రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత వసుంధరా రాజే పనైపోయిందని పార్టీలోనూ, బయట కొందరు ప్రత్యర్థులు ప్రచారం మొదలు పెట్టారు. పార్టీ ఆమెను దూరం పెట్టిందని, ఇకపై సీఎం అభ్యర్థిగా ఆమె కొనసాగే అవకాశం లేదని కూడా ప్రచారం చేశారు. రాజే కూడా పార్టీకి దూరం జరిగారని కొందరు వదంతులు వ్యాపంపజేశారు.
మేడమ్ కు నడ్డా, అమిత్ షా ప్రశంసలు
ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ రాజస్థాన్లో బీజేపీ పరివర్తన్ సంకల్ప యాత్రలు నిర్వహిస్తోంది. నాలుగు దేశలుగా నిర్వహిస్తున్న ఈ యాత్రలను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అయా ప్రాంతాల్లో జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. రవాణా శాఖామంత్రి నితిన్ గడ్కరీ కూడా ఒక యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని యాత్రలకు వసుంధరా రాజే హాజరవుతున్నారు. ముగ్గురు నేతలు గతంలో రాజే ప్రభుత్వం చేపట్టిన పనులను ప్రత్యేకంగా ప్రస్తావించి ఆమె సేవలను ప్రశంసిస్తున్నారు. రాజే ముఖ్యమంత్రిగా ఉనప్పుడు రాజస్థాన్ అభివృద్ది పథంలో నడిచిందని అమత్ షా పొగిడారు. రాజే పాలనను, గెహ్లాట్ పాలనను బేరీజు వేసుకుంటే అప్పట్లో జరిగిన అభివృద్ధి అర్థమవుతుందని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు.
కమిటీల్లో చేర్చనందుకేనా…
ఇటీవల ఏర్పాటు చేసిన ఎన్నికల మేనేజ్ మెంట్ కమిటీ, మేనిఫెస్టో కమిటీలో వసంధర రాజే పేరు చేర్చలేదు. దానితో ఆమెను పక్కన పెట్టేశారని, ఆమె ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండరని కొందరు ప్రచారం చేశారు. జాతీయ నేతలు వచ్చి రాజేను ప్రశంసించడంతో అలాంటి వారి ఆలోచన తప్పని తేలిపోయింది. ఇకపై ఆమెకు పూర్తి ప్రాధాన్యం లభిస్తుందని, పార్టీ ప్రచారంలో రాజే ప్రధాన భూమిక వహిస్తారని చెబుతున్నారు.
రాజే సభకు లక్ష మంది..
రాజే ఇప్పటికీ రాజస్థాన్లో మోస్ట్ పాపులర్ లీడర్. రాష్ట్ర శాఖ తరపున నిర్వహించే సభలకు పెద్దగా జనం రాకపోయినా, రాజే సభ పెడితే మాత్రం భారీగా జనం వచ్చేస్తున్నారు. కోటా దగ్గరి సంబుపూరాలో రాజే నిర్వహించిన బహిరంగ సభకు లక్ష మంది అభిమానులు హాజరయ్యారు. ఇదీ నడ్డా, అమిత్ షా సభల కంటే కూడా ఎక్కువేనని చెప్పాలి. దీనితో రాజే జనాకర్షక నేతగా పేరు పొందారు. ఆమెకు ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ పటిష్టమవుతుందని వాదించే వాళ్లూ ఉన్నారు. మరి అధిష్టానం ఆ పని చేస్తుందో లేదో చూడాలి…
2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయిన తర్వాత తనకు సముచిత స్థానం దక్కలేదని రాజే అలిగారు. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఆమె అలక తీర్పాల్సిన బాధ్యత సంబంధిత ఇంఛార్జులపై ఉంది.