తృణమూల్ కాంగ్రెస్ పాలనలో పశ్చిమ బెంగాల్ రౌడీ రాజ్యంగా మారుతోంది. పార్టీ శ్రేణులు ఇష్టానుసారంగా ప్రత్యర్థులపై దాడులు చేస్తున్నాయి. అడిగే దిక్కులేదన్న ధైర్యంగా వారు ప్రవర్తిస్తున్నారు. బీజేపీ నేతలే కాదు అధికారులపై సైతం దాడులు జరుగుతున్నాయి. వీటికి మమతా బెనర్జీ మద్దతు ఉందని తాజా సంఘటనలు మరోసారి నిరూపించాయి. కొట్టండి అనే మాటే గానీ ఆపండి అలా దాడులు చేయడం తప్పు అని మమతా బెనర్జీ ఎక్కడా మాట్లాడిన పాపాన పోలేదు.
ఈడీ అధికారులపై తృణమూల్ గూండాల దాడి
పశ్చిమ బెంగాల్లో సోదాలకు వెళ్లిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులపై అధికార తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత అనుచరులు మూకుమ్మడి దాడికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. మారణాయుధాలతో అధికారులను భయభ్రాంతులకు గురిచేయడంతో పాటు వారి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో వారు ప్రాణభయంతో పారిపోయారు. ఈ ఘటనలో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. దీనిపై రాష్ట్ర గవర్నర్ సి.వి.ఆనంద బోస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించి ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం రాష్ట్రంలో 15 చోట్ల సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉత్తర 24 పరగణాల జిల్లా సందేశ్‌ఖాలీ ప్రాంతంలో స్థానిక తృణమూల్ నేత షేక్ షాజహాన్ ఇంటికి వెళ్లగా లోపలినుంచి తాళం వేసి ఉంది. దీంతో భద్రతగా వచ్చిన సీఆర్పీఎఫ్ జవాన్ల సాయంతో తలుపు పగలకొట్టడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో షేక్ షాజహాన్ అనుచరులు, స్థానికులు దాదాపు వెయ్యి మంది ఒక్కసారిగా అక్కడికి వచ్చి ఈడీ అధికారులతో వాగ్వాదానికి దిగి వారిపై దాడికి పాల్పడ్డారు. తుపాకులు, ఇతర ఆయుధాలతో వారిని భయపెట్టారు. అడ్డుకోవడానికి యత్నించిన సీఆర్పీఎఫ్ సిబ్బందిపైనా దాడికి తెగబడ్డారు. దాడికి దిగినవారు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో జవాన్లు వారిని నిలువరించలేకపోయారు.
తలపగిన ఆస్పత్రిలో చేరిన అధికారులు
తృణమూల్ కార్యకర్తల దాడిలో తలపగిలి ముగ్గురు అధికారులు ఆస్పత్రిలో చేరారు. వారి వద్ద ఉన్న సెల్ ఫోన్లు, పర్సులు, చేతి గడియారాలు సైతం రౌడీ మూకలు దోచుకున్నాయి. తమను చంపేందుకే ఆ గుంపు వచ్చిందని అధికారులు భయపడిపోయారు. అదృష్టవశాత్తు బతికి పోయామని వారన్నారు. తాళం తీసేందుకు నిరాకరించినందునే తలుపురు పగులగొట్టాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. కర్రలు, లాఠీలు, రాళ్లు పట్టుకుని వచ్చిన తృణమూల్ కార్యకర్తలను చూస్తే ఏదో జరిగిపోతుందన్న భయం ఏర్పడిందన్నారు..
గవ్నరర్ సీరియస్,మమత రాజీనామాకు బీజేపీ డిమాండ్
దాడికి సంబంధించి ప్రభుత్వం తరపున ఎలాంటి చర్యలు తీసుకోవాలో తాను ప్రయత్నిస్తానని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ తెలిపారు. మమత బెనర్జీ ప్రభుత్వం వెంటనే రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఆమె ప్రభుత్వ కొనసాగింపు జాతి భద్రతకు ముప్పుగా పరిణమిస్తుందని ఆరోపించింది. ఈడీ అధికారులపై దాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఇండియా కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పట్టికీ భౌతికదాడులను సహించేది లేదని లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత అథిర్ రంజన్ చౌదరి అన్నారు.