గ్రహణం కేవలం గ్రహాలలో మార్పు..భూమి సూర్యుడు, చంద్రుని మధ్య జరిగే ఒక చర్య అంటారు శాస్త్రవేత్రలు. జ్యోతిష్య శాస్త్రంపై చాలా ప్రభావం చూపిస్తుందని విశ్వసిస్తారు పండితులు. అందుకే గ్రహణ నియమాలు తప్పనిసరిగా పాటిస్తారు..గ్రహణం ఏ రాశిలో ఏర్పడుతుందో ఆయా రాశుల వారు గ్రహణం చూడరాదని హెచ్చరిస్తారు. మరీ ముఖ్యంగా గ్రహణకాలంలో గర్భిణులు జాగ్రత్తగా ఉండకపోతే ఆ ప్రభావం పుట్టబోయే పిల్లలపై పడుతుందంటారు. ఈ ఏడాదిలో ఈరోజే (మే 5) తొలి చంద్రగ్రహణం. సమయం ఎప్పుడు,ఈ గ్రహణం ఎక్కడెక్కడ కనిపిస్తుంది, నియమాలు పాటించాలా వద్దా చూద్దాం…
శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మొత్తం 4 గ్రహణాలు సంభవిస్తున్నాయి. అందులో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే తొలి సూర్యగ్రహణం ఏర్పడగా.. మొదటి చంద్రగ్రహణం వైశాఖ పౌర్ణమి, బుద్ధపౌర్ణమి రోజు సంభవిస్తోంది . చంద్రుడు సూర్యుని మధ్య భూమి వచ్చినపుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. గ్రహణ సమయంలో భూమి మీదకు నేరుగా పడే కిరణాల తరంగ ధైర్ఘ్యం ఎక్కవగా ఉండడం వల్ల వీటిలో రేడియే షన్ ఎక్కువ అని సైన్స్ కూడా చెబుతోంది. అందువల్ల భూమి మీద వాతావరణంలో చాలా మార్పులొస్తాయి. ఈ మార్పుల కారణంగా శరీరంలో జీవక్రియలు మందగిస్తాయి. అందుకే గ్రహణం ప్రారంభం కావడానికి రెండు మూడు గంటల ముందుగానే భోజనం ముగించమని చెబుతారు.
భారతదేశంలో కనిపించదు
చంద్ర గ్రహణం 2023 మే 5 శుక్రవారం రాత్రి దాదాపు 8:45 గంటలకు ప్రారంభమై అర్థరాత్రి 1:00 గంటకు ముగుస్తుంది. గ్రహణం ప్రారంభం కావడానికి 9 గంటల ముందు సూతకం ప్రారంభమై గ్రహణం ముగియడంతో ముగుస్తుంది. ఈ సమయంలో ఆలయాల తలుపులు మూసేస్తారు. ఈ ఏడాది ఏర్పడే తొలి చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందుకే సూతక కాలం పాటించాల్సిన అవసరం లేదు. యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, అంటార్కిటికా, మధ్య ఆసియా, పసిఫిక్ అట్లాంటిక్ , హిందూ మహాసముద్రంలో ఇది కనపడుతుంది.
పెనంబ్రల్ చంద్రగ్రహణం
ప్రతి 19 సంవత్సరాలకు ఒక సారి ఏర్పడే ఇలాంటి చంద్రగ్రహణాన్ని పెనంబ్రల్ చంద్రగ్రహణం అంటారు. గ్రహణానికి ముందు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కానీ ఈ సారి చంద్రుడు ఎరుపు రంగులో కాకుండా చీకట్లో ఉన్నట్టుగా కనిపిస్తాడు. ఇందుకు కారణం భూమి చంద్రుడి కంటే 5 డిగ్రీలు ఎత్తులో ఉండడం వల్ల ఇలా జరుగుతుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు. అందువల్లే ఇది పెనంబ్రల్ చంద్ర గ్రహణం అయింది. సాధారణంగా ఏర్పడే చంద్ర గ్రహణాన్ని అంబ్రల్ చంద్రగ్రహణం అంటారు.
నియమాలు పాటించాలా-వద్దా
భారత దేశంలో ఈ గ్రహణం కనిపించదు కాబట్టి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుభకార్యాలపై ఎలాంటి ప్రభావం ఉండదని జ్యోతిష్యశాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే గ్రహణం ఏర్పడటానికి ముందు నుంచి గ్రహణం ముగిసే వరకు ఉన్న సమయాన్ని అశుభమైనదిగా పరిగణిస్తారు. ఈ సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని కొందరు పండితులు చెబుతారు. మనదేశంలో గ్రహణం కనిపించదు కాబట్టి నియమాలు మాత్రం పాటించాల్సిన అవసరం లేదంటున్నారు. అయితే ఎలాగూ గ్రహణం అర్థరాత్రి ముగుస్తుంది కాబట్టి..తెల్లారగానే ఇల్లంతా కడిగిన తర్వాత దీపారాధన చేయాలి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం కొన్ని పుస్తకాలు, పండితుల నుంచి సేకరించినది మాత్రమే. దీనిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.