ప్రధాని మోదీ, ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతం అదానీని ఇరికించేందుకు దర్శన్ హీరనందానీ సేవలను తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా వినియోగించుకున్న వ్యవహారం చినికి చినికి గాలివానలా మారుతోంది. లోక్ సభలో ప్రశ్నలు అడగటానికి డబ్బులు తీసుకుని కక్కుర్తి పడిన మిస్ మొయిత్రా ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి దోషిగా నిలబడే పరిస్థితి వచ్చింది. దానితో ఆమె కల్లబొల్లి కబుర్లు చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో బోల్తా పడుతున్నారు.
పార్లమెంట్ అకౌంట్ లాగిన్ ఇచ్చిందీ నిజమే..
లోక్ సభ సభ్యులైనా రాజ్యసభ సభ్యులైనా ప్రతీ ఒక్కరికీ పార్లమెంటు సిస్టమ్ లో లాగిన్ ఉంటుంది. తమ ప్రశ్నలను, అభిప్రాయాలను లాగిన్ లోకి వెళ్లి నమోదు చేసుకోవచ్చు.దాన్నే ఇప్పుడు మహువా మొయిత్రా దుర్వినియోగపరిచారన్న అంశాలు ససాక్ష్యంగా బలపడుతున్నాయి. వారం రోజులుగా నలుగుతున్న వివాదంలో వాస్తవాలను వెల్లడి చేస్తూ ప్రధాని మోదీని టార్గెట్ చేసేందుకు మొయిత్రా అదానీ గ్రూపుపై ఆరోపణలు సంధించారని అందుకు తన సేవలను వినియోగించారని హీరనందానీ గ్రూపు అధినేత దర్శన్ హీరనందానీ ప్రకటించారు. ఈ మేరకు ఆయన మూడు పేజీల అఫిడవిట్ విడుదల చేశారు. సభహక్కుల ఉల్లంఘన అంశం కావడంతో తాను అఫిడవిట్ విడుదల చేస్తున్నానని చెప్పిన హీరనందానీ .. పార్లమెంటు లాగిన్ ఇచ్చి.. అదానీకి వ్యతిరేకంగా ప్రశ్నలు అందులో సంధించాలని మొయిత్రా కోరినట్లు చెప్పారు. క్యాష్ ఫర్ క్వశ్చన్స్ అంశం నిజమేనని ఒప్పుకున్నారు. అందుకు తాను కూడా అంగీకరించానని, దీని వల్ల విపక్ష పాలిత రాష్ట్రాల్లో తన వ్యాపారాలకు మద్దతు లభిస్తుందని ఎదురుచూశానన్నారు. ప్రశ్నల రూపకల్పనలో విపక్ష నేతలు, జర్నలిస్టులు, అదానీ గ్రూపు మాజీ ఉద్యోగులు సాయం చేశారని కూడా వెల్లడించారు. ఈ క్రమంలో సుచేతా దలాల్ అనే వ్యక్తి పేరును ప్రస్తావించారు. అయితే ఈ ఆరోపణలను సుచేతా దలాల్ ఖండించారు.
ప్రధాని మోదీ ఇమాజ్ ను దెబ్బతీసేందుకే..
మొయిత్రా డిమాండ్లకు అంతు లేదని, నిత్యం ఏదోటి అడుగుతూ ఉండేవారని కూడా హీరనందానీ వెల్లడించారు. మైత్రి కోసం ఇరుక్కుపోయి బయటకు రాలేక ఆమె అడిగిందల్లా ఇచ్చామన్నారు. ఖరీదైన వస్తువులు అడిగేవారని, ఢిల్లీలో ఎంపీ క్వార్టర్ మరమ్మత్తు ఖర్చు తానే భరించానని, ఫ్లైట్ టికెట్లు కొనివ్వమని అడిగేవారని, కుటుంబ సభ్యుల విహారయాత్రలను స్పాన్సర్ చేయమని అడిగేవారని వెల్లడించారు.ఆమెకు కోపం వస్తే విషయం బయటపడి పోతుందన్న ఆలోచనతో అడిగినవన్నీ చేశానని హీరనందానీ చెప్పారు. కేవలం ప్రధాని మోదీ ఇమేజ్ ను దెబ్బతీసేందుకే తృణమూల్ ఎంపీ ఇంతటి స్థితికి దిగజారారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.అయితే నిష్కళంక ఖ్యాతితో, తన పాలనా విధానాలతో ఎవరూ వేలెత్తి చూపలేని విధంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారంటూ హీరనందానీ కితాబిచ్చారు.
అఫిడవిట్ పెద్ద జోక్…
దర్శన్ హీరనందానీ అఫిడవిట్ పెద్ద జోక్ అని మహుల్ మొయిత్రా అంటున్నారు. తెల్లకాగింత మీద రాసి రెండు మూడు మీడియా సంస్థలకు పంపితే అది అఫిడవిట్ అవుతుందా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. హీరనందానీ మెడ మీద కత్తిపెట్టి ప్రధాని కార్యాలయం ఆయనతో లేఖ రాయించిందని ఆమె ఆరోపించారు. ఆఫిడవిట్ అంటే నోటరీ చేయకుండా ఇవ్వరన్న సంగతి వ్యాపారికి తెలియనిది కాదని మోదీకి భయపడి అలా చేశారని ఆమె వాదిస్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో జరగాల్సింది ఇంకా చాలా ఉందనుకోవాలి. దర్శన్ హీరనందానీని సీబీఐ లేదా పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ పిలిపించినప్పుడే మొత్తం విషయం బయటకు వచ్చే అవకాశం ఉంది.