సీబీఐ అధికారిగా పని చేసిన వీవీ లక్ష్మినారాయణ రాజకీయ నాయకుడ్ని అనడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ నవ్వుల పాలవుతున్నాయి. సమయం సందర్భం లేకుండా..అందులో నిజం ఉన్నా లేకున్నా అన్ని పార్టీల నేతల్నీ పొగిడేస్తున్నారు. ఆయన ఆత్రం చూసి అందరూ పాపం ఎవరైనా పార్టీలోకి తీసుకుని వెంటనే విశాఖపట్నం లోక్ సభ టిక్కెట్ ఇస్తామని ఆఫర్ ఇవ్వాలని సెటైర్లు వేస్తున్నారు. ఆయన తీరు అలాగే ఉంది. రాజకీయం చేస్తున్నానని అనుకుంటున్నారు కానీ.. ఏం చేస్తున్నారో ఆయనకైనా అర్థం అవుతుందో లేదో మరి !
ఫైనల్‌గా చంద్రబాబునీ పొగిడేసిన జేడీ లక్ష్మినారాయణ
తాజాగా చంద్రబాబునాయుడు విజన్ ను అభినందిస్తూ.. పెద్ద నోట్ల రద్దు విషయంలో చంద్రబాబు తాజాగా చేసిన సూచనలకు మద్దతిచ్చారు. రద్దు చేయాల్సిందేనని చెప్పుకొచ్చారు. చంద్రబాబునాయుడు తన విజన్ గురించి చిన్న పిల్లలకు చెబుతున్న ఓ కార్యక్రమంలో అన్న మాటల్ని పట్టుకుని ఇలా జేడీ.. ఎలాగైనా పొగడాల్సిందేనన్నట్లుగా సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. జేడీ లక్ష్మినారాయణ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది. టీడీపీలో చేరుతారా అన్న చర్చ ప్రారంభణయింది.
సీఎం జగన్, కేసీఆర్ లపైనా ప్రశంసలు
అయితే ఇంతకు ముందే చుక్కల భూముల విషయంలో సీఎం జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారని జగన్ నూ ప్రశంసించారు. అప్పుడు కూడా ఇదే చర్చ జరిగింది. వైసీపీలో చేరుతారా అని చెప్పుకున్నారు. అంతకు ముందు స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినప్పుడు బీఆర్ఎస్ చీఫ్ పైనా ప్రశంసలు కురిపించారు. బీఆర్ఎస్ లో చేరే విషయంలో చర్చలు జరిగాయని అప్పటికే ప్రచారం జరగడంతో ఇక బీఆర్ఎస్ లో చేరడం లాంఛనమే అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ లో చేరితే డిపాజిట్లు వస్తాయా రావా అని భయపడుతున్నట్లుగా కనిపిస్తోంది. బెటర్ ఆప్షన్ ఏమైనా ఉంటుందా అని ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉంది.
అసలు జనసేన నుంచి ఎందుకు బయటకు వచ్చారు ?
పవన్ కల్యాణ్ సినిమాలు చేయనని చెప్పారని.. పార్టీని వదిలేసి సినిమాలు చేస్తున్నందున తాను జనసేనకు రాజీనామా చేశానని గతంలో ప్రకటించారు. అయితే అలాంటి కారణాలకు పార్టీకి రాజీనామా చేస్తారా అని చాలా మంది ఆశ్చర్యపోయారు. ఇప్పుడు పవన్ పిలిచినా సరే ఆ పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నారు. జేడీ స్వయంగా రాజీనామా చేసి.. ఇప్పుడు మళ్లీ రావాలని పవన్ ఆహ్వానించడం ఏమిటన్నది జనసేనలో కొంతమంది నేతల అభిప్రాయం కావొచ్చు. కొన్ని కారణాల వల్ల ఆయన బీజేపీలో చేరలేరు.. టీడీపీలో అసలు చేరలేరు. ఆయన మార్గం జనసేన మాత్రమే. అందులో చేరాలనే ఆయనకూ ఉందని.. ఆయన స్పందన ద్వారా తెలుస్తోంది. జనసేన – టీడీపీ ప్రజాస్వామ్య పరిరక్షణకే కలుస్తున్నాయని అప్పుడప్పుడూ వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఎలాగైనా ఎంపీ అవ్వాలని లక్ష్యం !
విశాఖ నుంచే ఎన్నికలలో పోటీ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలో లేరు. కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం మాత్రం ఖాయమని చెబుతున్నారు. విశాఖ నుంచి పోటీ చేస్తానని ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం తర్వాత చెబుతానని అంటున్నారు. ఏ పార్టీలో కుదరకపోతే ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేస్తానని అంటున్నారు. ఇటీవల విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై న్యాయపోరాటం కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియదు కానీ .. అన్ని పార్టీల నేతల్నీ ఆయన పొగుడుతున్నారు. ఎవరో ఒకరు పిలిచి టిక్కెట్ ఇస్తారనే ఇలా చేస్తున్నారని అంటున్నారు. ఆయనను ఎవరైనా పిలిచి టిక్కెట్ ఆఫర్ చేసి పార్టీలో చేర్చుకోవాలని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.