అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రామయ్య విగ్రహ ప్రాణ ప్రతిష్టకు దేశ విదేశాల నుంచి కూడా ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రపంచంలోనే మూడో అతి పెద్ద హిందూ దేవాలయంగా అయోధ్య రామాలయం నిలవనుంది. అటువంటి అయోధ్య రామాలయానికి తెలుగు రాష్ట్రాల నుండి అనేక కానుకలు అందుతున్నాయి. ఈ లిస్టలో తిరుమల కూడా చేరింది…
రాముడి పాదుకలను హైదరాబాద్ నుంచి తయారు చేయించి పంపిస్తే, అయోధ్య మందిర ద్వారాలు కూడా హైదరాబాద్ లోనే రూపు దిద్దుకున్నాయి. అయోధ్య రామాలయానికి 118 దర్వాజాలు హైదరాబాద్ బోయినపల్లి లోని అనురాధ టింబర్ డిపోలో తయారు చేయించారు. సీతారామ చంద్రుడికి అయోధ్య భాగ్యనగర సీతారామ ఫౌండేషన్ సుమారు రూ.1.03 కోట్ల విలువైన బంగారం పాదుకలను రామయ్యకు పంపించింది. ఇప్పుడు రామాలయ ప్రారంభానికి తిరుమల శ్రీవారి ఆలయం నుంచి కానుకలు పంపనున్నారు.
అయోధ్యకు లక్ష లడ్డు ప్రసాదం
శ్రీవారి ఆలయం నుంచి లక్ష లడ్డు ప్రసాదాలు పంపిస్తున్నట్లు TTD ఈఓ ఎ.వి.ధర్మారెడ్డి తెలిపారు. ఈనెల 22న పంపుతున్నామన్నారు. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ట, రామ మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చే భక్తులకు ఈ లడ్డూలు ప్రసాదంగా ఇస్తారు. ఒక్కో లడ్డూ బరువు 25 గ్రాములు.
తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఏర్పాటు చేసిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భాగంగా ధర్మారెడ్డి మాట్లాడారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నామని, ఈ సదస్సుకు దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరవుతారని వెల్లడించారు
అయోధ్యలో వేంకటేశ్వరుడు
మరోవైపు తిరుపతి ట్రస్ట్ అయోధ్యలోనూ లార్డ్ వేంకటేశ్వర దేవాలయం ప్రతిరూప ఆలయ నిర్మాణానికి భూమి కేటాయింపు కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అనుమతి కోసం ఎదురు చూస్తోంది. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రత్యేకించి టీటీడీ ట్రస్టు వారి శ్రీవెంకటేశ్వర ఆలయాలు నిర్మించాలని యోచిస్తున్న టీటీడీ ఇప్పటికే జమ్మూ, న్యూఢిల్లీ, హర్యానా, మహారాష్ట్ర, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోని కురుక్షేత్రలో ఆలయాలను నిర్మించింది. అయోధ్యలో అనుమతులు వస్తే త్వరలో వేంకటేశుడు అక్కడ కూడా కొలువుతీరనున్నాడు..