టిడిపి, జనసేన పొత్తులో తగ్గేదెవరు? నెగ్గేదెవరు?… ఇదీ జిల్లాలో నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో సాగుతున్న ఆసక్తికర రాజకీయం. నెల్లిమర్ల సీటు కోసం జనసేన ఆశపడుతుండగా, అది గెలిచే సీటు కాబట్టి ఓసారి లోతుగా ఆలోచించాలని టిడిపి అధినేత అంటున్నట్టుగా సమాచారం.
నెల్లిమర్ల సీటు కోరుతున్న జనసేన
నెల్లిమర్ల సీటుపై ఇరు పార్టీలు ఆసక్తి చూపుతున్నాయి. విజయనగరం జిల్లాలోగానీ, నెల్లిమర్లలో గానీ జనసేనకు ఉన్న సొంత బలం ఎంత? అన్నది కాసేపు పక్కనబెడితే… నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి గతంలో పోటీచేసిన అభ్యర్థి ఈసారి ఎలాగైనా రంగంలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పలుమార్లు పవన్ కల్యాణ్‌ను కలవడంతో తాజాగా ఇరు పార్టీల నేతల మధ్య జరిగిన చర్చల్లో నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం గురించి ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మొత్తం తమకు కేటాయించబోతున్న సీట్లలో విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ స్థానం కూడా వదిలిపెట్టాలని పవన్ కల్యాణ్ ప్రతిపాదన పెట్టినట్టుగా తెలిసింది.
టీడీపీకి అయితేనే గెలుపు అవకాశాలు ఉంటాయంటున్న టీడీపీ
తమ పార్టీకి చెందిన స్థానిక నేత తొలి నుంచీ ప్రజలను అంటిపెట్టుకుని ఉన్నారని, ఎన్నికల్లో పోటీని తట్టుకునే స్థోమత కూడా ఉందని, ఈనేపథ్యంలో తమకు రిజర్వు చేయాలని బాబుకు వివరించినట్టుగా సమాచారం. ఈ విషయంలో చంద్రబాబు తటపటాయించినట్టుగా తెలిసింది. ఆ స్థానంలో తాము దింపాలనుకుంటున్న అభ్యర్థి సామాజిక కోణాన్ని బట్టి సునాయాశంగా గెలిచే అవకాశం ఉంటుదని, జనసేన తరపున అటువంటి అవకాశం ఉంటుందా? లేదా అన్నది మరోసారి సున్నితంగా ఆలోచించాలని బాబు చూసించినట్టు సమాచారం. నెల్లిమర్ల స్థానంలో గజపతినగరం సీటును కేటాయించే విషయంలో కూడా చర్చ జరినట్లు తెలిసింది.
నెల్లిమర్ల అందరికీ కీలకమే
ఓవైపు సముద్రతీరం, మరోవైపు విలాసవంతమైన రిసార్ట్స్, వాటికి ఆనుకుని వీటికి అనుసంధానంగా బెంగుళూరు-కోల్కత్తా జాతీయ రహదారి, దీనికితోడు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు రాబోతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం ఖరీదైన ప్రాంతంగా మారింది. ఎయిర్‌పోర్టు పూర్తయితే దేశ, విదేశాలకు చెందిన నేతలు, రాష్ట్ర కేంద్ర మంత్రులు ఈ ప్రాంతం నుంచే వచ్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. స్థానిక ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ కూడా అనివార్యంగా ఎక్కువగానే ఉంటుంది. ఈ కోణంలో టిడిపి నెల్లిమర్లను అంత సులువుగా వదులకునే పరిస్థితి లేదని పలువురు విశ్లేషిస్తున్నారు. అసలు తక్కువ సీట్లు, అందులోనూ పోటీచేసేందుకు అనువుగాను, అభ్యర్థులు ఆసక్తి చూపిన చోట ఇవ్వకపోతే ఎందుకు? అన్నట్టుగా జనసేనలో చర్చనడుస్తోంది. సమన్వయం లేకపోతే ఓట్ల బదిలీ జరగని అంతిమంగా అది ఓటమికి దారి తీస్తుందని అంటున్నారు.