్రీన్‌పీల్డ్ కారిడార్‌గా నిర్మాణం, MMTS రెండో దశను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు.
ఇక ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సభ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ నిలిచిపోయిందని, కేంద్ర ప్రభుత్వం మేడ్చల్ వరకు ఎంఎంటీఎస్‌ను స్టార్ట్ చేస్తోందని తెలిపారు. రాష్ట్రం సహకారం లేకున్నా.. MMTS ప్రారంభిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజలకు చాలా రకాల మౌలిక వసతులు కల్పించేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోని ప్రతి హిందూవు ఎప్పుడో ఒకసారి తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. వారి సౌకర్యార్థం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తిరుపతి వరకూ వందే భారత్ రైలును మోడీ అంకితం చేశారు. రూ.700 కోట్ల ఖర్చుతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ను వచ్చే 40 ఏళ్ల వరకూ ప్రయాణికుల రద్దీకి సరిపోయేలా అభివృద్ధి చేస్తున్నాం. మహబూబ్ నగర్ కు ఇప్పటి వరకు సింగిల్ లైన్ మాత్రమే ఉంది. MMTS- 2 ప్రాజెక్ట్ ఆగింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేదు. మేమే (బీజేపీ ఎంపీలు) ప్రధాని మోడీని అడిగి నిధులు తీసుకొచ్చాం’’ అని తెలిపారు.
మోడీకి అన్ని రాష్ట్రాలు సమానమే అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. లక్ష కోట్లకు పైగా తెలంగాణకు జాతీయ రహదారుల నిర్మాణాలకు ప్రధాని మోడీ నిధులు ఇచ్చారని చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎంతో లాభం చేశారని, రాష్ట్ర ప్రజలు మోడీకి మద్దతు తెలపాలని కోరారు.