టిడిపి, జనసేన పొత్తులో భాగంగా తిరుపతి అసెంబ్లీ సీటును జనసేనకు కేటాయిస్తున్నట్లుగా టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెనాయుడు వెల్లడించారు. జనసేన సీటులో జనసేన అభ్యర్థులే పోటీ చేస్తారని, టిడిపి ఆశావాహులు ఆశించరాదని ఇప్పటికే అధినేత నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే బిజెపి అధినేతలతో సంప్రదింపుల నేపథ్యంలో వారూ తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీను ఆశిస్తున్నారు.
బుజ్జగింపులపై చంద్రబాబు, పవన్ దృష్టి
బుజ్జగింపుల పర్వం అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు తలనొప్పి కానుంది.తిరుపతి ఆశావాహులు ఎం.సుగుణమ్మ, నరసింహయాదవ్, వూకా విజయకుమార్, డాక్టర్ కోడూరు బాలసుబ్రమణ్యం, జెబి శ్రీనివాస్‌లు జనసేన అభ్యర్థి గెలుపుకు సహకరించాలని ఆదేశించారు. టిడిపి అధికారంలోకి వస్తే మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మకు ఎంఎల్‌సి, మిగిలిన వారికి రాష్ట్రస్థాయిలో పదవులు ఇస్తామని బుజ్జగించినట్లు తెలుస్తోంది. . ఎలాగైనా ఎంఎల్‌ఎ అభ్యర్థిగా పోటీచేసి మిత్రపక్షమైన జనసేనలోకి వెళ్లేందుకు సుగుణమ్మ, వూకా విజయకుమార్, జెబి శ్రీనివాస్ ప్రయత్నించారు. జనసేన నేతలతో సంప్రదింపులు చేస్తున్నారు.
పవన్ పోటీ చేయకపోతే తమకే ఇవ్వాలని పలువురు నేతల పోటీ
చంద్రబాబు సూచన మేరకు రాష్ట్రంలో పవన్‌కల్యాణ్ సునాయాసంగా గెలిచే సీటు తిరుపతి అని, భీమవరం, పిఠాపురం నుంచి పోటీ చేయొద్దని సూచించారన్న ప్రచారం జరుగుతోంది. ఇక్కడ బలిజలు టిడిపి, జనసేనల్లో ఎవరు పోటీ చేసినా పవన్‌కల్యాణ్ మినహా మిగిలిన ఎవరికైనా స్థానిక బలిజలకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చిత్తూరు సిట్టింగ్ ఎంఎల్‌ఎ ఆరణి శ్రీనివాసులు వైసిపికి రాజీనామా చేసి జనసేన కండువా కప్పుకున్నారు. అక్కడ టిడిపి అభ్యర్థి గురజాల శ్రీనివాస్‌ను ప్రకటించడంతో తిరుపతికి వలసొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమలో తిరుపతి, రాజంపేట పార్లమెంట్, తిరుపతి, శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాలు కావాలని బిజెపి కోరినట్లు తెలుస్తోంది.
బీజేపీకి కేటాయించాల్సిన సీట్లపై చర్చ
అరకు, రాజంపేట, తిరుపతి, అనకాపల్లి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని, తిరుపతి అసెంబ్లీ జనసేనకు ఇస్తామని బిజెపి అధినేతలకు చంద్రబాబు వివరించినట్లు సమాచారం. ఒకవేళ పవన్‌కల్యాణ్ పోటీ చేయకపోతే డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్‌రాయల్ పేర్లు వినిపిస్తున్నాయి. మాజీ ఎంఎల్‌ఎ సుగుణమ్మ మాత్రం జనసేన కండువా కప్పుకుంటే ఆమె పేరూ వినిపిస్తోంది. ఏదిఏమైనా టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో భాగంగా తుది జాబితా ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉంది.