ఏపీ బీజేపీ కి నూతన అధ్యక్షురాలిగా నియమితులైన పురందేశ్వరితో కలిసి నడిచి పార్టీని ఉన్నత స్థానంలో నిలబెడతామని బీజేపీ నేతలు ఉత్సాహంగా ప్రకటలు చేస్తున్నారు. ఆమె నియామకాన్ని స్వాగతిస్తున్నారు. సోము వీర్రాజు పదవి కాలం ముగియడంతో కొత్త అధ్యక్షుడ్ని నియమించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా బీజేపీలో కీలక మార్పులు చేస్తున్నందున.. ఏపీ అధ్యక్ష పదవిని కూడా భర్తీ చేశారు. పురందేశ్వరి నియామకం బెస్ట్ చాయిస్ అన్న అభిప్రాయాన్ని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి వ్యక్తం చేశారు.
భారత రాజకీయాల్లో మహిళా శక్తికి ప్రతిరూపం పురందేశ్వరి
భారత రాజకీయాల్లో మరో మహిళా శక్తికి దగ్గుబాటి పురందేశ్వరి ప్రతిరూపమని… ఆమె ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టనున్న సందర్భంగా ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు. ప్రత్యేక సందర్భంలో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ అనతి కాలంలోనే అద్భుతమైన వక్తగా, విషయ పరిజ్ఞానం ఉన్న నాయకురాలిగా.. సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎంతో అవగాహన ఉన్న గొప్ప నేతగా పేరు తెచ్చుకున్నారు. కేంద్రమంత్రిగా పార్లమెంట్లో పురందేశ్వరి గారి ప్రసంగాలు కానీ.. బీజేపీ నేతగా వారి ప్రసంగాలు క ప్రజలను ఆకర్షించాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదున్నారు.
విషయ పరిజ్ఞానం ఉన్న నేత
సమకాలిన అంశాలపై అంతటి అవగాహన ఉన్న నేతగా, పురందేశ్వరి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ వంద శాతం పురోగమిస్తుందని గట్టిగా నమ్ముతున్నానని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. గతంలో బీజేపీలో ఉమాభారతి , సుష్మాస్వరాజ్ , స్మృతి ఇరానీ లాంటి వాళ్లు పార్టీని ఎంతో సమర్థంగా ముందుకు నడిపించారు. వీరి కోవలోనే పురందేశ్వరి గారు కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తారని నమ్మకంతో ఉన్నామని.. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో బీజేపీ ఇంచార్జ్ గా ఆమె అద్భుతంగా రాణించారని గుర్తు చేసుకున్నారు. సంప్రదాయ రాజకీయాల్ని హుందాగా ప్రజల అభిమానాన్ని ఇప్పటికే పార్టీలకు అతీతంగా పొందారన్నారు.
వారసత్వాన్ని రాజకీయంగా ఉపయోగించుకోని హుందాతనం
ఎన్టీఆర్ బిడ్డ అయినా ఆ వారసత్వాన్ని రాజకీయాలకు ఎప్పుడూ వాడుకోని ఆత్మాభిమానం.. దేశం పట్ల, దేశాభివృద్ది పట్ల ఎనలేని సంకల్పం ఉన్న పురందేశ్వరి నాయకత్వంలో బీజేపీపార్టీని 2024 ఎన్నికల్లో ప్రధానమైన శక్తిగా నిలబడేలా చేయడంలో మేమంతా శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భిన్నం. ఇక్కడ బీజేపీ ఎదుర్కోవాల్సిన సవాళ్లు కూడా భిన్నమే. వాటన్నింటినీ మహిళా శక్తి నాయకత్వంలో ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ విషయంలో అధ్యక్షురాలిగా పురందేశ్వరి గారు అంచనాలకు తగ్గట్లుగా పార్టీ క్యాడర్ మొత్తం పని చేసి పార్టీ అభివృద్ధికి తో పాటు రాష్ట్రాన్ని సమైక్యంగా అభివృద్ధి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.