కేంద్ర ప్రభుత్వ నిధులోత టీడీపీ ప్రభుత్వం పట్టణ మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి సంస్థ (టిడ్కో) ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు గృహ నిర్మాణాలను చేపట్టింది. ఏపీలో 4 లక్షల టిడ్కో గృహాలు పూర్తి చేశారు. మరో 6 లక్షల ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు, టిడ్కో ద్వారా బ్యాంకులు కూడా పెద్ద ఎత్తున రుణాల రూపంలో వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు చేరడంలేదు.
ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా టిడ్కో ఇళ్లు
300 చదరపు అడుగుల గృహానికి లబ్ధిదారుడి వాటా రూ.500 కాగా, 365 చ.అడుగులకు రూ.50 వేలు, అలాగే 430 చ.అడుగులకు రూ.లక్ష మాత్రమే. ప్రతి యూనిట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీ రూ.1.50 లక్షల చొప్పున, మొత్తం రూ.3 లక్షలు ఉంటుంది. యూనిట్‌ను బట్టి బ్యాంకు రుణాలూ ఉంటాయి. 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.3.15 లక్షలు, 430 చదరపు అడుగుల గృహానికి రూ.3.65 లక్షలు బ్యాంకు రుణ సదుపాయం కల్పిస్తోంది. 240 వాయిదాల్లో చెల్లించాలి. ఇలా అందరికీ అనువైన ఇళ్లను ప్రభుత్వం సిద్ధం చేసింది కానీ ప్రభుత్వాల నిర్వాకంతో ప్రజలకు అందకుండా పోతున్నాయి.
రాజకీయ కారణాలతో ప్రజలకు ఇబ్బంది పెట్టిన పార్టీలు
మహా నగరాల్లోని అపార్ట్‌మెంట్లను తలపించేలా ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపికా జరిగింది. వారి నుంచి డబ్బులు వసూలు చేశారు. చాలా మందికి ఇళ్లను రిజిస్టరు కూడా చేసేశారు. అయినా ఒక్కరికీ ఇల్లు మాత్రం ఇవ్వలేదు. కాపురాలు లేక పూర్తయిన ఇళ్లు కళావిహీనంగా మారాయి. నిర్మాణంలో ఉన్న వాటిలో ముళ్లతుప్పలు పెరిగిపోయి దారుణంగా కనిపిస్తున్నాయి. టిడ్కో ఇళ్లకు రాజకీయ గ్రహణం పట్టింది. పునాది దశలో ఉన్న గృహాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. లబ్ధిదారులు చెల్లించిన డిపాజిట్లను మాత్రం వెనక్కి ఇవ్వలేదు. తాము అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్లకు సంబంధించి బ్యాంకుల్లో చెల్లించాల్సిన మొత్తం సొమ్మును మాఫీ చేస్తామని జగన్ ప్రకటించారు. అయితే ఆ హామీ కూడా నెరవేరని పరిస్థితి నెలకొంది. టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకున్న పరిస్థితి నెలకొందని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు.
రాజకీయ కారణాలతో వేల కోట్లు వృధా
రాజకీయలబ్దికోసం వేల కోట్లు ప్రజాధనం వృధా చేయడంపై ఆందోళన వ్యక్తమయింది. బీజేపీ పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. అయియితే టిడ్కో గృహాల వద్ద 144 సెక్షన్ పెట్టి వైసీపీ ప్రభుత్వం ఉద్యమాలను అణచివేసే ప్రయత్నాలు చేసింది. తాజాగా టిడ్కో ఇళ్లు పంపిణీ చేస్తామని బయలుదేరారు కానీ కనీస సదుపాయాలు కల్పించలేదు. ఫలితంగా ఆ ఇళ్లు నివాసానికి అనుకూలంగా ఉండటం లేదు. మొత్తంగా రాజకీయ పార్టీలు ప్రజల్ని రాజకీయ కోణంలోనే చూసి ఇబ్బందులు పెడుతున్నాయి కానీ ఇళ్లు మాత్రం ఇవ్వడం లేదు.