టమాట ఎకానమీ – ప్రస్తుతానికి వినియోగదారులకు శుభవార్త

వినియోగదారుల జేబులకు చిల్లులు పెట్టి కళ్లు బయర్లు కమ్మెట్టుగా చేసిన టమాట ధరలు ఇప్పుడిప్పుడు కాస్త ఊరటనిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ఐనా ప్రభుత్వాల్లో మాత్రం మార్పు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే వినియోగదారుడు నష్టపోవాలి, లేకుండా రైతు నష్టపోవాలి మనకేంటి కష్టం అన్నట్లుగా ప్రభత్వాలు చోద్యం చూడటంపై విమర్శలు వస్తున్నాయి.

రూ. 300 నుంచి రూ. 30

గత నెల టమాట ధరలు వణుకుపుట్టించాయి. ఉత్తరాదిన రూ. 300 వరకు పలికిన ధరలు.. దక్షిణాదిన రూ. 150 దాకా చేరాయి. సంప్రదాయ వ్యవసాయ క్షేత్రాల్లో టమాట పంట దెబ్బతిని డిమాండ్ కు సరిపడా సప్లై లేకపోవడమే ఇందుకు కారణంగా చెప్పుకున్నారు. వర్షాల కారణంగా పంట దెబ్బతిన్నదని ప్రచారం చేసిన హోల్ సేల్ మార్కెట్ల వర్గాలు ధరలను అమాంతం పెంచేశాయి. పైగా ఉత్తరాదిన వర్షాలకు రోడ్లు దెబ్బతిని రవాణా జరగలేదని మరో మాట చెప్పేశారు. దానితో కస్టమర్లు నానా తంటాలు పడ్డారు.

తొలగిన సెప్టెంబరు భయం..

నిజానికి సెప్టెంబరు ఆఖరు వరకు ధరలు పెరుగుతూనే ఉంటాయని, దక్షిణాదిన కూడా రేట్లు రూ. 300 వరకు వెళతాయని అనుమానించారు. కాకపోతే ఇంతలో పంట కాస్త మెరుగుపడి టమాట సరఫరా పెరగడంతో గత వారం రోజులుగా ధర తగ్గింది. హైదరాబాద్ లో గత వారం రోజులుగా రూ. 50 వద్ద స్ఠిరంగా ఉంది. స్టోర్స్ లో యాభై రూపాయల వరకు ఉండగా, బండ్ల మీద రూ. 40 పలుకుతోంది.తమిళనాడు రాజధాని చెన్నైలోని కోయంబేడు మార్కెట్ల టమాట ధర రూ. 30 వరకు దిగివచ్చింది. తమిళనాడులోని కృష్ణగిరి, పొరుగున ఉన్న కర్ణాటక నుంచి టమాట లోడ్లు రావడంతో ధరలు దిగివచ్చాయని హోల్ సేల్ వ్యాపారులు చెబుతున్నారు. ఏపీ, తెలంగాణలో కూడా టమాట దిగుబడి పెరిగింది. అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో పంట రెట్టింపు అయ్యిందని రైతులే చెబుతున్నారు.

రైతులకే ఊరట, కష్టం రెండూనూ…

టమాట ధరలు రూ. 150కి చేరినప్పుడు దేశంలో మొదటి సారి టమాట రైతులు బాగుపడినట్లుగా కనిపించింది. ఒకరిద్దరూ రైతులకు కోటి రూపాయల వరకు ఆదాయం కూడా వచ్చింది. అంతలోనే ధరలు దిగివచ్చాయి. దానితో అన్నదాతలకు మళ్లీ నష్టాల భయం పట్టుకుంది. ధరలు పెరిగినప్పుడు రైతులు కొంతమేర ప్రయోజనం పొందినా.. అమాంతం పడిపోయినప్పుడు నష్టాలు మూటగట్టుకుంటున్నారని వ్యాపారులే అంగీకరిస్తున్నారు. ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతుల వద్ద నుంచి సేకరించి తక్కువ ధరకు అమ్మి ధరల స్థిరీకరణకు ప్రయత్నిస్తోంది. ధరలు తగ్గినప్పుడు మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయినప్పుడు కూడా రైతుల దగ్గర మంచి ధరకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ ఉంచితే తర్వాత విక్రయించే వీలుుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.