పగవాడికి కూడా రాకూడదు ఇలాంటి కష్టాలు.. అని అనుకునేలా తయారైంది మాజీ మంత్రి పార్థసారథి పరిస్థితి. ఎన్నికలు దగ్గరపడుతున్న టైంలో టీడీపీలోకి షిఫ్ట్ అవ్వడానికి రెడీ అయ్యారు ఈ పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే.. వైసీపీ టికెట్ దక్కలేదని టీడీపీ వైపు చూస్తే.. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆయనపై భగ్గుమంటున్నారు. పోనీ ఈ సారి నూజివీడు నుంచి పోటీ చేద్దామనుకుంటే.. అక్కడి టీడీపీ ఇన్చార్జ్ ముద్రబోయిన మండిపడుతున్నారంట. ఆ సహాయ నిరాకరణలతో ఏం చేయాలో అర్థం కాక.. తలపట్టుకోవాల్సి వస్తోంది.
టిక్కెట్ పై హామీ ఇవ్వని టీడీపీ
కొలుసు పార్దసారధి.. మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే.. వైసీపీలో పెనమలూరు నుంచి గెలుపొందిన ఆయన ఆ పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తూ వచ్చారు. అయితే ఈ సారి టికెట్ రిజెక్ట్ అయి వైసీపీలో వాయిస్ పెంచే పరిస్థితి లేకపోవడంతో.. జగన్‌కి గుడ్ బై చెప్పి బయటకి వచ్చేశారు. పార్థసారథి రెండో సారి ప్రాతినిధ్యం వహిస్తున్న పెనమలూరు సెగ్మెంట్ ఇన్చార్జ్గా మంత్రి జోగు రమేష్‌ను ప్రకటించింది వైసీపీ.. దాంతో ఓవర్‌నైట్ లోకేశ్‌కి టచ్‌లోకి వెళ్లిపోయారాయన. పార్థసారథికి పెనమలూరు టీడీపీ టికెట్‌పై హామీ కూడా లభించినట్లు ప్రచారం జరిగింది. దాంతో పెనమలూరు టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే , ప్రస్తుత టీడీపీ ఇన్చార్జ్ బోడె ప్రసాద్ తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. టీడీపీ నుండి సారథికి సీటు ఫైనల్ అయిందన్న వార్తలు రావడంతో బొడే ప్రసాద్ తన వర్గం నేతలు , అభిమానులతో సమావేశాలు పెట్టారు. పెనమలూరు వచ్చిన చంద్రబాబు సమక్షంలోనే పెనమలూరు సీటు బోడెకు ఇవ్వాలని క్యాడర్ గొడగగొడవ చేశారు.
నూజివీడు తీసుకోవాలంటున్న టీడీపీ
పెనమలూరుకి బదులు నూజివీడు వెళ్లమని పార్టీ పెద్దలు పార్థసారథికి ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం మొదలైంది. దాంతో పెనమలూరు సీన్ నూజివీడుకు మారింది. పార్థసారథికి నూజివీడు ఆఫర్ ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారంలో నిజమెంతో కాని.. ఆయన అప్పుడే అక్కడి టీడీపీ నేతలతో రెగ్యులర్ టచ్‌లోకి వెళ్లిపోయారంట. సీక్రెట్ మీటింగులు పెట్టుకుంటూ.. మద్దతు కూడ గట్టుకునే పనిలో పడ్డారంట. అయితే నూజివీడు టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ముద్రబోయిన వెంకటేశ్వరరావు గత రెండు ఎన్నికల్లో ఓడిపోయినా.. కేడర్ని కాపాడుకుంటూ.. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పదేళ్ల నుంచి కష్టపడుతున్న తనకు కాకుండా ఎక్కడి నుండో వచ్చిన పార్థసారధికి సీటేంటని ముద్రబోయిన మండిపడుతున్నారు. పార్టీలో చేరకముందే నూజివీడు నేతలతో మంతనాలు సాగించడం ఏంటని ధ్వజమెత్తుతున్నారు. చంద్రబాబు సీటు తనకే అని హామీ ఇచ్చారని.. అపోహలు నమ్మొదంటూ కార్యకర్తలకు దైర్యం చెప్పే పనిలో పడ్డారు.
పట్టించుకోని చంద్రబాబు
వైసీపీకి ఆయన ఇప్పటికే దూరమయ్యారు. కానీ టీడీపీలో ఎటూ తేల్చడం లేదు. పసుపు జెండా మెడలో పడకుండానే నియోజకవర్గాలలో నాయకులు వైల్డ్‌గా రియాక్టవ్వడం చూస్తూ.. ఎక్కడ నుంచి పోటీ చేయాలో?.. పోటీ చేస్తే గెలవడానికి ఎన్ని తిప్పలు పడాలో? అని తలపట్టుకోవాల్సి వస్తోదంట. అసలే ఆయనకి టీడీపీ కొత్త.. పైగా ఇప్పుడు కొత్త సెగ్మెంట్‌కి మారాల్సి వస్తుందో.. చివరికి హ్యాండిస్తారోనని ఆయన కంగారు పడుతున్నారు.