ప్రపంచ దేశాల ఆర్ఖిక వ్యవస్థలు సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక గమనం ఈ క్యాలెండర్ సంవత్సరంలో 3.4 శాతం నుంచి 2.8 శాతానికి పడిపోయినట్లు ఐఎంఎఫ్ నిగ్గు తేల్చింది. డబ్ల్యూటీఓ లెక్కల ప్రకారం వాణిజ్య ప్రగతి 2.7 శాతం నుంచి 1.7 శాతానికి పడిపోయింది. నిన్నటి కొవిడ్, నేటి ద్రవ్యోల్బణం, రష్యా – ఉక్రెయిన్ యుద్ధం, వేర్వేరు దేశాల్లో రాజకీయ సంక్షోభాలు , సరుకు రవాణాలో ఇబ్బందులు ఆర్థిక వ్యవస్థను కిందకు జార్చాయి..
కష్టకాలంలో పుంజుకున్న భారత్
ప్రపంచ దేశాల్లో వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అగ్రగామిగా ఉందని నిగ్గు తేల్చారు. వస్తు, సేవల్లో భారత్ గతేడాది 766 బిలియన్ డాలర్లకు చేరుకోవడం ఒక రికార్డ్. సేవల రంగ ఎగుమతులు 30 శాతం పెరిగాయి. పెట్టుబడులను ఆహ్వానించడంతో భారత్ ఏకంగా మొదటి స్థానంలో ఉంది. ఆసియాలోకి వచ్చే ఆర్ అండ్ డీ పెట్టుబడుల్లో 50 శాతం భారత్ వైపే వస్తున్నాయి..
మోదీ ప్రభుత్వం సంస్కరణలు..
ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక సంస్కరణలే అభివృద్ధికి కారణమని అధ్యయనాలు చెబుతున్నాయి. ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు ఇస్తూ పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్, నేషనల్ లాజిస్టిక్ పాలసీ ఈ దిశగా ప్రయోజనం కలిగించాయి. లాజిస్టిక్ రంగంలో మన స్థానం 44 నుంచి 38కి చేరుకుంది.
ఎగుమతులపై దృష్టి
కేంద్ర ప్రభుత్వం ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టింది. 2030 నాటికి రెండు ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల రికార్డును సాధించాలన్న ఉద్దేశంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. మారిషస్, ఎమిరెట్స్ దేశాలతో ఇలాంటి ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియాతో ఎకనామిక్ కో-ఆపరేషన్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ) చేసుకున్నారు. బ్రిటన్ , కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్‌తో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలి విదేశీ వాణిజ్య విధానం ఇతర దేశాలతో ఒప్పందాలకు అవకాశం ఇస్తోంది.
భారత ప్రభుత్వ తాజా విధానాలతో ఉద్యోగావకాశాలు తగ్గిపోతాయని ఇంటా బయిట కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నా.. అందులో వాస్తవం లేదని తేలిపోయింది. త్వరలో రంగాల ఆధారంగా, దేశాల ఆధారంగా డేటా విడుదలైతే అటువంటి వారి అపోహలు పూర్తిగా తొలగిపోతాయి. పైగా చిన్న పరిశ్రమలను ఎగుమతులకు అనుసంధానం చేసే ప్రక్రియను వేగవంతం చేయడం శుభ పరిణామంగా చెప్పొచ్చు. మహానగరాలతో పాటు జిల్లా కేంద్రాలను ఎక్స్‌పోర్ట్ హబ్స్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే భారత్ ముందు మరో సమస్య ఉంది. మన ప్రభుత్వం తగిన పబ్లిసిటీ చేసుకోవడం లేదు. దానితో మన ప్రగతిని ఎవరూ గుర్తించడం లేదు. అదే జరిగినప్పుడు మన ప్రగతికి తిరుగుండదు..