కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేరుతో ఏకంగా ఓ పుస్తకం రిలీజ్ చేసింది. అందులో నలభై పేజీలు ఉన్నాయి. ఇప్పటికే ఆరు గ్యారంటీల పేరుతో ప్రచారం చేస్తోంది. వాటిలో ఐదు గ్యారంటీల్ని అమలు చేయలేక కర్ణాటకలో కిందా మీదా పడుతోంది. కానీ తెలంగాణలో ఆరు గ్యారంటీలు దానికి తోడు.. వందల కొద్దీ హామీలు. ఇవన్నీ ఎలా అమలు చేస్తారో కాంగ్రెస్ కనీస మాత్రంగా కూడా ఆలోచన చేయడం లేదు. ముందుగా ఓట్లు పొందాలన్న తాపత్రయంతోనే అన్నీ ఉచితం అనే హామీలు ప్రకటించింది.
ఐదేళ్ల బడ్జెట్ సరిపోదు
కాంగ్రెస్ ప్రకటించిన మేనిఫెస్టోలో హామీల్ని అమలు చేయాలంటే ఐదేళ్ల బడ్జెట్ సరిపోదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఫలానాది చేస్తామని చెప్పే ముందు చేయడానికి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి సమకూర్చుకుంటారో కూడా చెప్పాల్సింది. బీఆర్ఎస్ పాలన ఫలితంగా తెలంగాణ అప్పుల్లోకి వెళ్లిపోయింది. జీతాలు కూడా సమయానికి ఇవ్వలేకపోతున్నారు. ఇలాంటి ప రిస్థితుల్లో కాంగ్రెస్ మేనిఫెస్టోను అమలు చేయలేరు. అమలు చేసేందుకు ప్రయత్నించినా తెలంగాణ దివాలా తీస్తుంది.
ప్రజలు ఎలా నమ్ముతారు ?
ఏదో ఒకటి, రెండు హామీలు అంటే నమ్ముతారు కానీ.. ఇలా వందల కొద్దీ హామీలతో మేనిఫెస్టో రిలీజ్ చేస్తే ఎవరు నమ్ముతారు .. కనీసం ఈ మాత్రం ఆలోచన కూడా కాంగ్రెస్ చేయలేదు. ఏదో విధంగా ఓట్లు కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ప్రజల్ని మోసం చేయడానికి వెనుకాడని విదంగా మేనిఫెస్టో ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. జాబ్ క్యాలెండర్ ఎప్పుడెప్పుడు ఇస్తామో కూడా మేనిఫెస్టోలో పెట్టడం.. యువతను మోసం చేయడమే. అసలు ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గురించి అవగాహన లేని హామీలు అవి. యువత ఈ హామీలని కామెడీగా తీసుకుంటున్నారు కానీ నమ్మలేకపోతున్నారు.
2018లో ఇంత కంటే పెద్ద హామీలు – ఎవరూ నమ్మలేదు !
రైతులకు రెండు లక్షల రుణమాఫీ సహా అనేక హామీల్ని కాంగ్రెస్ 2018లో కూడా ఇచ్చింది. కానీ అప్పుడు ఎవరూ పట్టించుకోలేదు. ఓటర్లు అసలు పరిగణనలోకి తీసుకోలేదు. ఈ సారి కూడా అదే పరిస్థితి ఉండనుంది. గతంలోనే తిరస్కరిస్తే.. మళ్లీ అవే హామీలతో ఎందుకు తెర ముందుకు వచ్చారన్నది ఎవరికీ అర్థం కాని విషయం. స్ట్రాటజిస్టులను నమ్ముకుంటే.. ఇదే పరిస్థితని.. కాంగ్రెస్ లో ద్వితీయ శ్రేణి నేతలు అసంతృప్తికి గురవుతున్నారు.