వైసీపీ సర్కార్‌పై రాజీలేని పోరాటం – కీలక అంశాలపై ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం

వచ్చే ఎన్నికలకు ముందు బీజేపీ కీలకమైన రాజకీయ తీర్మానం చేసింది. ప్రభుత్వంపై రాజీలేని పోరాటం చేయాలని డిసైడ్ చేసుకుంది. రాజకీయ తీర్మానంలోని కీలక అంశలు

ఆర్థిక స్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి !

ఆర్థిక బీభత్సం: రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ రాష్ట్ర భవిష్యత్ కు శరాఘాతంగా మారింది. ఆదాయం సృష్టించే ఆస్తులు కల్పన లేకుండా అధికారిక, అనధికారిక అప్పులు మరియు పెండింగ్ బిల్లులు కలుపుకొని రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల వైపు చేర్చే లక్ష్యంతో ముఖ్యమంత్రి జగన్ గారు పని చేస్తున్నారు. పాలన వైఫల్యం వల్ల రాష్ట్రంలో ప్రతి పౌరుని నెత్తిపైన సగటున 2.50 లక్షల రూపాయిల అప్పు భారం పడింది.
రాష్ట్ర ప్రభుత్వ వనరులైన పన్నుల ఆదాయం, అప్పులు మాత్రమే కాకుండా కేంద్రం ఇచ్చే నిధులను సైతం తమ జేబులోని స్వంత డబ్బులాగా ఇష్టారాజ్యంగా దారిమళ్లించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి పాలన పాటవానికి ప్రతీక. ఏ నెలలో అయిన సరే అప్పులు చేయకపోతే జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వైఎస్ఆర్సిపీ ప్రభుత్వం దిగజార్చింది. కొత్తగా తెచ్చే అప్పులు, ఇంతకుముందు చేసిన అప్పులపై ఉన్న వడ్డీలు, వాయిదాలు కట్టడానికి వాడే పరిస్థితి తప్ప రాష్ట్రానికి ఆదాయం సృష్టించే ఆస్తుల కల్పన కోసం వినియోగించకపోవడం శోచనీయం. ఇది రాష్ట్ర భవిష్యత్తును అంధకారమయం చేస్తున్నది. రాష్ట్ర వాస్తవ ఆర్థికస్థితి పైన శ్వేతపత్రం విడుదల చేయాలని బిజెపి తీర్మానం చేస్తోంది.

రోడ్ల పరిస్థితిపై ఆందోళన

మౌలిక సదుపాయాల కల్పనలో అధమం: రాష్ట్ర పరిధిలోనే జాతీయ రహదారులను కేంద్రం అద్భుతంగా నిర్వహిస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆర్ & బి మరియు పంచాయితీల రహదారులు మొత్తం గుంతల మయం. నిర్వహణ లోపం వల్ల గ్రామీణ ప్రాంతాలలో మరియు రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో పట్టణ రహదారులలో ప్రయాణం ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. గడచిన నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రహదారుల మరమ్మతుకు సమీక్షలతో కాలం వెళ్లబుచ్చారు కానీ కార్యక్షేత్రంలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు వాస్తవ పరిస్థితి రాష్ట్రంలో ఉంది. రహదారుల నిర్మాణానికి బడ్జెట్ ఖర్చు మిగిలిన రాష్ట్రాల సగటు 4.5% అయితే, ఆంధ్ర ప్రదేశ్ ది 1.3% అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

పంచాయతీల నిధులు ఇచ్చేయాలి !

పంచాయితీల హక్కుల హననం: గ్రామాలు దేశానికి పట్టుకొమ్మలు, వీటి పరిపుష్టికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫారసు మేరకు నేరుగా పంచాయతీలకు నిధులను ఇస్తుంటే, ఇప్పటి వరకు దాదాపు 9 వేల కోట్ల రూపాయిల మేరకు స్థానిక సంస్థల నిధులు దారి మళ్లించడం దారుణం. ఇక గ్రామ స్వపరిపాలను నిర్వీర్యం చేస్తూ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ మొదటి నుంచి గోషిస్తూనే ఉంది, కాగ్ సైతం రాష్ట్ర ప్రభుత్వ తీరును ఆక్షచింది. భారత రాజ్యాంగంలో పొందుపర్చిన విధంగా విధులు నిర్వహించేందుకు స్థానిక సంస్థలకు ఉన్న అధికారాలను వైకాపా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు బదలాయించింది. 73 మరియు 74వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా స్థానిక సంస్థలకు అధికారాల బదలాయింపు జరగాలని బీజేపీ తీర్మానిస్తోంది.

ఎస్సీ, ఎస్టీ, బిసి సబ్ ప్లాన్ నిధులు దారిమళ్లింపు

రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొదటి నాలుగు సంవత్సరాలలో ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ లో 1,02,700 కోట్ల రూపాయిలు కేటాయించి, అందులో 60 వేల కోట్ల రూపాయిలు పైగా కోత విధించారు. అలాగే ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు బడ్జెట్ లో 35 వేల కోట్ల రూపాయిలను కేటాయించి, అందులో 18 వేల కోట్ల రూపాయలకు పైగా కోత విధించారు. అంటే మొత్తం బడ్జెట్ కేటాయింపులు 1.62 లక్షల కోట్లలో 84 వేల కోట్ల రూపాయిల కోతలు విధించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది . బడ్జెట్ కేటాయింపులలో కోతలు ఒక వైపు అయితే, మరో వైపు వాస్తవంగా వినియోగించిన నిధులు కూడా నేరుగా ఎస్సీ మరియు ఎస్టీలకు చట్టబద్దంగా అమలు చేయవల్సిన పథకాలను వారికి అందించకుండా నవరత్నాలు తరలించామని చెబుతున్నారు

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు లేవు – యువతకు ఉపాధి లేదు

ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలం, కానీ రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రతికూలం. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పాలన నిర్ణయాల తీరు మరియు రాష్ట్రంలో అరాచక దాడులు వెరసి పరిశ్రమల ఏర్పాటుకు ప్రతికూలంగా మారాయి. గన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడగానే విద్యుత్ కంపెనీల ఒప్పందాల పీపీఏ లను రద్దు చేయడం, అమరావతిని నిర్వీర్యం చేయడంతో పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వైపు చూడ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకాశం జిల్లా కనిగిరి మరియు చిత్తూరు జిల్లా ఏర్పేడులలో వస్తు తయారీ పరిశ్రమల కోసం నిమ్జ్ ఏర్పాటుకు అనుమతి ఇస్తే వాటికి అవసరమైన 25 వేల ఎకరాల భూమి అందించడంలో విఫలం అయ్యింది.

రాజధాని అమరావతి

స్మార్ట్ సిటీ గా , హెరిటేజ్ సిటీగా రాజధాని అమరావతిని గుర్తించింది, ఔటర్ రింగ్ రోడ్ ప్రతిపాదన ఆమోదించింది, రాజధాని నుండి రాయలసీమకు కొత్త జాతీయ రహదారి మరియు రాజధాని నుండి మచిలీపట్టణం కు రెండు వరసల రహదారిని నాలుగు వరుసల రహదారిగా తీర్చిదిద్దడం జరిగింది, భూములిచ్చిన రైతులకు వారి భూమి అమ్మకాల పైన మరియు బదలాయింపు పైన క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ మినహాయింపు ఇచ్చి ప్రోత్సహించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి పాలన దృష్టి లోపం వల్ల ముందు పేర్కొన్న అన్ని ప్రాంతాలకు సంబందించిన పారిశ్రామిక వాడలు మరియు రాష్ట్ర రాజధాని నిర్మాణం నిర్వీర్యం చేయడం వల్ల రాష్ట్రంలో అడుగు పెట్టాలనుకున్న పారిశ్రామిక వేత్తలు బెంబేలెత్తారు.

రాబోయే మూడు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయు.అనేక పార్టీలు మాయమాటలతో తప్పుడు వాగ్దానాలతో మళ్లి మన ముందుకు వస్తున్నాయి. కావున ఈ రాష్ట్ర అభివృద్ధి అన్ని రంగాల్లో జరగాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బీజేపీ పిలుపునిచ్చింది.