ఈ ఆలయంలో బావిలో నీళ్లు తాగాక వెనకడుగు వేసిన టిప్పు సుల్తాన్

విఘ్నాలకు అధిపతి వినాయకుడు. పార్వతీ తనయుడైన లంబోదరుడిని పూజించిన తర్వాతే ఏ కార్యాన్ని అయినాప్రారంభిస్తారు. వినాయకుడికి ఊరికో ఆలయం ఉంది, దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాలెన్నో ఉన్నాయి. అలా పార్వతీ తనయుడికి ఉన్న విశిష్ట ఆలయాల్లో కేరళ కాసర్‌గోడ్‌ జిల్లాలో మధూరు ఒకటి. మంగళూరు విమానాశ్రయానికి 70 కిలోమీటర్ల దూరంలో మధురవాహిని నదీ తీరంలో, ప్రకృతి రమణీయత మధ్య కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తారు.

స్వామివారి విగ్రహాన్ని గుర్తించిన ఓ మహిళ
మధూరు ఆలయంలో ప్రధాన దైవం పరమేశ్వరుడు. ఈ క్షేత్రంలో మదరాంతేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. స్థలపురాణం ప్రకారం ఒక మహిళ స్వామివారి విగ్రహాన్ని కనుగొంది. అందుకే ఆమె పేరుపై మధూరు ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ గర్భగుడి వెలుపల దక్షిణ భాగం గోడపై వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం రోజురోజుకూ పెరుగుతుండటం విశేషం. అందుకే బొడ్డ గణేశా అని పిలుస్తుంటారు. ఇక్కడ ప్రధాన దైవం శంకరుడు అయినా వినాయకుడికి విశేషపూజలు నిర్వహించడం క్షేత్ర ప్రాముఖ్యతను వెల్లడిస్తుంది.

వెనక్కు తగ్గిన టిప్పు సుల్తాన్
స్థానిక కథనం ప్రకారం టిప్పుసుల్తాన్‌ ఆధ్వర్యంలోని సేనలు మలబార్‌పై దండెత్తాయి. ఈ క్రమంలోనే సేనలంతా ఆలయంలోకి చేరుకున్నాయి. దాహం వేయడంతో ఆలయ ప్రాంగణంలో ఉన్న బావిలోని నీటిని తాగాడు టిప్పు సుల్తాన్. ఆ నీటిని తాగగానే టిప్పు సుల్తాన్ మనసు మారిందట. దండయాత్రను విరమించుకుని వెనక్కు వెళ్లాడని చెబుతారు.

ఏనుగు ఆకారంలో ఆలయం
ఆలయాన్ని ఏనుగు ఆకారంలో నిర్మించారు. మూడు అంతస్తులుగా ఉండే ఆలయం సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తుంది. కేరళ సంప్రదాయ వంటకమైన అప్పాన్ని ప్రసాదంగా ఇస్తారు. మహాగణపతికి ఉదయాస్తమానసేవ, సహస్ర అప్పాల పూజ, మూడప్పమ్‌ సేవ..ఇలా గణపతికి విశేష పూజలు జరిపిస్తారు.

ప్రార్థన
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే

గమనిక: కొందరు పండితులు, కొన్ని పుస్తకాలు ఆధారంగా సేకరించిన సమాచారం ఇది. దీనిని ఎంత వరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.