ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే అన్నది ఒక హిందీ సామెత. అంటే దొంగోడే పోలీసును కొట్టాడన్నది దాని అర్థం. గురువారం ఢిల్లీలో అదే జరిగింది. పార్లమెంటులో ప్రశ్నలు అడిగినందుకు ముడుపులు పుచ్చుకున్న తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన నైజాన్ని మరో సారి ప్రదర్శించారు. నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ అన్ పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించారు. పైగా తనపైనే అసభ్య పదజాలాన్ని ఉపయోగించారని ఎదురుదాడికి ప్రయత్నించారు.
నైతిక విలువల కమిటీ ఎదుట హాజరు
మహువా మొయిత్రాకు నోటీసులు అందడంతో ఆమె పార్లమెంటరీ నైతిక విలువల కమిటీ మందు హాజరై తన వాదన వినిపించేందుకు ప్రయత్నించారు. అడ్డంగా బుక్కయిపోయానని ముందే తెలిసిందున విచారణ మొదలైనప్పటి నుంచి కమిటీపైనా, బీజేపీపైన ఎదురుదాడి చేశారు. మొయిత్రా విపక్ష ఎంపీ అయినందున ప్యానెల్ లోని విపక్ష సభ్యులు ఆమెకు మద్దతిచ్చారు. కమిటీ చైర్మన్ వినోద్ సోంకర్ ఇతర సభ్యులు ప్రశ్నలు అడగడం పూర్తి కాకముందే మొయిత్రా సహా విపక్ష సభ్యులంతా వాకౌట్ చేశారు. విచారణ సమయంలో మొయిత్రా అసభ్య, అన్ పార్లమెంటరీ పదజాలాన్ని వాడారని కమిటీ చైర్మన్ అయిన బీజేపీ ఎంపీ వినోద్ సోంకర్ వెల్లడించారు. పార్లమెంటు తనకిచ్చిన లాగిన్లోకి వెళ్లేందుకు వేరొకరికి అవకాశం కల్పించడం లాంటి అనైతిక చర్యలపై విచారణకు పిలిస్తే ఆమె తమపైనే ఆరోపణలు చేశారని వినోద్ అంటున్నారు.
విపక్ష ఎంపీలు సైతం తిట్ల పురాణం
మొయిత్రా దాడి ఒక వంతయితే విపక్ష ఎంపీలు డేనిష్ అలీ, గిరిధర్ యాదవ్ కూడా అనైతికంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. కమిటీ నిర్వహణ తీరును తప్పుపడుతూ అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారు. వ్యాపారవేత్త దర్శన్ హీరనందాని ఫిర్యాదులోని అంశాలకు సమాధానం చెప్పకుండా తప్పించుకునేందుకు వారి పన్నాగమే తిట్ల పురాణమని, అందుకే మధ్యలో వెళ్లిపోయారని బీజేపీ అంటోంది. గోప్యంగా ఉంచాల్సిన కమిటీ విచారణాంశాలను విపక్ష నేతలు బయటకు చెప్పేందుకు, బురద చల్లేందుకు ప్రయత్నించారని వినోద్ సోంకర్ ప్రధాన ఆరోపణ.
వ్యక్తిత్వ హననానికి ప్రయత్నించారంటున్న మొయిత్రా
మహువా మొయిత్రా వాదన మాత్రం మరోలా ఉంది. కమిటీ చైర్మన్ సహా కొందరు సభ్యులు తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ప్రశ్నలు అడిగారని ఆమె ఆరోపించారు. ప్యానెల్ విచారణ నుంచి మధ్యలో బయటకు వచ్చిన నేపథ్యంలో ప్రతీ ఒక్కరి మీద గయ్యిమని ఎగిరిపడ్డారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలతో పాటు రాత్రి ఎవరికి ఫోన్ చేస్తుంటావు లాంటి ప్రశ్నలు కూడా వినోద్ సోంకర్ అడిగారని ఆమె ఆరోపించారు. తనను తీవ్ర అవమానానికి గురి చేశారని ఆరోపించారు. ఈ అవమానం ద్రౌపది వస్త్రాపహరణం లాంటిదేనని ఆవేదన వ్యక్తం చేశారు.నిజంగా నా కళ్లలో నీళ్లు కనిపిస్తున్నాయా అని విలేకర్లను ప్రశ్నించారు. మహువాకు మద్దతుగా వాకౌట్ చేసిన ఐదుగురు ఎంపీల్లో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు. కమిటీ ఛైర్మన్ తీరుపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వినోద్ కుమార్ సోంకర్ నైతికతను మరిచి, అసభ్యకరమైన ప్రశ్నలు అడిగారని, దీనితో తనతోపాటు అయిదుగురు ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారని చెప్పారు. దుబాయికి ఎందుకు వెళ్లావు, ఎవరితో వెళ్లావు, నీ ఫోన్‌తో ఎవరెవరితో మాట్లాడావు, ఆ ఫోన్ మాకివ్వండి అంటూ చైర్మన్ మాట్లాడారని ఉత్తమ్ వెల్లడించారు.మహువా మాజీ సహచరుడిని ఉపయోగించుకుని ఆమెను అవమానించేందుకు, అప్రతిష్ఠ పాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. ఇరు పక్షాలు తమ వాదనలను బలపరుచుకునే ప్రయత్నంలో ఉన్న నేపథ్యంలో ఏది నిజమో త్వరలో తేలుతుంది.